బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ
అమరావతి: బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ… గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు కూతవేటు దూరంలో, గాంధీ పార్క్ గోడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో నడిరోడ్డుపై అక్రమ నిర్మాణం చేపడుతున్నారని… రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో నిర్మాణం కారణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ప్రజా సంఘాలు గతంలో హెచ్చరించినా కూడా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని శ్రీధర్ వాపోయారు.
మున్సిపల్ కాంట్రాక్టర్కు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల విజ్ఞప్తులను గాలికి వదిలేసి మున్సిపాలిటీ ఉన్నతాధికారులు, నగర మేయర్ కలసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నరని, అర్ధరాత్రిళ్ళు స్లాబ్ వేసేందుకు రహస్యంగా సెంట్రింగ్ చెక్క ఏర్పాటు చేశారని, గతంలో ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో గాంధీ పార్క్ స్థలాన్ని, కూరగాయల మార్కెట్ స్థలాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో వెడల్పు అయిన రోడ్డు గా విస్తరణ చేశారని ఇంతకాలం ఈ రోడ్డును ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జరిగిందని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు, మేయర్ కలిసి కాంట్రాక్టర్ వద్ద కమిషన్ల కోసం అక్రమ కట్టడం చేపట్టారని శ్రీధర్ మండిపడ్డారు.
భవిష్యత్తులో మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే ఆ నిర్మాణాలను మళ్లీ కూల్చాల్సిన పరిస్థితి వస్తుందనీ, ఇలా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినా పర్వాలేదని మొండి పట్టుదలతో కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ల కోసం నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కార్పొరేషన్ ఉన్నతాధికారులు, మేయర్ ముందుకు వెళుతున్నరని శ్రీధర్ మండిపడ్డారు.
ఈ నిర్మాణాల పైన స్థానిక తూర్పు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, మున్సిపల్ శాఖ మాత్యులు పి. నారాయణ దృష్టి సారించి నిర్మాణాలను తక్షణమే ఆపివేసి, అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, దుర్వినియోగం అయిన ప్రజా సొమ్మును అధికారుల వద్ద వసూలు చేయాలని, ప్రధాన రహదారి పై నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే కూల్చివేయాలని, గుంటూరు నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉందని శ్రీధర్ తెలియజేశారు. తక్షణమే నిర్మాణాలు ఆ పని పక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహిస్తామని శ్రీధర్ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు.