– పాదయాత్రలో వున్నా మనసంతా మంగళగిరిపైనే
– సమస్య ఉందని మెసేజ్ పంపినా కూడా స్పందిస్తా
– నేను చేసిన సంక్షేమంలో కనీసం 10 శాతం అయినా ఎమ్మెల్యే చేశాడా ?
-పార్టీలో వందలాది మంది చేరికల సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే దేశమంతా మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా ప్రగతిపథంలో నడిపిస్తానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో గురువారం నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తాను స్వల్ప తేడాతో ఓడిపోయినా నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రజల కోసం 23 సంక్షేమ పథకాలు- అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నానని తెలిపారు. ఆరోగ్యరథం, పెళ్లికానుక, తోపుడు బండ్లు, జలధార, కుట్టుమిషన్లు, వెల్డింగ్ మిషన్లు, పండగ కానుకలు, చేనేతలు-స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత తనదేనన్నారు.
మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఓడిపోయిన వారైనా నేను చేసినట్టు సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేశారేమో కనుక్కోండని ప్రజలకి సూచించారు. మీరు రెండుసార్లు గెలిపించిన ఎమ్మెల్యే వల్ల మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? నేను చేసిన సంక్షేమంలో కనీసం 10 శాతం అయినా చేశాడా అని ప్రశ్నించగా, లేదంటూ జనాలు జవాబిచ్చారు. తనని గెలిపిస్తే పేదరికం లేని, ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
నేను పాదయాత్రలో వున్నా మనసంతా మంగళగిరిపైనే ఉంటుందన్నారు. ప్రతీరోజూ మంగళగిరి నియోజకవర్గం, ప్రజల బాగోగుల గురించి తెలుసుకుంటూనే ఉంటానన్నారు. ఎవరైనా కష్టంలో ఉన్నానని, సమస్య ఉందని మెసేజ్ పంపినా కూడా స్పందిస్తానని భరోసా ఇచ్చారు. వైకాపా పాలనలో అభివృద్ధి లేదని, ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగుల కోసం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి అందరి జీవితాలు బాగుపడతాయన్నారు.
కోర్టు పని మీద జనజైత్రయాత్ర యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి వచ్చిన లోకేష్ సమక్షంలో జాయినింగ్ కార్యక్రమాలు జాతరలా సాగాయి. వందలాది మంది వైకాపా వాళ్లు తమ కుటుంబాలతో కలిసి వచ్చి తెలుగుదేశం వెంటే తాముంటామంటూ నినదించారు. అందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశంలోకి లోకేష్ ఆహ్వానించారు. నేటి నుంచి మనమంతా టిడిపి కుటుంబసభ్యులమని, టిడిపి బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీలో చేరినవారు, టిడిపి నేతలతో లోకేష్ సెల్ఫీలు దిగారు.