Suryaa.co.in

Telangana

వైద్య సేవలందినప్పుడే అభివృద్ధి

-వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

హైదరాబాద్: దేశంలో పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడే అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలదని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.

హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథలాజిస్ట్ మరియు మైక్రోబయాలజిస్ట్ తెలంగాణ చాప్టర్ 7వ వార్షిక సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా చదువుకొని ఇప్పుడు ఎంపీగా ఈ సమావేశానికి రావడం, మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే పార్లమెంట్ లో మొట్ట మొదటి పాథలాజిస్ట్ డాక్టర్ ఎంపీ గా ఉండడం గర్వంగా ఉందని తెలిపారు. పాథలాజీ అనేది భిన్నమైన సబ్జెక్ట్ అని, ఒక పాథలాజిస్ట్ డాక్టర్ గా గర్వపడుతున్నాని అన్నారు.

నేను ప్రభుత్వ అస్పత్రిలో 6ఏళ్ళు డాక్టర్ గా పని చేశానని, ఇప్పటికి చాలా ప్రభుత్వ అస్పత్రులలో చిన్న చిన్న పరీక్షలు చేయడానికి కూడా సరైన సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏ వ్యాధి నిర్ధారణ చేయాలన్న పాథలాజిస్ట్ పైనే డాక్టర్లు ఆధారపడుతున్నారని అన్నారు. కాబట్టి అన్ని పీహెచ్ సీ, సీహెచ్ సీలు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లలో వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆ దిశగా నా వంతు కృషి చేస్తానని అన్నారు.

కడియం ఫౌండేషన్ ద్వారా మహిళలకు, గర్భిణీ కు న్యూట్రిషన్ కిట్స్, విద్యార్థినిలకు హైజినిక్ కిట్స్ తో పాటు విద్య పరంగా, వైద్యం పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. రానున్న రోజులలో పాథలాజిస్ట్ లకు మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు.

డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు పాథలాజిస్ట్ లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అవసరమైన రాయితీలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అస్పత్రులలో డయాగ్నోస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE