– వీఆర్వో విజయలక్ష్మికి షోకాజు నోటీసు
ఎన్టీఆర్ జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినట్లు ఫిర్యాదు నేపథ్యంలో 259వ వార్డు సచివాలయం వీఆర్వో విజయలక్ష్మికి షోకాజు నోటీసు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం తెలిపారు. అజిత్ సింగ్ నగర్, షాది ఖానా రోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నట్లు ఆరోపణలు నేపథ్యంలో షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకవైపు వరదను నియంత్రించే చర్యలతో పాటు మరోవైపు బాధితులకు సహాయ సహకారాలు అందించడంపై ప్రతిష్టాత్మకంగా దృష్టి సారించినందున బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు నిర్లక్ష్యం వహించినా, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించినా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు ఆపన్నహస్తం అందించడంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సృజన సూచించారు.