బీజేపీ అధికారంలోకొస్తే…తండాల్లో సేవాలాల్ మహారాజ్ ఆలయాలను నిర్మిస్తాం

-రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేసే బాధ్యత బీజేపీదే
-రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంవల్లే జాప్యం జరుగుతోంది
-కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయం
-పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో బండి సంజయ్ కుమార్

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని తండాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట ఆలయాలను నిర్మిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందునే వర్శిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ మంత్రి బాబూమోహన్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ, కార్యదర్శి కొల్లి మాధవి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…..

• ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. సేవాలాల్ మహారాజ్ అమ్మవారి భక్తుడు. భవానీ అమ్మవారి ఆశీస్సులు పొందిన వ్యక్తి సేవాలాల్ మహారాజ్. అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు ఏ కష్టమొచ్చినా అధిగమించేలా చేసిన వ్యక్తి సేవాలాల్. దారులు, రహదారులు లేకపోయినా ఆనాడు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎలాంటి లిపి లేకపోయినా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది గిరిజనులకు ఏకం చేసిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్. ప్రత్యేక తండాలను ఏర్పాటు చేయడంలో క్రుషి. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటంలో ముందున్న వ్యక్తి. బ్రిటీష్, ఇస్లాం పాలనలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడ్డ వ్యక్తి సేవాలాల్.
• ఆనాడు అడవులను నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు సేవాలాల్ రక్షణ కవచంగా నిలబడితే…. నేటి సీఎం కేసీఆర్ మాత్రం అటవీ శాఖ అధికారుల ద్వారా దాడులు చేయించి గిరిజనులను అడవుల నుండి తరిమేస్తుండటం సిగ్గుచేటు.
• ఎన్నికలొచ్చినప్పుడు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఓట్లు దండుకుని ఆ హామీనే విస్మరించిన ఘనుడు కేసీఆర్. తండాల్లో నేటికీ మంచి నీరు, రోడ్లు కనీస సౌకర్యాల్లేక గిరిజనులు అల్లాడుతున్నరు. తండాలకు ప్రత్యేక నిధుల ఊసే ఇంతవరకు కేసీఆర్ ఎత్తడం లేదు.
• ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను కేటాయించినా గిరిజనులకు ఇవ్వకుండా చేస్తున్నారు. ఉద్యోగాల్లేక ఉపాధి కరువై తెలంగాణలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో గిరిజన యువకులే ఉన్నారు.
• దళిత, గిరిజనులకు రిజర్వేషన్ల ఫలాలు అందిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తెచ్చి ఆ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు అమలు కావు, ఉద్యోగాలు రావు, ఇండ్లు రావు.. పోడు భూముల సమస్య పరిష్కారం కాదు. ఏ ఫలాలు అందవు.
• తెలంగాణలో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేసే బాధ్యత బీజేపీదే. ఇప్పటికే కేంద్రం పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంవల్లే యూనివర్శిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది.
• రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే బీజేపీ డిమాండ్. మతపరమైన ముస్లిం రిజర్వేషన్లతో కలిపి గిరిజనులకు రిజర్వేషన్లు బిల్లును కేంద్రానికి పంపడం విడ్డూరం. ఎస్టీలకు రిజర్వషన్లు అమలు కాకుండా ఉండాలన్నదే కేసీఆర్ కుట్రలో భాగమే ఇది.
• బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తండాలను గుర్తించి తగిన అభివ్రుద్ధి చేస్తాం.. దీంతోపాటు సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మిస్తాం. ఎస్టీ రిజర్వేషన్లను పూర్తిస్తాయిలో అమలు చేస్తాం.

Leave a Reply