Suryaa.co.in

Andhra Pradesh

నీలో నిజాయితీ ఉంటే ఐటీ నోటీసులపై నోరు తెరువు

నిఖార్సయిన రాజకీయ నాయకుడివి అయితే మాట్లాడు
ఆదాయపన్నుల శాఖ నీకు నోటీసులు ఇచ్చిందా? లేదా?
హిందూస్తాన్‌ టైమ్స్‌లో వచ్చిన వార్త నిజమా? కాదా?
రాజధాని పేరుతో నువ్వు డబ్బు తినేసింది నిజమా? కాదా?

: చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన శ్రీ పేర్ని నాని

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని) ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబుకు ఇదే నా సవాల్‌:

నేను 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకు ఛాలెంజ్‌ చేస్తున్నా. ఇన్‌కం ట్యాక్స్‌ మీకు నోటీసు ఇచ్చిన మాట వాస్తవమా? కాదా?.
హిందూస్తాన్‌ టైమ్స్‌లో ప్రచురితమైన వార్త నిజమా? కాదా?.
చంద్రబాబు నీలో నిజాయితీ ఉంటే.. మీ పర్సనల్‌ సెక్రటరీ ద్వారా రెండు కంపెనీల నుంచి రూ.118 కోట్లు లంచం తిన్నట్లు ఇన్‌కం ట్యాక్స్‌ మీకు నోటీసు ఇచ్చింది వాస్తవమేనా?
నోరు విప్పు చంద్రబాబూ.. నీలో నిజాయితీ ఉంటే నోరు తెరవు.
రోజూ మైకులు పట్టుకుని ఏవేవో ఊదరగొడుతున్నారుగా.. దీనిపై మాట్లాడండి.
అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా..?
గత ఏడాది సెప్టెంబరులోనే మీకు నోటీసు వస్తే ఇవాళ్టి వరకూ ఎందుకు చెప్పలేదు..?
కనీసం మీ పార్టీ పత్రిక చైతన్యరథంలోనైనా రాయించాలి కదా..?

పచ్చ మీడియాకు కనిపించడం లేదు!:

గతంలో 2022, సెప్టెంబరు 28న ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబుకు నోటీసు ఇచ్చింది. ఆ విషయాన్ని హిందుస్తాన్‌ టైమ్స్‌ ఇప్పుడు బయట పెట్టింది.

నీ లంచాల బాగోతం బట్టబయలైందని, మాకు దొరికినంత వరకు రూ.118 కోట్లు పీ.శ్రీనివాస్‌కు డబ్బులు అందినట్లుగా ఇన్‌కం ట్యాక్స్‌ చెప్పింది.

ఈ డబ్బును నువ్వు దాచిపెట్టిన ఆదాయం కింద మేం ఎందుకు పరిగణించకూడదు? అంటూ.. ఇన్‌కం ట్యాక్స్‌ శాఖ ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేసింది.

ఎపుడన్నా జగన్‌ గారు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని కలిస్తే ఆయన కుర్చీ కింద ఒక బగ్‌ పెట్టి వారేం మాట్లాడుకున్నారో తెలుసుకుంటారు.

అమిత్‌షాను కలిసినా అవన్నీ తెలుకోగల సమర్ధులు రామోజీ, వారంతపు పలుకులతను, టీవీ5 వారు ఈ వార్తను మాత్రం అసలు పసిగట్టలేకపోయారు.

పేర్ని నాని అన్నం తింటే ఎన్ని ముద్దలు తిన్నాడో కూడా కనిపెట్టగల వారు ఇది కనిపెట్టలేకపోవడం దురదృష్టకరం.

గత ఏడాది సెప్టెంబరులో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వారు చంద్రబాబుకు నోటీసు ఇస్తే పాపం వీరికి ఎవరికీ తెలియలేదు.

ఈ రోజు హిందూస్తాన్‌ టైమ్స్‌లో వార్త వచ్చినా వాళ్లెవరికీ అది కనిపించడం లేదు.
వయసు పెద్దదై రామోజీకి ఏమీ కనిపించడం లేదేమో.. కేవలం మా ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడం, నిందలు మోపడం తప్ప..

