రోడ్డు కోసం మహిళలు బిచ్చమెత్తారు!

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎక్కడైనా రోడ్డు కావాలని అధికారులకో, మంత్రులకో, ఎమ్మెల్యేలకో వినతిపత్రాలు ఇస్తారు. అదీకాకపోతే ధర్నాలు చేస్తారు. ఇవేమీకాకపోతే తమ వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులను నిలదీస్తారు. కానీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లా గుడివాడలో… టీడీపీ మహిళా నేతలు, స్థానికులతో కలసి అందుకు భిన్నమైన రీతిలో నిరసన నిర్వహించారు. అధ్వానంగా ఉన్న రహదారుల నిర్మాణానికి సహకరించాలంటూ వ్యాపార దుకాణాల వద్ద తెలుగు మహిళలు భిక్షాటన చేశారు. వచ్చిన నగదుతో దెబ్బతిన్న విజయవాడ రహదారికి మరమ్మతులు చేపడతామని చెప్పారు. ప్రమాదభరితంగా ఉన్న రహదారుల కారణంగా, వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు వేయడానికి జగన్ సర్కారు దగ్గర డబ్బుల్లేవు కాబట్టి… ఈడ్చితన్నినా నయాపైసా లేదు కాబట్టి.. అందరం జనం వద్ద అడుక్కుని రోడ్డేసుకుందాం అంటూ.. బొచ్చెలతో రోడ్డెక్కిన వైనం అందరినీ ఆకర్షించింది. రోడ్డు వేయడం ప్రభుత్వం పని కదా? అని నోళ్లు నొక్కుకున్న వాళ్లే.. ‘పోనీలే సర్కారెలాగూ డబ్బుల్లేక రోడ్డు వేయడం లేదు కాబట్టి, మనమే పదో పరకో ఇస్తే రోడ్డు వస్తుంది కదా’ అన్న పెద్ద మనసుతో, జనం కూడా భిక్షాటన చేస్తున్న వారి బొచ్చెల్లో పదో పరకో వేశారు. ఆరకంగా బాగానే పోగయ్యాయట. మరి అన్నీ జనమే చేసుకుంటే, ఎన్నికల్లో వేసిన ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఉన్నది ఎందుకన్నది బుద్ధిజీవుల సందేహం! పాలకులూ… మీకు అర్ధమవుతోందా?

Leave a Reply