– విద్యుత్ వినియోగదారులపై ప్రీపెయిడ్, స్మార్ట్ మీటర్ల కత్తి
– ప్రీపెయిడ్ , స్మార్ట్ మీటర్ల రగడ – పెట్టుబడి దారీ సంస్థలు పన్నిన కుట్రే ఈ ప్రీపెయిడ్ , స్మార్ట్ విద్యుత్ మీటర్ల బిగింపు వ్యవస్థ
– వెర్రి వాళ్ళు అయ్యేది మధ్యతరగతి జీవులు
(వి. ఎల్. ప్రసాద్)
ఇప్పుడు ఏ.పి లో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం లోని టి.డి.పి కి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముందు నుయ్యి , వెనక గొయ్యి లాగ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నట్లు అనుమానం కలుగుతోంది. కొందరేమో అలాంటిది ఏమీ లేదు, బాబు అవసరం బి.జె.పి కి ఉంది , ప్రస్తుతానికి బి.జె.పి ఏమీ చెయ్యదులే అని సర్దిచెప్పే ప్రయత్నం కొందరు చేస్తున్నారు.
2014-19 లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి , హానీమూన్ కాలం ముగిశాక బి.జె.పి తో పొసగక విడాకులు తీసుకున్నారు. మరలా కాల మాన పరిస్థితుల దృష్ట్యా ..కలిసుంటే కలదు సుఖం అనుకుని , గొడవలు సరిచేసుకుని 2024 లో కాపురం మొదలుపెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది.
కానీ వేరే కాపురం పెట్టుకున్న గత ఐదు సం.రాల్లో కొన్ని అవలక్షణాలు చొరబడ్డాయి. దానికి కారకుడు అదానీ అనే పెట్టుబడి దారీ సంస్థ అధిపతి. ఆయన లక్షణం తనకు ఏ సంస్థ నచ్చితే దానిని మింగి వేయడం ఆయనకు ఒక అలవాటుగా మారింది. దానికి మోదీ గారి వత్తాసు పుష్కలంగా లభించింది. అదానీ కోసం మోడీ ఎంతకైనా తెగిస్తాడనే ఒక నానుడి ఉంది.
కట్ చేస్తే.. ఎప్పుడైతే చంద్రబాబు క్వాంటం వాలీ ప్రయత్నాలు మొదలయ్యాయో బి.జె.పి ఒక్కో అస్త్రం బైటకు తీసిందని , మొదటి వేటు బనకచర్ల అనుమతులపై పడిందని, గతంలో ‘కియా’ కార్ల ఉత్పత్తి కర్మాగారం అనంతపురంకు తీసుకువస్తే.. మోడీకి మండి జనసేన చేత పొగబెట్టించాడని , ఇప్పుడు అదే కథ పునరావృతం అవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈసారి జనసేన నేత ఆలా చెయ్యడని , ఉప ముఖ్యమంత్రిగా ఆయనను సంప్రదించే అన్ని పనులు జరుగుతాయి కాబట్టి అడ్డం తిరగడు అని సర్దిచెప్పే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారు. వై.సి.పి అధినేత రెచ్చిపోయి మాట్లాడడం చూస్తుంటే.. ఏదో గూడుపుఠాణి జరుగుతోందనే అనుమానం మరి కొందరిలో ఉంది.
