– న్యూ రెన్యువబుల్ ఎనర్జీ శాఖ జాయింట్ సెక్రటరీగా ఉత్తర్వులు
అమరావతి: ఐఏఎస్ సుబ్రమణ్యానికి కేంద్రంలో కీలక పోస్టింగ్ వరించింది. న్యూ రెన్యువబుల్ ఎనర్జీ శాఖకు జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అస్పాం కేడర్ కి చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్‌గా సుబ్రమణ్యం జవ్వాది ..గతంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కమిషనర్‌గా, ఏపీఐఐసీ ఎండీ, ఏపీఈడీబీ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ తర్వాత డిప్యుటేషన్ లో కేంద్ర ఎకనమిక్ ఎఫైర్స్ శాఖకు డైరెక్టర్ గా వెళ్లారు. అనంతరం ఆయనకు ఇటీవల కేంద్రం జాయింట్ సెక్రటరీ హోదా కల్పించింది. 2047 కల్లా 100 గిగావాట్ల అణువిద్యుత్ సామర్థ్యంతో భారత ప్రభుత్వం అడుగులేస్తోంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ వెలుగులు అందించాలన్న సంకల్పంతో ముందుకెళుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ-2024 ప్రకారం రూ.10 లక్షల కోట్ల విలువైన 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు లక్ష్యాన్ని ఏపీ నిర్దేశించుకుంది. దీనివల్ల 7.50 లక్షల మందికి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించాలనుకుంటోంది.తెలుగువాడైన ఐఏఎస్ సుబ్రమణ్యం పునరుత్పాదక శక్తి శాఖలో ఉండడం ఏపీకి కలిసొచ్చే అంశం.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ నుంచి 11.56 లక్షల దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. 2025 ఏడాదికి గానూ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిల్జీ యోజన, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, సోలార్ మాడ్యుల్ పీఎల్ఐ పథకాలకు భారత ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తెలుగువాడైన ఐఏఎస్ సుబ్రమణ్యం కేంద్ర పునరుత్పాదకశక్తి శాఖలో ఉండడం ఏపీకి కలిసొచ్చే అంశం కానుంది.