ఆకాశవాణి సీనియర్ అనౌన్సర్ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అడవి రాజబాబు రిటైర్మెంట్ నేపథ్యంలో… హైదరాబాద్ నాంపల్లిలోని “తెలుగు యూనివర్సిటీ” లో “అడవి రాజబాబు” పుస్తక ఆవిష్కరణ జరిగింది.
తెలంగాణ భాష సంస్కృతి శాఖ సంచాలకులు డా. మామిడి హారి కృష్ణ గారు అధ్యక్షత వహించిన ఈ సభలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆకాశవాణి ఉన్నతాధికారులతో పాటు వలేటి గోపీచంద్, అవధానుల శ్రీహరి, అయినంపూడి శ్రీలక్ష్మి, రేడియో రాంబాబు, కార్యవర్ధి, సందీప్, వంటి ఉద్దండులు హాజరైనారు.
“అడవి రాజబాబు” పుస్తకంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి సంస్థ ( దూరదర్శన్ – ఆకాశవాణి) కు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, ఉద్దండులైన కళాకారులు మరియు కళాభిమానులు మొత్తం *274 పేజీల ఈ ప్రత్యేక సంచికలో 132 మంది ఉద్దండులు రివ్యూలను వ్రాశారు.
అటువంటి ప్రతిష్ఠాత్మ కమైన పుస్తకంలో రాజమండ్రి నగరానికి చెందిన రచయిత శ్రీపాద శ్రీనివాస్ కు రివ్యూ రాసే చక్కని అవకాశం దక్కింది. ఈ సమీక్షను రాసున్నప్పుడు కూడా అడవి రాజబాబు పుట్టు పూర్వోత్తరాలు, విద్య నేపథ్యం, ప్రాంతం తదితర వివరాల గురించి ఆరా తియ్యకుండానే ఆయన గురించి సమీక్షను వ్రాయడం చేస్తున్నానని…
కేవలం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా రాజబాబు నిర్వహణలో ప్రసారం అయిన అనేక కార్యక్రమాలు మరియు ఆయా కార్యక్రమాల ద్వారా ఆయన స్వర మాధుర్యానికి ముగ్ధుడై తాను కూడా రచయితను కావాలని స్ఫూర్తిని పొందానని తన సమీక్షలో శ్రీపాద రాసిన విధానం పలువురిని కట్టి పడేసింది.
జ్ఞాన సముపార్జనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైన తోడ్పడిన వారు గురువులతో సమానం అని ఆ విధంగా రాజబాబు గారికి వున్న అనేకమంది ఏకలవ్య శిష్యులలో తాను కూడా ఒకడిని అని సమీక్షలో రాస్తూ తన వినమ్రతను శ్రీపాద చాటుకున్నారు.
నా స్వీయ స్వరంలో ఒక కథానిక వాయిస్ రికార్డింగ్ సందర్భంగా ఓ పదాన్ని ఉచ్చరించడానికి తడపడినప్పుడు…రికార్డింగ్ దీయటర్ లోకి వచ్చి సదరు పదాన్ని ఉచ్చరించే తీరును స్వయంగా రాజబాబు చెప్పారని…అదే ఆయన్ని ప్రత్యక్షంగా చూడటమని అని శ్రీపాద తన సమీక్షలో పేర్కొనడం మంచి అర్ద్రతను కలిగించింది.
మొత్తం మీద శ్రీపాద శ్రీనివాస్ ఇప్పటి వరకు 40 పైగా వివిధ రచనలను చేశారు. అందులో 16 కధ , కథానికలను తన స్వరంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా వినిపించారు శ్రీనివాస్. అంతేకాకుండా ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలను కూడా శ్రీపాద రూపొందించారు.
ఇప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో రూపొందించిన ” అడవి రాజబాబు” పుస్తకం ద్వారా సమీక్షను రాసి తన శైలితో మరోమారు ఆకట్టుకున్నారు..