ప్రశ్నించడం
నేడు ఒక పెద్ద సవాలు
ప్రశ్నించడం
నేడు ఒక ఎదురీత !
వ్యవస్థకు చెందిన ప్రశ్నైనా
దురవస్థకు చెందిన ప్రశ్నైనా
అర్ధం చేసుకునే వారేరి ?
ప్రశ్నించే వాడు
వ్యక్తిగత ప్రయోజనం కోసం
దేబులాడుతున్నడనే
బురద జల్లుడే ఎక్కువ!
కక్ష పూరితంగా
ఎదురు దాడి చేస్తున్నట్లు భావన !
వాదాలను, సిద్దాంతాలను
ధిక్కరిస్తున్నట్లు స్థిరీకరణ !
ప్రశ్నించేవాడు మావాడు కాదు
శత్రు పక్షమనే ఆలోచన !
స్నేహితుల బృందమైనా
బంధు వర్గమైనా
ప్రశ్నించే వాడిని
ప్రక్కకు నెట్టే దుస్థితి!
ఇన్ని ముసుర్లు మధ్య
ఎవరైనా ఎందుకు ప్రశ్నించాలి ?
ధిక్కార స్వరంతో సాగితే
కోర్టు మెట్లు ఎక్కాలో
జైలు ఊచలు లెక్కించాలో ?
సుఖంగా ఉన్న ప్రాణానికి
కష్టాల పాలు చేయడమెందుకు ?
తటస్థంగా ఉంటే పోలా
మౌనంగా ఉంటే సరిపోలా !
నేడు ప్రశ్నించడం
పెద్ద సవాలు
గొప్ప ఎదురీత !
– పి.లక్ష్మణ్ రావ్
విశాఖపట్నం
9441215989