Suryaa.co.in

Andhra Pradesh

ఇంత… దిగజారుడు రాజకీయమా?

– గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం ఒకవైపు… గంజాయి బ్యాచ్ కు మద్దతు తెలుపుతున్న ఓన్లీ ప్రతిపక్షం మరొకవైపు

– శాంతి భద్రతల పరిరక్షణ ప్రజా ప్రతినిధి బాధ్యత
– జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోవచ్చు
– కానీ పులివెందుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి
– నేనున్నానంటూ జగన్మోహన్ రెడ్డి భుజం తట్టడం రాజకీయ ఆత్మహత్య సదృశ్యమే
– హెడ్ కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసిన గంజాయి బ్యాచ్ ను నడిరోడ్డుపై శిక్షించడం అధర్మం… అన్యాయమేమీ కాదు
– గతంలో అదే పార్టీలో ఉన్న నేను నాలుగు మంచి వ్యాఖ్యలు చెప్పినందుకు నన్ను దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు
– 120 నుంచి 125 సార్లు ఐదు విడతలుగా జగన్మోహన్ రెడ్డి పురమాయిస్తే సునీల్ కుమార్ పంపించిన గ్యాంగ్ కొట్టారు
– ఇది ఇన్ డైరెక్ట్ గా ఏదో మూల నాకు లింక్ అయిన అంశం కాబట్టే ఉపసభాపతిగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నేను మాట్లాడుతున్నా
– గంజాయి బ్యాచ్ లీడర్ జాన్ విక్టర్ హిందువు కాదు… దళితుడు అంతకంటే కాదు
– గంజాయి బ్యాచ్ నిందితుడు దళితుడని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టేందుకే జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన…
– శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు

విజయవాడ: ప్రజా కంఠకులుగా తయారైన క్రిమినల్స్ ను పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, వాళ్లకు మద్దతుగా ఇటువంటి వెధవలకు నేనున్నానంటూ జగన్మోహన్ రెడ్డి భుజం తట్టడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమైనని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు.

రాజకీయాలలో హత్యలు ఉండవు … ఆత్మహత్య లేనని సామెతలు ఊరికే రాలేదని, ఇటువంటి వారిని చూసే వచ్చి ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు ఒక్క వైకాపాకు తప్ప ఈరోజు సుదినమని ఆయన వ్యాఖ్యానించారు. గంజాయి కేసులలో శిక్ష పడి, జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి మద్దతును తెలియజేయడం ఓట్ల కోసం దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట కాదా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఈ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డికి గతంలో వచ్చిన ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తారన్నారు. పోలీసు హెడ్ కానిస్టేబుల్ పై హత్యా ప్రయత్నాన్ని చేసిన క్రిమినల్స్ ను ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి నడిరోడ్డుపై శిక్షిస్తే, తగుదునమ్మా అంటూ జగన్మోహన్ రెడ్డి వారి పరామర్శకు వెళ్లడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధికి ఉందన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయినా పులివెందుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అని గుర్తు చేశారు.

మంచి మాటలు చెబితే గతంలో నన్ను కొట్టారు

గతంలో సొంత పార్టీలో ఉన్న నేను నాలుగు మంచి మాటలు, మంచి సలహాలను చెబితే దారుణంగా హింసించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అప్పుడు రాష్ట్రం లో జరుగుతున్న తప్పులను వివరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, తప్పులను ఎత్తి చూపాల్సి వచ్చిందన్నారు. దానిని అన్యాదగా భావించి జగన్మోహన్ రెడ్డి, నన్ను దారుణ చిత్రహింసలకు గురి చేశాడని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

తెనాలిలో గంజాయి బ్యాచ్ ను రోడ్డుపై కొట్టింది నథింగ్ అని, నన్ను అంతకంటే దారుణంగా చిత్రహింసలకు గురి చేశారన్నారు. 120 నుంచి నూట పాతిక సార్లు ఐదు విడతలుగా జగన్మోహన్ రెడ్డి పురమాయిస్తే సునీల్ కుమార్ పంపిన గ్యాంగ్ నా అరికాళ్ళపై కొట్టారన్నారు. ఇన్ డైరెక్ట్ గా ఏదో మూల నాకు లింక్ అయిన సబ్జెక్టు కాబట్టే ఉపసభాపతిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ, నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

నన్ను చిత్రవధ కు గురి చేసిన వీడియోలు ప్రజాబాహుళ్యంలో ఉన్నాయని, మిలిటరీ ఆసుప త్రి ఇచ్చిన రిపోర్టులు ఉన్నాయని తెలిపారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు అన్యాయంగా నన్ను చిత్ర హింసలకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు పోలీసులు గంజాయి బ్యాచ్ ను కొడితే… తగుదునమ్మా అంటూ పరామర్శకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం పార్సిల్ చేసిన వ్యక్తికి మద్దతునిచ్చిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.

