Suryaa.co.in

Editorial

అసెంబ్లీ బరి నుంచి కిషన్‌రెడ్డి అవుట్?

– మళ్లీ లోక్‌సభ నుంచే పోటీకి సిద్ధం
– తన మనోగతాన్ని బీజేపీ బాసులకు చెప్పిన కిషన్‌రెడ్డి
– కిషన్‌రెడ్డి అభ్యర్ధనను అంగీకరించిన బీజేపీ బాసులు
– అంబర్‌పేట బరిలో గౌతమ్‌రావు, కృష్ణాయాదవ్
– గౌతమ్‌రావు వైపు కిషన్‌రెడ్డి చూపు
– కృష్ణాయాదవ్‌కు ఇస్తే గెలుస్తారంటున్న క్యాడర్
– బీసీలకే ఇవ్వాలంటున్న బీజేపీ శ్రేణులు
– తెరపైకి కిషన్‌రెడ్డి భార్య అభ్యర్ధిత్వం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలంతా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు-కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి మాత్రం అందుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో అంబర్‌పేట అసెంబ్లీ సీటు ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు బండి సంజయ్, విజయశాంతి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు వంటి అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. అయితే ఆ జాబితాలో ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాత్రం అందుకు మినహాయింపు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. తాను అసెంబ్లీ నుంచి కాకుండా, మళ్లీ సికింద్రాబాద్ లోక్‌సభ నుంచే పోటీ చేస్తానని బీజేపీ బాసులను అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. అందుకు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దానితో కిషన్‌రెడ్డి అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్నట్లయింది.

రాష్ట్రంలో బీజేపీ గెలిచే పరిస్థితి లేక పోవడం.. కనీసం ప్రధాన ప్రతిపక్షం స్థాయికి కూడా చేరే అవకాశాలు కనిపించకపోవడం.. ఈటల, సంజయ్, అర్వింద్, విజయశాంతి వంటి అగ్రనేతలు కూడా అసెంబ్లీ బరిలో ఉండటం ఇబ్బంది వంటి అంశాలను, ఆయన పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. పోటీకి సంబంధించి కిషన్‌రెడ్డి కొద్దికాలం క్రితం సర్వే చేయించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ నుంచి పోటీ తనకు అనుకూలిస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే మళ్లీ కేంద్రమంత్రి పదవి వస్తుందని, ఒకవేళ రాకపోయినా జాతీయ రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉంటుందన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ కూడికలు-తీసివేతల తర్వాతనే ఆయన అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది.

దీనితో జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌతమ్‌రావు, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్ మధ్య పోటీ నెలకొంది. కిషన్‌రెడ్డి తన అనుచరుడైన గౌతమ్‌రావు వైపు మొగ్గు చూపుతుండగా.. కార్యకర్తలు మాత్రం.. గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన కృష్ణాయాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కృష్ణాయాదవ్ బరిలో ఉంటే పోటీ బలంగా ఉంటుందని వాదిస్తున్నారు.

కృష్ణాయాదవ్‌కు స్థానికంగా పట్టు ఉండటం, నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉండటం బీజేపీకి కలసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. గౌతమ్‌రావు ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వలేరని, పైగా ఆయన సామాజికవర్గానికి చెందిన వారి సంఖ్య, నియోజకవర్గంలో అత్యల్పమని గుర్తు చేస్తున్నారు. బీసీలకు సీటు ఇస్తేనే బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోగలమని స్పష్టం చేస్తున్నారు.

అయితే కిషన్‌రెడ్డి భార్య కూడా, పోటీలో ఉండే అవకాశం లేకపోలేదని కొద్దికాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఆమె కూడా, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఒకవైపు తాము బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ అని విమర్శిస్తూ… మరోవైపు తామే కుటుంబసభ్యులను రంగంలోకి దింపితే, నైతికంగా పార్టీ బలహీనపడుతుందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE