Suryaa.co.in

Telangana

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు

– పార‌దర్శ‌కంగా గ్రామ‌సభ‌ల్లో ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల జాబితాలు
– త్వ‌ర‌లో సర్వేయ‌ర్ల, గ్రామాధికారుల‌ నియామ‌కం
– రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైదరాబాద్ :- ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్ర‌క్రియ‌, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిదేన‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. మొద‌టి విడ‌త‌లో ఇండ్ల స్ధ‌లం ఉన్న‌వారికి , రెండ‌వ విడ‌త‌లో ఇంటి స్ధ‌లంతో పాటు ఇందిర‌మ్మ ఇల్లును నిర్మించి ఇస్తామ‌ని తెలిపారు.

ఇందిర‌మ్మ ఇండ్లు, గ్రామాల‌లో రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌, స‌ర్వేయ‌ర్ల నియామ‌కంపై డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో శుక్ర‌వారంనాడు చీఫ్ సెక్ర‌ట‌రీ శాంతికుమారితో క‌లిసి స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్ , హౌసింగ్ సెక్ర‌ట‌రీ జ్యోతి బుద్ధ ప్ర‌కాష్‌, హౌసింగ్ కార్పోరేష‌న్ ఎండీ వి.పి. గౌత‌మ్, జిహెచ్ ఎం సీ క‌మీష‌న‌ర్ ఇలంబ‌ర్తి, సిఎంఆర్‌వో డైరెక్ట‌ర్ మ‌క‌రంద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ఇంజ‌నీరింగ్ విభాగాన్ని స‌మ‌కూర్చుకోవ‌డం, ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామ‌కం, సర్వేయ‌ర్ల నియామ‌కంపై స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల‌కు అర్హులైన ల‌బ్దిదారుల‌కు సంబంధించిన నివాస స్ధ‌లం ఉన్న‌వారి జాబితా, నివాస స్ధ‌లం లేని వారి జాబితా రెండు జాబితాల‌ను గ్రామ‌సభ‌ల్లో పెట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. ద‌శ‌ల వారీగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం హౌసింగ్ కార్పొరేష‌న్‌లో 274 మంది ఇంజ‌నీర్లు మాత్ర‌మే ఉన్నార‌ని రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం , ప‌ర్య‌వేక్ష‌ణ‌కు మ‌రో 400 మంది ఇంజ‌నీర్లు అవ‌స‌ర‌మ‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు మంత్రిగారి దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల‌లో ఇంజ‌నీరింగ్ సిబ్బంది సేవ‌ల‌ను ఏ విధంగా ఉప‌యోగించుకోవ‌చ్చు వంటి అంశాల‌ను ప‌రిశీలించాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రిసిఎస్ కి సూచించారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌కు సూచించారు. విలేజీ రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌కు సంబంధించి ప్ర‌తి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియ‌మిస్తామ‌ని ఇందుకోసం విఆర్వో, విఆర్ఎ నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి ప్ర‌త్యేకంగా పరీక్ష నిర్వ‌హించాల‌ని, ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన విధివిధానాల‌ను త‌క్ష‌ణ‌మే రూపొందించి ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం 450 మంది స‌ర్వేయ‌ర్లు ఉన్నార‌ని అద‌నంగా మ‌రో వెయ్యి మంది స‌ర్వేయ‌ర్లు అవ‌స‌ర‌మున్న నేప‌ధ్యంలో స‌ర్వేయ‌ర్ల ఎంపికకు కావ‌ల‌సిన ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని ఎంపిక విధానం పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు.

LEAVE A RESPONSE