గతంలో ఆయన చేసిన దురాగతాలు ఎన్నో ఉన్నాయని, వాటి గురించి చాలామంది మాట్లాడారని, ఆ విషయాల జోలికి తాను వెళ్ళనని రఘురామకృష్ణంరాజు తెలిపారు. గంజాయి బ్యాచ్ నిందితుడైన జాన్ విక్టర్ కు మద్దతు తెలియజేయడం కోసం తెనాలికి గతం లో ఒక ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి వెళ్లడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర చూస్తే, అప్పట్లో అదే పార్టీలో ఉన్న నన్ను చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు.

గంజాయి… చైన్ బ్యాచ్ అని వారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి

తెనాలిలో రౌడీ షీటర్ గా గుర్తింపు పొందిన జాన్ విక్టర్ ను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానికంగా పర్యటించడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. జాన్ విక్టర్ తో పాటు అతని గ్యాంగ్ లోని ముగ్గురు, నలుగురు వ్యక్తులపై ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వారిపై కేసులు కొనసాగుతున్నాయన్నారు. జాన్ విక్టర్ తో పాటు అతడి గ్యాంగ్ పోలీస్ స్టేషన్ కు ఎన్నోసార్లు వెళ్లారు, వచ్చారన్నారు.

వారికి గంజాయి బ్యాచ్, చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయన్నారు. తెనాలిలో ప్రసిద్ధిగాంచిన గంజాయి ముఠాగా, విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న రౌడీ షీటర్ల ని ఎద్దేవా చేశారు. తెనాలిలోని బలహీన వర్గానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ పై ఈ గంజాయి బ్యాచ్ హత్యా యత్నం చేశారన్నారు. అతని శ్రీమతి ఎంతో వాపోయిందని, ఆమె దళిత సామాజిక వర్గానికి చెందినదని… వారిద్దరూ ప్రేమ వివాహాన్ని చేసుకున్నారన్నారు.

ఒక హెడ్ కానిస్టేబుల్ పై హత్యా యత్నం చేసిన వ్యక్తులను పబ్లిక్ అవేర్నెస్ కోసం పోలీసులు రోడ్డుపై శిక్షించాలని నిర్ణయించారు.. చాటున వారిని శిక్షిస్తే జైలుకు వెళ్లడం, రావడం, వారికి ఒక అలవాటుగా మారిందని అందుకే పబ్లిక్ లో శిక్షించాలని నిర్ణయించారు. చట్టపరంగా అది తప్పే అయినప్పటికీ ఇలాంటి చోటే చట్టం, న్యాయం, ధర్మం అనే ప్రస్తావనలు వస్తాయి. చట్ట ప్రకారం కరెక్ట్ కాకపోయినప్పటికీ, అధర్మం అన్యాయమేమీ కాదని అన్నారు.

జాన్ విక్టర్ హిందువు, దళితుడు కాదు

గంజాయి బ్యాచ్ నిందితుడైన జాన్ విక్టర్ హిందువు కాదని, దళితుడు అంతకంటే కాదని రఘురామ కృష్ణంరాజు తేల్చి చెప్పారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి మతం మారిన వ్యక్తులకు కులం వర్తించదన్నారు. ఈ విషయాన్ని తాను గతంలో ఎన్నోసార్లు మాట్లాడినట్లు గుర్తు చేశారు. జాన్ విక్టర్ గురించి విచారిస్తే కచ్చితంగా బీసీ సీ అయి ఉంటాడని తెలిపారు. అటువంటి వ్యక్తి దళితుడని చెప్పి దళితులని రెచ్చగొట్టడం… జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట కాదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

సునీల్ కుమార్ ను విచారణకు పిలవకపోవడం సముచితం కాదు

గతంలో నన్ను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తులు, ఇప్పుడు తాము ఏమీ చేయలేదని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ ఆలస్యమైనప్పటికీ… నో డౌట్ ఆలస్యమే అయింది. ఇంతవరకు సునీల్ కుమార్ ను విచారణ కే పిలువ లేదని గుర్తు చేశారు. సునీల్ కుమార్ ఊహల్లో సృష్టించుకున్న ఆర్మీ , నిజంగా ఉందని ఎవరైనా భయపడుతున్నారేమో నాకు తెలియదని, ఏది ఏమైనప్పటికీ సునీల్ కుమార్ ను విచారణకు పిలువకపోవడం కచ్చితంగా సముచితం రఘురామ కృష్ణంరాజు అన్నారు.

చట్టపరిది ఎక్కువేనని ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుందనే విశ్వాసం నాకు ఉందని ఆయన పునరుద్గాటించారు. రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని, ఏ ప్రభుత్వంలోనైనా లా అండ్ ఆర్డర్ బాగుంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారని తెలిపారు. ఇవాళ గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని చూస్తున్న ప్రభుత్వం ఒకవైపు, వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న ఓన్లీ ప్రతిపక్షం ఒకవైపని, ఈ రాజకీయ ఆత్మహత్య ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూద్దామని రఘురామకృష్ణం రాజు అన్నారు.

LEAVE A RESPONSE