ఏపీలో బీజేపీని “బాబు జనతా పార్టీ”గా మార్చారు

–  అతను “అసత్య” కుమార్.. వాళ్ళు చెప్పేవన్నీ చంద్రబాబు మాటలు
– అమరావతి స్కామ్ క్యాపిటల్ అన్నది BJP కాదా?
– కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిక్లరేషన్ చేసిన మీరు.. న్యాయ రాజధానిపై ఎందుకు నోరు మెదపరు?
– డీసెంట్రలైజేషన్‌ని వ్యతిరేకించటమే బీజేపీ విధానమా..?
– బాబు హయాంలోనే గంజాయిలో ఏపీ నంబర్ వన్
– ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ పై “అసత్య” కుమార్ ఎందుకు మాట్లాడడు?
– రాయలసీమకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి..
– దమ్ముంటే మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారో.. మేం ఏం చెప్పామో, ఏం చేశామో చర్చిద్దాం రండి..
– కాల్ మనీ సెక్స్ కేటుగాళ్ళు మా పార్టీ గురించి మాట్లాడటమా..?
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి

వైఎస్ఆర్ జిల్లా: శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
చీవాట్లు తిన్నా “అసత్య” కుమార్ మారలేదు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే.. ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుని కవరేజ్ ఎక్కువ ఇస్తుందనే ఆత్రంతో బీజేపీ నేత సత్య కుమార్ నోటికొచ్చినట్లు, వ్యక్తిగతంగా మాట్లాడటం దురదృష్టకరం. అమరావతిలో బీజేపీ నేతలు కొందరు పాదయాత్ర చేసి, ఆ ముగింపు సభలో ఆ పార్టీకి చెందిన సత్యకుమార్‌ అనే వ్యక్తి అసత్య కుమార్ లా, సత్యదూరమైన మాటలు మాట్లాడారు. ఆయన మాటలను వైయస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయనకు సత్యకుమార్‌ అనే పేరు కంటే.. అసత్యకుమార్‌ అని పేరు పెట్టుకుంటే బాగుండేది. తాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతు కోరలేదని వ్యాఖ్యలు చేసి, ఆ పార్టీ అధిష్టానంతో చీవాట్లు తిన్న విషయం అందరికీ తెలుసు.

టీడీపీకి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి, కేసులకు భయపడి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరికో, సీఎం రమేష్‌కో… సత్యకుమార్‌ ఎప్పుడూ కొమ్ము కాస్తూ వస్తున్నాడు. వీరంతా కలిసి, చివరికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” గా మార్చేశారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసే మంచిని, మేం గడప గడపకు వెళ్ళి ధైర్యంగా ప్రజల వద్దకు తీసుకువెళుతుంటే, అది చూసి ఓర్వలేక, అబద్ధాలనే విమర్శనాస్త్రాలుగా చేసుకుని మా మీద నిందలు మోపడం మంచిదికాదు.

BJP డిక్లరేషన్ ఏమైంది..?
కర్నూలులో హైకోర్టు పెట్టాలని భారతీయ జనతా పార్టీ 23.02.2018లో డిక్లరేషన్‌ చేసింది. అలాంటిది, మా ప్రభుత్వం వికేంద్రీకరణ చేయాలని విధానంగా తీసుకుని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటే.. ఆపార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, మీ చేతిలో ఉన్న అంశాన్ని, మీరు చేసిన డిక్లరేషన్ కు అనుకూలంగా ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నారని అడుగుతున్నాం. అలాగే అమరావతి అనేది స్కామ్‌ క్యాపిటల్‌ అని అన్నది బీజేపీ నేతలా.. కాదా.. అని సూటిగా అడుగుతున్నాం. టీడీపీ హయాంలో అమరావతి రాజధాని పేరుతో లక్ష కోట్లు మింగేస్తున్నారంటూ మీరు చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.

బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం.. డీసెంట్రలైజేషన్‌కు మీరు వ్యతిరేకమా.. అనుకూలమా.. అన్నది స్పష్టం చేయండి. రాష్ట్రం బాగుండాలని, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలని మా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే, పరిపాలనా వికేంద్రీకరణ నిర్ణయాన్ని బీజేపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి.

విశాఖకు అడుగడుగునా బాబు అడ్డు
జీడీపీ పరంగా చూసినా, దేశంలోనే విశాఖ నగరం పదో స్థానంలో ఉంది. విశాఖను మరింతగా అభివృద్ధి చేసుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, ఎక్కడ తన బినామీలకు నష్టం జరుగుతుందో అని, అమరావతి పాట పాడటంతో పాటు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకువచ్చి విశాఖ అభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు వెన్నుదన్నుగా సత్యకుమార్‌ లాంటివాళ్లు అమరావతి భజనలో భాగస్వామ్యులు అవుతున్నారు.

ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ పై నోరు మెదపరా..?
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. మరి దానిపై అసత్య కుమార్‌ ఎందుకు నోరు తెరవడం లేదు? మీకు ధైర్యం ఉంటే దానిపై మాట్లాడాలి. రాయలసీమను ఫ్యాక్షనిస్ట్‌ ప్రాంతంగా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. మీ హయాంలో రాయలసీమకు ఏం మేలు చేశారు?. సీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారి హయాంలో, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ గారి హయాంలోనే జరిగింది. వైయస్సార్‌ గారి పుణ్యాన పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ఒక కొలిక్కి వచ్చాయి. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఎత్తు పెంచుతుంటే… తెలంగాణకు ఇన్‌డైరెక్ట్‌గా సహకారం అందించింది చంద్రబాబు కాదా? అలాంటి మీరు మాపై విమర్శలు చేయడమా? బీజేపీ సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉ‍న్న సమయంలోనూ రాయలసీమకు ఏం చేశారంటే నోరు మెదపలేని పరిస్థితి మీది.