అలాగే వారాంతపు పలుకులు రాసుకునే బిజీలో రాధాకృష్ణ ఉన్నాడేమో. ఇంకా టీవీ5కి కూడా ఏమీ తెలియడం లేదేమో!.

ఇక్కడ నిజంగా చంద్రబాబులో ఏ తప్పు లేకపోతే.. ఎంత సాహసం ఇన్‌కం ట్యాక్స్‌ వారు చంద్రబాబుకే నోటీసులు ఇస్తారా? అంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా రాయలేక పోయారు.

40 ఏళ్ల ఇండస్ట్రీకి, ఎంతో మంది ప్రధానులను కుర్చీలో ఎక్కించిన వాడికి నోటీసులు ఇస్తారా అని రాయాలి కదా..?
ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చెడిపోయిందని అయినా రాయాలి కదా..?
ఇవేవీ రాయలేదంటేనే అర్ధమవుతోంది చంద్రబాబు చేసిన అవినీతి.

రాజధాని అమరావతి లోగుట్టు ఇదే:

అమరావతి అంటూ మన సినిమా చూపిస్తున్న చోట బాబు వందల కోట్లు దోచుకున్నాడని వార్తలు వచ్చాయి.

వైజాగ్‌లో రూ.500 కోట్లు లేదా రూ.1000 కోట్లతో రాజధాని కట్టేయవచ్చు కదా?..
లేదంటే డీజీపీ ఆఫీసు వద్ద సచివాలయం, అసెంబ్లీ కట్టి మిగతాది జోనింగ్‌ చేయవచ్చు కదా? అని నాలాంటి వాడు అనుకుంటాడు.

రాజధాని అమరావతి అంటే చంద్రబాబుకు ఎందుకంత వల్లమాలిన మమకారం ఎందుకన్నది.. ‘లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక’ అన్నట్లు ఈరోజు బయటకు వచ్చింది.

2016–19 వరకూ ఎల్‌ అండ్‌ టీ, షాపోజీ పల్లంజీ కంపెనీలకు తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో కాంట్రాక్టులు ఇచ్చాడు.

ఎవరికైతే కాంట్రాక్టులు ఇచ్చాడో వాళ్ల నుంచి షెల్‌ కంపెనీల పేరుతో ముడుపులు తీసుకున్నట్లు తేలింది.

అందులో రూ.118 కోట్ల లంచం డబ్బులు మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసాని అనే వ్యక్తికి చెందిన సూట్‌ కేసు కంపెనీ వద్ద నుంచి చంద్రబాబు పీఏ పీ.శ్రీనివాస్‌ అనే వ్యక్తి వ్యవహారం అంతా నడుపారని తేలింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రై వేట్‌ సెక్రటరీగా పని చేసిన పి,శ్రీనివాస్‌ ద్వారా ఈ డబ్బు తీసుకున్నట్లు హిందూస్తాన్‌ టైమ్స్‌లో పెద్ద వార్త ప్రచురితం అయ్యింది.
ఇది కేవలం ఒక వ్యక్తి వచ్చిన లంచం మాత్రమేనని రాశారు.

మనోజ్‌ వాసుదేవ్‌ పార్ధసానీ తాను చంద్రబాబును కలిశానని, పీఏ శ్రీనివాస్‌ నువ్వు లెక్కలు చూసుకోండి అని బాబు చెప్పినట్లు చెప్పాడు.

కాంట్రాక్టర్లు తాము పొందిన లబ్ధిని లంచంగా ఇతని ద్వారా అప్పజెప్పినట్లుగా ఇన్‌కం ట్యాక్స్‌ చంద్రబాబుకు నోటీసు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

అమరావతి పేరుతో డబ్బు తినేసింది నిజమా? కాదా?:

చంద్రబాబూ గుర్తు పెట్టుకోండి. పైన ఎన్టీఆర్‌ ఆత్మ మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతోంది.
1995 సెప్టెంబర్‌ 1న రామారావును పదవి నుంచి పడేసి మీరు ప్రమాణ స్వీకారం చేశారు.
రామారావు గారు పైనుంచి మీపై కక్ష తీర్చుకుంటున్నాడు. జగన్‌ గారిని ఆశీర్వదిస్తున్నాడు.
మీరు ఎన్టీఆర్‌కి వెన్నుపోటు రుచి చూపిస్తే.. ఆయన పైనుంచి రాజకీయాల్లో మీకు కుక్కచావు చూపిస్తూ, జగన్‌ గారికి అండదండలు ఇస్తున్నారు.

బాబు ఆషాడభూతి కథలు:

ఏటా సెప్టెంబరు 2న మేం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డివర్ధంతి జరుపుకుంటాం.
40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు కూడా 2010 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 1 లేదా 2వ తేదీన తన ఆస్తుల చిట్టాను ప్రకటించడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు.

తన ఆస్తులెంత…? అప్పులెంత..? జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 65లో ప్లాట్‌ నంబర్‌ 1310 విలువ కేవలం రూ.1.10 లక్షలు మాత్రమే అని చెబుతుంటాడు.

నాకు నగల్లేవ్‌.. వాచ్‌ కూడా లేదు.. కారు లేదు అని కూడా చెప్తాడు
తన శ్రీమతికి మాత్రం రూ.2 లక్షల నగలున్నాయని అషాఢ భూతిలా చెప్తూ ఉంటాడు.
కేవలం రాజశేఖరరెడ్డి వర్ధంతి వార్తలు ఎవరూ చూడకూడదు అని ఇలా ఆస్తుల ప్రకటన కార్యక్రమం పెట్టుకుంటాడు.

తాను ఎంతో నీతిగా బతుకుతున్నానని అందరూ అనుకోవాలని బాబు కలలు కంటుంటాడు.

విధి ఎవరినీ వదిలిపెట్టదు:

విధి ఎవర్నీ వదలదు.. ఇవాళ సెప్టెంబర్‌ 1, 2023. ఈ 23 బాబుకు కలిసి వచ్చినట్లు లేదు.
హిందూస్తాన్‌ టైమ్స్‌ అనే జాతీయ పత్రిక చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తూ పెద్ద వార్తను ప్రచురించింది.

చంద్రబాబు చిలకకొట్టుడు, ప్రజల ఆస్తులను ఎలా తన జేబులోకి కొట్టేస్తాడో దాంట్లో వివరంగా రాశారు.

మళ్లీ అధికారం కావాలట!:

జనం సొమ్మును తండ్రీ కొడుకులు హల్వా తిన్నట్లు తిని మళ్లీ అధికారం ఇవ్వండి అంటున్నారు.
అధికారం ఇస్తే అమరావతి పేరుతో మళ్లీ తినేస్తారా..?

మొత్తం అక్కడ జరిగిన దాంట్లో దొరికింది కేవలం రూ.118 కోట్లు అయితే దొరకకుండా ఎంత తిన్నారో..?

ఇక ఈయనకు అధికారం ఇస్తే మన భవిష్యత్తుకు ఈయన గ్యారెంటీ ఇస్తాడట..
మళ్లీ తినేయడానికి, లంచాలు మెక్కేయడానికే ప్రయత్నం.
కేవలం ఒక్క అమరావతిలోని కొంత భాగమే ఇదైతే రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసిన పనిలో ఎంతెంత తీసుకున్నావ్‌..?

ప్రజాధనాన్ని ఈ రకంగా దొరకకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన చంద్రబాబు వందల కోట్ల రూపాయలు దోచుకున్నాడు.

ఇన్నేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేయడమే కాకుండా ఇంకా లూటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఏం మిగిల్చావని భవిష్యత్తు ఇస్తానంటున్నావ్‌?:

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఇక ఏం మిగిల్చావు బాబూ..?
బాబూ అండ్‌ కో పచ్చగా ఉండటానికి ప్రజలంతా పన్నులు కడుతున్న పరిస్థితి.
ఈనెల నుంచి భవిష్యత్తు గ్యారెంటీ అట…ఏం గ్యారెంటీ ఇస్తావ్‌ బాబూ..?
తాను 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్ష లేకుండా వాగ్దాలను నెరవేస్తానంటున్నాడు. అంటే గతంలో వివక్షతో చూశాడన్నమాట.

ప్రజలు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా..ఈ తేలుకుట్టిన దొంగతో చాలా అప్రమత్తంగా ఉండండి.
ఈ దొంగ 2014లో కూడా ఒక సంతకం పెట్టి కాగితం ఇంటింటికీ ఇచ్చాడు.

డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను.. ఆడబిడ్డ పుడితే రెండు లక్షలు డిపాజిట్‌ చేస్తాను.. అంటూ ఎన్నో హామీలు ఇస్తూ లేఖలు పంపాడు.

2 రూపాయలకే 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ ఇంటింటికీ పంపుతాను అన్నాడు.
చేనేత రుణాలు మాఫీ చేస్తాను…కాపులను బీసీలుగా చేస్తాను అన్నాడు.
రజకులను, మత్స్యకారులను ఎస్సీలు చేస్తానన్నాడు.

అర్హులయిన అందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇల్లు మంజూరు చేస్తానన్నాడు.
ఇవన్నీ సంతకం పెట్టి ఇంటింటికీ ఇచ్చాడు.. ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్‌ ఫోటో కూడా దానిపై వేశాడు.

ఆ సంతకానికి ఏమైనా దిక్కుందా.? వాటిలో ఏం అమలు చేశాడు..?
దీనికి దిక్కులేదు..మళ్లీ సంతకాలు..హామీలు అంటూ బయలుదేరాడు.

బాబు వాడుకుని వదిలేయని వారెవరున్నారో చూపండి:

అధికారం కోసం ఎంతకైనా దిగజారే తప్పుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు.
ఎవరినైనా తన మోసాలకు వాడుకుని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఎన్టీఆర్‌ నుంచి ఆయన సంతానాన్ని, తోడల్లుడిని, ఇతర నాయకులను వాడుకుని వదిలేశాడు.
కమ్యూనిస్టు పార్టీలను వాడుకున్నాడు..వదిలేశాడు…

బీజేపీని 1999లో వాడుకుని వదిలేశాడు…2014లో మళ్లీ వాడుకుని వదిలేశాడు.
2024లో బీజేపీని వాడేయడానికి ఎన్ని కాళ్లు కావాలంటే అన్ని కాళ్లు పటుకుంటున్నాడు.
2014లో పవన్‌ కల్యాణ్‌ని వాడుకుని వదిలేశాడు..మళ్లీ 2024లో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

వాడుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉంటే వెట్టిచాకిరీ చేయడానికి పవన్‌ కల్యాణ్‌ సిద్ధంగా ఉన్నాడు.

చంద్రబాబు తన చరిత్రలో వాడుకుని వదిలేయనటువంటి వారెవరున్నారో చూపించండి..?
అలా ఉంటే ఒకే ఒక్కడు ఉన్నాడు…ఆయనే ఈనాడు రామోజీరావు.
చంద్రబాబు వద్దకు రామోజీరావు రాడు..ఆయన్ని ఇంతవరకూ మోసం చేయలేదు.
హైదరాబాద్‌లో దూరంగా కొండమీద ఉంటాడు..ఎందుకొచ్చిన బాధ నన్ను కూడా వెన్నుపోటు పొడుస్తాడని ఆయన భయం.

సిగ్గు, అభిమానం, ఆత్మాభిమానం లేనటువంటి రాజకీయా నాయకుడు ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరొకరు దొరకరు.
ఓ పక్క కమ్యూనిస్టులకు కన్నుకొడతాడు..మరో పక్క కాంగ్రెస్‌ పార్టీని కూడా వాడుకుని వెన్నుపోటు పొడిచి వదిలేశాడు.

మొన్న వెళ్లి వంగి వంగి నమస్కారాలు పెడుతూ నంగినంగి కబుర్లు చెబుతున్నాడు.
మరి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ వద్దకు ఎందుకు వెళ్లలేదు..?

ఎవడితో అవసరం ఉంటే వాళ్లు కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరినతర్వాత వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం.
అది ఓటర్లు అయినా అంతే..అతనికి అవసరం ఉంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు.

లోకేశ్‌.. నీకైనా ఆ దమ్ముందా?:

పోతుల సునీత తన తండ్రిని, కుటుంబ సభ్యులను ఏదో అన్నారని లోకేశ్‌ హైకోర్టులో కేసు వేశాడు.
పాదయాత్ర ఆపేసి మరీ పరువు నష్టం దావా వేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు.
లోకేశ్‌ను అడుగుతున్నా.. నువ్వు నిజంగా పౌరుషం కలిగిన వాడివే అయితే హిదూస్తాన్‌ టైమ్స్‌పై కేసు వేస్తావా..?

చేనేత వర్గానికి చెందిన మహిళ పోతుల సునీత మీద నువ్వు పౌరుషంగా మాట్లాడావు కదా..?
ఇప్పుడు హిందూస్తాన్‌ టైమ్స్‌పై ఏం చేస్తావో చెప్పు.
వెంటనే పాదయాత్ర ఆపేసి రా..
హిందూస్తాన్‌ టైమ్స్‌పై పరువు నష్టం దావా వేసే దమ్ము మీకుందా.?

 

ప్రశ్నలు–సమాధానాలు:

ఇప్పటికే చంద్రబాబు అవినీతిపై ఎన్నో ఫిర్యాదు వెళ్లాయి.
గతంలో విజయమ్మ గారు ఫిర్యాదు చేశారు..లక్ష్మీపార్వతి కూడా ఫిర్యాదు చేశారు.
అన్నిటిపై బాబు స్టేలు తెచ్చుకున్నాడు.. ఆయనది స్టేల బతుకు.
రేపు దీనిపై కూడా స్టే తెచ్చుకుంటాడు.. ఇన్‌కం ట్యాక్స్‌ శాఖను నువ్వెవరు నాకు నోటీసులు ఇవ్వడానికి అని కూడా అంటాడు..

ఎవరైనా అసభ్యంగా బూతులు తిడితే ఫిర్యాదు చేస్తారు.. బాధ్యతతో కూడిన ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడని తీరులో మాట్లాడినందుకు మేం టీడీపీ వారిపై ఫిర్యాదులు చేశాం. పోలీసులు కేసులు కట్టారు.
పార్లమెంటులో వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ అనే అంశంపై చర్చ పెడుతున్నామని మీకెవరైనా చెప్పారా?.

నిజంగా అది జరిగితే మా పార్టీ అభిప్రాయం ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేకుండా మేం ఎందుకు స్పందించాలి.
షర్మిల ఒక ఇండిపెండెంట్‌ పొలిటీషియన్‌..ఆమె నిర్ణయాలు ఆమెకు ఉంటాయి.
ఎవరి రాజకీయ ఎత్తుగడలు వారికి ఉంటాయి.
పార్టీ పెట్టినప్పుడు నడపడమా.. విలీనం చేయడం వారి ఇష్టం.

జనం గుండెల్లో జగన్‌గారు ఉన్నారు. రాజకీయం అన్నాక అనేక పార్టీలు వస్తుంటాయి.
ఇదేమీ చైనా రాజ్యాంగం కాదు కదా..ఒకటే పార్టీ ఉండటానికి..?
ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కులు వారికి ఉంటాయి.
జగన్‌ గారు జనాన్ని నమ్ముకుంటారు తప్ప వేరే ఎవర్నీ నమ్ముకోరని మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని స్పష్టం చేశారు.

 

LEAVE A RESPONSE