లైంగిక వేధింపుల నిరోధానికి ‘అంతర్గత కమిటీ’లు

మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి
– ఏఎన్ యూలో ‘పోష్’ చట్టంపై శిక్షణ విజయవంతం
– మహిళా సమస్యలపై చర్చలతో విజ్ఞాన సమాజం
ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి స్పష్టం
– శిక్షణకు భారీగా వర్శిటీ అనుబంధ కళాశాలల సిబ్బంది
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం: ఆడపిల్లల పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్,రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘పోష్'(ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్) చట్టం పై శిక్షణా కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు.
వర్శిటీ ఉమెన్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కెవి శాంతిశ్రీ అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళా సాధికారత, గృహ హింస, మహిళా ఉద్యోగినులు పని చేసే చోట లైంగిక వేధింపులు అనే అంశాలపై కమిషన్ నిరంతర కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సమస్యలపై మహిళా కమిషన్ సత్వర స్పందనతో అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులేస్తుందన్నారు. మహిళల రక్షణ, భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వ ఆలోచనలు క్షేత్రస్థాయిలో ఫలితాలిస్తున్నాయని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి సూచనలతో పనిప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలకు మహిళా కమిషన్ కసరత్తు చేస్తుందన్నారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళా ఉద్యోగుల్లో ఫిర్యాదిచ్చే వాతావరణం పెరిగిందన్నారు. పనిచేసే ప్రదేశాలలో లింగవివక్షత, లైంగిక వేధింపులకు సంబంధించి సమస్యను గుర్తించడంలో మహిళా ఉద్యోగులు చురుగ్గా ఉండాలన్నారు. వేధింపులను మౌనంగా భరిస్తున్న ఎంతో మంది మహిళలకి ఈ చట్టం ద్వారా రక్షణ ఉందని, ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించి, ఆమెకు న్యాయం అందించడమే చట్టం ముఖ్యోద్దేశం అనే ప్రచారం ముమ్మరంగా జరగాలని ఆమె పిలుపునిచ్చారు.
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర మహిళల భధ్రతకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నడుంబిగించారని.. తమ కౌన్సిల్ ద్వారా కమిషన్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొందుతామన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ, కళాశాల అడ్మిషన్లలో మహిళల శాతం తగ్గడంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సమస్యలపై చర్చించడంతోనే వికసిత, విజ్ఞాన సమాజం నిర్మించుకోవచ్చన్నారు. మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ మాట్లాడుతూ ‘మీ టూ’ ఉద్యమానికి ప్రభావితమై అధికారులపై ఫిర్యాదులిచ్చేందుకు మహిళలు ముందుకు రావడం శుభపరిణామమని, పోష్ చట్టం ప్రకారం అంతర్గత కమిటీలను గ్రామ, వార్డు సచివాలయాల స్థాయికి తీసుకెళ్లేందుకు కమిషన్ చొరవ చూపుతుందన్నారు.
అంశాలవారీగా అవగాహన:
‘మహిళా సాధికారత, గృహహింస, లైంగిక వేధింపులు’ అంశాలకు సంబంధించి ‘పోష్‌’ చట్టంపై జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కార్యదర్శి కె. రత్నకుమార్ వివరించారు. పోష్ చట్టం ప్రకారం.. అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయని సంస్థ యజమానికి రూ.50 వేల జరిమానా విధింపుతో పాటు సంస్థ లైసెన్సు రద్దుచేసే అవకాశం ఉందన్నారు.
పనిచేసే చోట మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఈ చట్టం దోహదపడుతుందన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి స్త్రీల సమస్యల పై మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. శిక్షణలో ఉన్నవారికి కమిషన్ తరపున సర్టిఫికేట్ల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్. సూయజ్, కార్యదర్శి వై.శైలజ, మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోరంజని, వర్శిటీ రెక్టార్ పి.వరప్రసాద్ మూర్తి, రిజిస్టార్ బి.కరుణ, న్యాయవాది అనుపమ దార్ల, ఉమెన్ నెట్ వర్క్ కో ఆర్డినేటర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.