Suryaa.co.in

Food & Health

మనుషులంతా ఒక్కటే.. ఎవడి ఇంజన్ వాడిదే!

వారం రోజులుగా సుబ్బారావుకి కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ మెలితిప్పి నట్టు బాధ. నిద్రపోయే అర్దరాత్రి వేళ గుండెల్లో గ్యాసు తన్నుకొస్తోంది.మోషన్ అయితే ఔతోంది, కాకపోతే కావట్లేదు.
ఇంట్లో వాతావరణం కాలుష్యం చేస్తూ నిరంతరం అపాన వాయువు. వేడినీళ్ళు, వామునీళ్ళు, జీలకర్ర నీళ్ళు తాగు తూనే ఉన్నా ఏదో కాస్త ఉపశమనం ఉన్నా బాధ యథాతధం.
ఇది పనికాదని ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ డా.కాలేయ గారి ఎపాయింట్ మెంటు తీసుకున్నాడు. ఆయన ఆన్లైన్లో చేయించవలసిన టెస్ట్ లు చెప్పగా అవన్నీ చేయించి ఆ ఫైలు తీసుకొని అపాయింట్మెంట్ రోజున కలిసాడు డా.కాలేయ గారిని.రిసెప్షనిస్ట్ రిపోర్ట్ లన్నీ తీసుకుని టోకెన్ ఇచ్చి మిమ్మల్ని ఓ అరగంటలో పిలుస్తారు కూర్చోండి అంది.
తన టర్మ్ రాగానే లోపలికి పోయాడు సుబ్బారావు.
డా.కాలేయ గారు రిపోర్ట్ పరిశీలించి మీకు కడుపులో బాగా అజీర్ణం ఉంది. ఇది బాగా ఫేటీ లివర్ వల్ల, ఆహారం అరగక పోవడం వల్ల, కొంత ఇన్ఫెక్షన్ వల్ల, ఏర్పడింది. పచ్చివి తిన్నట్టున్నారు బహుశా అన్నాడు.
మీ సమస్యలన్నీ మీకు అరుగుదల సరిగా లేకపోవడం వల్ల.చక్కగా ఉడికినవి, సులువుగా అరిగేవి తినండి.ఓఫ్లాస్కు కొనుక్కుని తరచుగా వేడినీళ్లు తాగుతూ ఉండండి.పచ్చికూరలు,గింజలు, కొబ్బరి నూనె తాగడం, నెయ్యి నాకేయడం,ఇలాంటివి కొన్నాళ్ళు మానేసి ఉడకపెట్టినవి సులువుగా జీర్ణం అయ్యేవి తినండి.మందులు రాస్తున్నా అని మందులు రాస్తుండగా, డా.కాలేయ గారి వెనుక గోడమీద ఉన్న నాలుగురు ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.
ఆ ఫోటోలు ఒకటి పకృతి వీర్రాజుది, బాదాం బాలనాయుడిది, ఆకు కూరలు అప్పలరాజుది, అరికెల పాషాది.
సుబ్బారావు డాక్టర్ గారూ మీరు కూడా వీరి అభిమానులా వీరి ఫాలోయర్సా అనడిగాడు.
డా.కాలేయ నవ్వుతూ వీరి ఫాలోయర్స్ సగం మంది నా ఫాలోయర్స్.నా వైద్యం అభివృద్ధికి వీరే కారణం.యూట్యూబుల్లో మీలాగే వీరిని ఫాలో అయ్యేవారులో సగం మంది జీర్ణవ్యవస్థ దెబ్బ తిని నా దగ్గరకు వస్తారు అందుకే వీరు నాకు ప్రాతస్మరణీయులు అన్నాడు.
చివరగా సుబ్బారావు గారూ మీకో మాట.ఎవరికో మొలకలు సరిపోతాయని మీకు సరిపోవు. మనుషులందరూ ఒక్కటే అయినా ఎవడి ఇంజను వాడిదే.ఈ వయసులో ప్రయోగాలు వద్దు. తేలికగా అరిగేవి తింటూ వాకింగ్ చేయండి.నెల రోజుల తర్వాత రండి.అలాగే వింటూ బయటికొచ్చిన సుబ్బారావుకి మనసులో మారు మోగుతున్న డా.కాలేయగారి మాట:మనుషులంతా ఒక్కటే…కానీ ఎవడి ఇంజను వాడిదే

LEAVE A RESPONSE