-
ఎంపీల గైర్హాజరీపై అసంతృప్తి
-
పార్టీ కార్యక్రమం కంటే పనులు ఎక్కువా?
-
కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రులకు ఫస్ట్ ర్యాంక్
-
చివరి మూడుస్థానాల్లో కడప, అల్లూరి, తూర్పు జిల్లా ఇన్చార్జి మంత్రులు
-
సత్యకుమార్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్‌రెడ్డికి ఫస్ట్ ర్యాంక్
-
గుమ్మడి సంధ్యారాణి, సవిత, నిమ్మల రామానాయుడుకు చివరి మూడు స్థానాల ర్యాంకులు
-
సోషల్‌మీడియా వినియోగంలో వెనుకబడ్డ మంత్రి కొండపల్లి
-
చివరి స్థానంలో మంత్రి ఫరూఖ్
-
సోషల్‌మీడియాను వినియోగించుకోవాలని ఆదేశం
-
53 శాతం అనుకూల ఓటింగ్‌ను 60 శాతానికి తీసుకువెళ్లాలి
-
మంత్రులు, పార్టీ జోనల్ ఇన్చార్జిలకు, ఎంపీలకు సీఎం చంద్రబాబు క్లాసు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, ఎంపీల పనితీరుపై టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబునాయుడు పెదవి విరిచారు. గైర్హాజరయిన ఎంపీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలకు పార్టీ పనుల కంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ లోక్‌సభలో టీడీపీ నేత లావు శ్రీకృష్ణరాయలుకు క్లాసు ఇచ్చారు. అదే అంశంపై అనంతపురం ఎంపి అంబికా లక్ష్మీనారాయణపై అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఇన్చార్జి మంత్రుల పనితీరుపై బాబు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు.
మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్చార్జిలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్షలో, వారి పనితీరు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గత ఎన్నికల్లో వచ్చిన 53 శాతం అనుకూల ఓటింగును 60 శాతానికి పెంచేందుకు ఎమ్మెల్యే-జిల్లా ఇన్చార్జి మంత్రి-జోనల్ ఇన్చార్జిలు సమన్వయంతో పనిచేయాలని బాబు సూచించారు. ప్రతి పార్లమెంటు పరిథిలోని ఎంపి-ఎమ్మెల్యే-జోనల్ కో ఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేయాలి. ఏదైనా సమస్య ఉంటే ఆ క్షేత్రస్థాయి సమస్యలను, సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని జోనల్ కో ఆర్డినేటర్లకు సూచించారు.
కాగా ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు, వారు తప్పు చేస్తే ఆ బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. ‘మీ జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మన పార్టీ క్యాడర్, లీడర్లే వారి పనితీరుపై ఫిర్యాదు చేస్తున్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత మీదే. జిల్లా ఇన్చార్జి మంత్రులుగా మీరు ఆ మాత్రం బాధ్యత తీసుకోలేరా’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాలో పథకాల అమలు, ఇన్చార్జి మంత్రి పనితీరు, ఇతర అంశాలపై తాను చేయించిన సర్వేల ఆధారంగా చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. ఆ ప్రకారంగా కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రులకు ఫస్ట్ ర్యాంకులు ఇచ్చారు. అంటే.. సత్యకుమార్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్‌రెడ్డికి లభించింది. ఇక కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పు జిల్లా ఇన్చార్జి మంత్రులయిన గుమ్మడి సంధ్యారాణి, సవిత, నిమ్మలరామానాయుడుకు చివరి మూడు స్థానాల ర్యాంకులు లభించాయి. వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని బాబు సూచించారు.
రోజురోజుకూ పెరుగుతున్న సోషల్‌మీడియా విస్తృతిని గమనించి, దానిని ఫాలో కావాలని బాబు వారికి సూచించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వేదిక అయిన సోషల్‌మీడియాను వినియోగించుకోవడంలో, చాలామంది మంత్రులు విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా ఐటి నిపుణుడైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సోషల్‌మీడియా వినియోగంలో వెనుకబడటంపై సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక సోషల్‌మీడియా వినియోగంలో మంత్రి ఫరూఖ్‌కు చివరి స్థానం లభించింది.
జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులు, తమ వద్దకు వచ్చిన ఫైళ్లను అలవోకగా పక్క టేబుల్‌కు నెట్టివేయడం, లేదా పెండింగ్‌లో పెట్టడం అలవాటయిందని వ్యాఖ్యానించారు. అసలు ఒక ఫైలు పెండింగ్‌లో ఉండటానికి కారణాలేమిటన్న విషయాన్ని, ఆ ఫైలులో రాయాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజల ఫిర్యాదులపై రొటీన్‌గా వ్యవహరించవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజలు మనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చాలన్నారు.
కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ప్రాజెక్టుల పురోగతిపై ఎంపిలు-మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని బాబు సూచించారు. ప్రధానంగా కేంద్రం నుంచి వివిధ రావలసిన నిధుల విషయంలో.. ఎంపి-మంత్రులు కలసికట్టుగా పనిచేయడం ద్వారా, కేంద్ర నిధులను రాబట్టుకోవాలని సూచించారు. కేంద్ర నిధులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో గుర్తించి, వాటిని ఇక్కడే త్వరితగతిన పరిష్కరించి, నిధులు రాబట్టే ప్రయత్నాలు చేయాలన్నారు. ఏతావతా బాబు భేటీ వాడివేడిగా జరిగినట్లు తెలుస్తోంది.