ఇప్పుడు అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును అమలు చేయాల్సిన తప్పని పరిస్థితి టి.డి.పి ప్రభుత్వానికి ఏర్పడింది. ఒకపక్క కాంగ్రెస్ , వామపక్షాలు ఉద్యమబాట పడుతున్నాయి. బి.జె.పి తో వై.సి.పి కి సహజీవన స్నేహ కారణాన వై.సి.పి ఏమి చేస్తుందో చూడాలి. బనకచర్లకు , అదానీ స్మార్ట్ మీటర్లకు ముడిపెట్టినట్లుగా కొందరి విశ్లేషకుల అభిప్రాయంగా వుంది. పెట్టుబడిదారీ సంస్థల ఎత్తుగడలను అర్ధం చేసుకోవా లంటే ఎంతో ముందుచూపు ఉన్న వారికి , రాజకీయాలను , ప్రపంచాన్ని అర్ధం చేసుకున్న వారికి మాత్రమే కొంతమేర అర్ధం అవుతాయి. సామాన్యులకు నెత్తిమీద బండ , మెడమీద గుదిబండ పడినప్పుడు మాత్రమే అసలు విషయం అర్ధం అవుతుంది. ఈ లోపు ఎవరి కులం , ఎవరి మతం , ఎవరి వర్గం వాళ్ళు డప్పు కొట్టుకుంటూ వుంటారు. అంతా అయిపోయాక హా !హతవిధీ అనుకుంటారు.
ఇప్పుడు ఎ.పి లో విద్యుత్ వినియోగదారులపై ప్రీపెయిడ్, స్మార్ట్ మీటర్ల కత్తి వేలాడుతోంది. అన్ని రాష్ట్రాల్లో గొడవలు జరుగు తున్నాయిగా , ఇక్కడ కొత్తగా జరిగేది ఏముంది , అక్కడి మాదిరే ఇక్కడా రద్దు చేస్తారులే అని తమ భావదారిద్ర్యాన్ని ప్రకటిస్తున్నారు కొందరు. ఇతర రాష్ట్రాల వారు , ప్రతి పక్షాలు గోల చేస్తే , వీరు మాత్రం చేతికి మట్టి అంటకుండా ఇంట్లో తొంగుంటారు. అసలు పెట్టుబడిదారీ సంస్థలకు ఇలా జరుగుతుందని , దానికి అనుగుణంగా ఎలా కథను నడపాలో కూడా వారికి ముందే తెల్సును.
మన విద్యుత్ వినియోగదారులకు 100 , 200 యూనిట్ల ఉచిత విద్యుతును అందిస్తున్నారని పార్టీ పెద్దలకు క్షీరాభిషేకాలు , డప్పు – డమారాలు మోగిస్తున్నాం, కానీ ప్రజల మీద ప్రేమతో నాయకులు ఆ పని చెయ్యలేదు సుమీ ! ఇక్కడే చదువుకున్న వారు , మేధావులతో సహా అంతా పప్పులో కాలు వేస్తున్నారు. రాబోయే కాలంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరిస్తారని ఈ రాజకీయ నాయకులకు ముందే తెలుసును. దానిని ప్రజలు వ్యతిరేకిస్తారని కూడా తెలుసును.
మనకు ఆంగ్లేయులు అంటించి పోయారుగా ? విభజించు , పాలించు అని ! ఆ సూత్రం ఇక్కడ అమలు చేసి ప్రజల్లో వ్యతిరేకతను కొంతమేర తగ్గించాలని , అన్ని వర్గాలు రోడ్డెక్కకుండా ఉండాలంటే వారిలో చీలిక తేవాలని ముందుగా 100 యూనిట్లు ఎస్.సి , ఎస్.టి వర్గాలకు ఉచిత విద్యుత్తును అమలు చేసారు. తరువాత దానిని 200 యూనిట్లు చేసారు. అంటే సుమారు 25 % వున్న పై రెండు వర్గాలు ఉచిత విద్యుత్తును వినియోగిస్తూ , ఒక్క రూపాయి బిల్లు కూడా చెల్లించరు . కారణం 200 యూనిట్లు వినియోగమే అవ్వదు. టి.వి , ఫ్రిజ్ , వాటర్ హీటర్, వాషింగ్ మిషన్ , గ్రైండర్ , 6 ట్యూబ్ లైట్లు , 5 ఫ్యాన్లు , ఇన్వర్టర్ ఇన్ని వున్నా నెలకు 200 యూనిట్ల లోపే బిల్లు వస్తుంది. ఒక్క వేసవి కాలం 2, 3 నెలలు ఏ.సి వేసుకుంటే అదనంగా బిల్ వస్తుంది.
పై రెండు వర్గాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్తు ఖర్చును , మిగతా వినియోగదారులపై వడ్డించారు. అందుకే 7,8 సార్లు వై.సి.పి ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచింది. ప్రీపెయిడ్ , స్మార్ట్ మీటర్ల ఉద్యమంలో పై రెండు వర్గాలు పాల్గొనగుండా ఉండాలనేది పెట్టుబడి దారుల , రాజకీయ నాయకుల ఎత్తుగడ.
ఇక మిగిలేవి బి.సి , మధ్య తరగతి , ఉన్నత వర్గాల వారు . ఒకవేళ ఉద్యమం తీవ్రతరం అయితే బి.సి వర్గాలకు కూడా ఉచిత విద్యుత్తును అమలు చేస్తామని చెబుతారు. ఇక మిగిలేది మధ్య తరగతి , ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాలు . వీరిమీదే మొత్తం భారం పడుతుంది. ఉన్నత వర్గాలకు కూడా ఏమీ కాదు. వారు ఎలాగొలా తమ ఉత్పత్తుల ధరలు పెంచుకుని బయటపడతారు. ఏతా వాతా వెర్రి వాళ్ళు అయ్యేది మధ్యతరగతి జీవులు.
ఉద్యమాలు జరిగితే ప్రజల మధ్య చీలికలు తెచ్చే కుట్రకోణం కూడా ఇందులో దాగి ఉంది. ఇప్పుడు అర్ధం అయ్యిందా ? ఉచిత విద్యుత్తు వెనుక దాగివున్న రహస్యం. ఇకపోతే అసలు ఉన్న విద్యుత్తు మీటర్లను తొలగించి ప్రీపెయిడ్ , స్మార్ట్ మీటర్లను ఎందుకు బిగించవల్సి వస్తోంది? కారణం విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేటు సంస్థలు చొరబాటే! విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటీ కరించారు. ఇప్పుడు విద్యుత్ సరఫరాను ప్రైవేటీ కరిస్తున్నారు. అన్ని ప్రభుత్వం ధనంతో నిర్మించి మరీ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు మీటర్ రీడింగ్ , విద్యుత్ వాడకంకు అయిన బిల్లు వసూలును కూడా ప్రైవేటీ కరిస్తున్నారు. మరి ప్రైవేటీకరణ చేస్తే పెట్టుబడి దారులకు లాభం ఉండాలి కదా ? వారికి లాభం ఉంటేనే కదా రాజకీయ నాయకులకు ఆమ్యామ్యాలు ఉండేది.
మరి ఇన్ని వేలమంది ఉద్యోగులు ఉంటే వారి జీతాలకే సింహ భాగం ఖర్చయిపోతే వారికి మిగిలేది ఏముంటుంది ? అందుకే బిల్లు వసూలును అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయడం వారి లక్ష్యం. అసలు ఈ గొడవ అంతా ఎందుకు ? విద్యుత్ ఉత్పత్తి అంటే ..దారిన పోయే గాలి , నీరు లాంటిది కాదు.
పెట్టుబడి పెట్టాలి. ఉత్పత్తి చేయాలి. సరఫరా చేయాలి.బిల్లు వసూలు చేసుకోవాలి . ఇంత వ్యవస్థలో వేలాది మంది ఉద్యోగులు ఉంటారు. వీరి జీతాలు కోట్లలో చెల్లించాలి. అంతలా జీతాలు చెల్లిస్తే పెట్టుబడిదారీ సంస్థలు రాజకీయ నాయకులకు మేత ఎక్కడి నుండి తీయాలి? తమ ఉద్యోగులకు జీతాలు ఎలా ఇచ్చుకోవాలి? ఇవన్నీ చేస్తే తమ సంస్థకు ఎంత మిగలాలి ? ఇవన్నీ చెల్లిస్తే దివాళా తీస్తామని భావించి , సాంకేతికతను వాడుకునే ప్రయత్నమే ఈ ప్రీపెయిడ్ , స్మార్ట్ మీటర్ల బిగింపు.
ప్రీపెయిడ్ మీటర్లలో ఉన్న మరలబ్ ఏమిటంటే సెల్ ఫోన్ ను మనం డబ్బు ముందే చెల్లించి ఎలా వాడుకుంటామో.. ఈ ప్రీపెయిడ్ మీటర్లలో కూడా ముందే డబ్బు చెల్లించి విద్యుత్తును కొనుక్కోవాలి. బజారులో కూరలు , షాపులో వస్తువులు , అంతెందుకు ఇంట్లో టి.వి ప్రసారాలకు కూడా ముందే డబ్బు చెల్లించి తీసుకోగా లేనిది.. విద్యుత్తుకు ఎందుకు ముందు చెల్లించరు అనే ‘లా’ పాయింటును లాగి, ఈ పెట్టుబడి దారీ సంస్థలు పన్నిన కుట్రే ఈ ప్రీపెయిడ్ , స్మార్ట్ విద్యుత్ మీటర్ల బిగింపు వ్యవస్థ. గ్రామవాసులే కాదు, పట్టణ – నగర వాసులు కూడా అప్రమత్తతతో ఉండాలని , ముఖ్యంగా అపార్ట్ మెంట్ లో మీటర్లు అన్నీ కింద ఉంటాయి కాబట్టి వాచ్ మెన్ కు ముందే హెచ్చరించి ఉండాలని ఎట్టి పరిస్థితిలో మీటర్ల బిగింపుకు అంగీకరించ కూడదని విద్యుత్ పోరాట ఐక్య వేదిక సూచిస్తోంది. అదానీ మీటర్లు ఇవి కావని , మీటర్ మార్చుతున్నామని ఉద్యోగులు చెబుతున్నారని, పైగా మార్చినందుకు 200 , 300 డబ్బు డిమాండ్ చేస్తున్నారని కూడా వారు చెబుతున్నారు.
ఒక్కసారి గనుక బిగింపుకు అంగీకరిస్తే మీ జుట్టు అంతా పెట్టుబడిదారీ సంస్థ చేతుల్లోకి పోతుంది. మొదట ప్రభుత్వ కార్యాలయాలకు , పరిశ్రమలకు , వ్యాపార కూడళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించారు. పరిశ్రమల వారు, వ్యాపారాలు మీటర్ రీడింగ్ ఎక్కువ వస్తోందని గగ్గోలు పెట్టారు. వెంటనే రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు ఆ మీటర్లను తొలగించి , పరిస్థితిని చక్కదిద్ద వలసిందిగా ఆదేశాలు ఇచ్చి యున్నారు. అయినా అవేమీ పట్టించు కోకుండా ముందుకే సాగుతోంది ప్రభుత్వం.
పొరపాటున ఒక్కసారి బిగింపుకు అవకాశం ఇస్తే మొత్తం వ్యవస్థ అదానీ చేతుల్లోకి వెళుతుంది. ఇందులో కష్ఠ , నష్ఠాలను పరికించి చూస్తే , ప్రధానంగా ఎవరి మీటరు ధర వారే చెల్లించుకోవాలి. సింగిల్ ఫేస్ మీటర్ కు 7,912/- , త్రీ ఫేస్ మీటర్ కు 16,192/- రూ.లు భారం మోపుతున్నారు. ఎలా అంటే 92 నెలల పాటు మనకు ఇచ్చే నెలవారీ బిల్లులో సింగిల్ ఫేస్ మీటర్ వారికి 86/-, త్రీ ఫేస్ వారికి 196/- రూ.లు అదనంగా చెల్లించ వల్సి వస్తుంది. ఇది గత వై.సి.పి ప్రభుత్వ నిర్ణయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారింది. మీటర్ రీడింగే కాదు నియంత్రణ కూడా ఒక భాగం.