తన రాజకీయ స్వార్థంతో రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్న చంద్రబాబు నాయుడును భుజాన మోస్తూ ఏపీలో బీజేపీ కనపడకుండా బాబు జనతా పార్టీగా మార్చుకున్నారు. పులివెందుల గురించి మాట్లాడుతున్నారే?.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముందా మీకు?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పులివెందులకు, రాయలసీమకు ఎంత అన్యాయం చేశారో అందరికీ తెలుసు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి ఏమీ రానివ్వకుండా, చివరకు రేషన్‌ బియ్యం విషయంలో కూడా అడ్డుపడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం 60శాతం జనాభాకు కూడా రేషన్‌ బియ్యం పంపిణీ చేయడంలేదు. 89లక్షల కార్డు దారులకు మాత్రమే కేంద్రం బియ్యం పంపిణీ చేస్తుంటే… దాదాపుగా కోటీ 40లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారమైనా, స్వంతంగా రేషన్‌ పంపిణీ చేస్తోంది.

బాబు హయాంలో గంజాయి సరఫరాలో ఏపీ నంబర్ వన్
ఏపీనుంచే దేశం అంతా గంజాయి సరఫరా అవుతుందంటూ మాట్లాడటానికి అసత్య కుమార్‌కు సిగ్గుండాలి. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులే అధికారంలో ఉన్నారు కదా? మరి దేశంలో గంజాయిని అడ్డుకోకుండా గాడిదలను కాస్తున్నారా? మా ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గంజాయి సాగును పెంచి పోషించాడు. చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నవాళ్లే ఏపీ గంజాయి సరఫరాకు అడ్డాగా మారిందంటూ మాట్లాడారు. ఆ విషయాలన్నీ మర్చిపోయి, మా మీద విమర్శలు చేస్తారా?. రాష్ట్రంలో ఎక్కడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తు శాంతిభద్రతలు కాపాడుతుంటే, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని, ప్రజలను అయోమయానికి గురిచేసేలా మాట్లాడటం.. దానికి ఎల్లో మీడియా వత్తాసు పలకడం ఇవన్నీ దుష్టచతుష్టయం పన్నాగాలే.

మేం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో వ్యవస్థలను సరైన దారిలో పెడుతున్నారు. మా ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేసే టీడీపీ, బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే మీ హయాంలో, మీరు ఇచ్చిన 2014-2019 ఎన్నికల మేనిఫెస్టోను తీసుకురండి, మా మేనిఫెస్టోను మేం తీసుకువస్తాం.. మేము ఏం చేశామో.. మీరు ఏం చేశారో చర్చిద్దాం. ఒక పార్టీలో సభ్యత్వం తీసుకుని, ఇంకో పార్టీకి కొమ్ముకాసేవాళ్లకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. మీవన్నీ సిగ్గులేని చర్యలే.

మీ భూముల కోసమే అమరావతి జపం
అమరావతిలో అసత్యకుమార్‌కు, ఆయన అనుచరులకు కూడా భూములు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత అజెండాతో ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే సహించేది లేదు. రాష్ట్ర ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందంటే, అది వైయస్సార్‌ గారి తర్వాత వైఎస్‌ జగన్‌ హయాంలోనే. టీడీపీ హయాంలో విశాఖలో వేల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి, భూ కుంభకోణాలకు పాల్పడింది మీరు కాదా? మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రుషికొండ తవ్వకాలు అంటూ మాపై విమర్శలు చేస్తారా?. మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులకు నేరుగా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లోకే డబ్బులు వెళుతున్నాయి. రూ. 1.65 లక్షల కోట్లు ప్రజలకు మూడేళ్ళలో అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే. అయితే అవి అందని దళారులు, బ్రోకర్లు మాత్రమే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

అసత్యకుమార్‌ మీడియాలో కవరేజ్‌ కోసమో, ఎవరి ప్రాపకం కోసమో మాపై బురద చల్లే కార్యక్రమం చేస్తే సహించేది లేదు. రాష్ట్రానికి మేలు జరగాలంటే ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌కు ఇవ్వాల్సిన నిధులు, కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయండి. మీ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేయాలి. ఇవి చేసిన తర్వాతే మాపై విమర్శలు చేయండి అని హితవు పలుకుతున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
ఎంపీ గోరంట్ల మాధవ్‌ అంశంపై.. టీడీపీ వాళ్లు గాంధీజీలుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో, టీడీపీ ప్రజా ప్రతినిధులే విజయవాడలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ నడిపి ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారు. మహిళల కన్నీళ్లు టీడీపీని జీవితాంతం వెంటాడుతాయి. అటువంటి కాల్ మనీ కేటుగాళ్ళు మాపై విమర్శలు చేయడమా.. ?. ఒకవేళ మాధవ్‌ విషయంలో తప్పు జరిగితే మా పార్టీ చర్యలకు వెనకాడదని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది.