Suryaa.co.in

Andhra Pradesh

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ధర్మం కాదు కదా?

నడిరోడ్డుపై కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు?
రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు
– గుంటూరు జిల్లా తెనాలి, ఐతానగర్‌లో పర్యటించిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తెనాలి: రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నిస్తే నేరంగా పరిగణిస్తోందని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారుతోందని, ఆ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని, అక్కడ మీడియాతో మాట్లాడిన వైయస్‌ జగన్‌ అన్నారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అదుపు తప్పిపోతే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుందని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అనేక సంఘటనలు గమనిస్తే.. ప్రతి సంఘటనలో ఏ రకంగా చంద్రబాబు, ఆయన పార్టీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందో కనిపిస్తుంది.

పోలీసుల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న రాజేష్‌ అనే పిల్లాడు, మరో పిల్లాడు చేబ్రోలు జాన్‌ విక్టర్, ఇంకో పిల్లాడు కరిముల్లా. వీరు దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వారు. రాకేష్‌ అనే పిల్లాడు తెనాలిలో ఉండడు. జూమాటో కంపెనీలో హైదరాబాద్‌లో పని చేస్తుంటాడు. వీళ్లంతా యంగ్‌స్టర్స్‌. చిన్నతనంలో ఏదో పాత గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం తెనాలికి వచ్చాడు.

అతన్ని చూడడానికి ఫ్రెండ్‌ వచ్చాడు. అతడు పాలిటెక్నిక్‌ చదివాడు. అతడూ తెనాలిలో ఉండడు. మంగళగిరి నుంచి జాన్‌ విక్టర్‌ వచ్చాడు. అతడు జూనియర్‌ అడ్వకేట్‌. బార్‌ కౌన్సిల్‌లో కూడా రిజిస్టర్‌ అయ్యాడు. రాకేష్‌ను చూడడానికి తెనాలి వచ్చిన విక్టర్‌ వెంట, అతడి స్నేహితుడు కరిముల్లా కూడా వచ్చారు. అతడు మెకానిక్‌.

ఇంత దారుణంగా చట్ట ఉల్లంఘన జరుగుతుంటే, అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? పోలీసులు తమను దారుణంగా హింసించారని, తమ ఒంటిపై గాయాలున్నాయని ఆ ముగ్గురూ వాటిని చూసినా, ఆస్పత్రిలో వైద్యుడు ఎందుకు పట్టించుకోలేదు? వాటిని ఎందుకు నోట్‌ చేయలేదు? ఎందుకంటే అది మెడికో లీగల్‌ కేసు అవుతుందన్న భయం. అలాగే పోలీసులు డాక్టర్‌ను బెదిరించి అయినా ఉండాలి. లేదా ప్రలోభాలకు గురి చేసైనా ఉండాలి.

ఏప్రిల్‌ 26న ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదితే, నెల రోజుల తర్వాత ఈ వీడియో ఎలా బయటకొచ్చింది?. నిజానికి ఆ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను జీర్ణించుకోలేక మంచి వారైన కొందరు పోలీసులు ఈ వీడియోను బయటపెట్టారు.

ముగ్గురు యువకులను అంత దారుణంగా హింసించిన పోలీసులు, తమ చర్యలను సమర్థించుకోవడం కోసం వారిని సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్‌గా, రౌడీలుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ ముగ్గురు యువకులపై పాత కేసులున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఆ కేసులకూ, ఈ ఘటనకూ ఏం సంబంధం? అంత దారుణంగా వారిని నడిరోడ్డు మీద హింసించాలా? నేను ఆ ముగ్గురు యువకులను వెనకేసుకు రావడం లేదు. అలా వారిని అందరూ చూస్తుండగా, నడిరోడ్డుపై అంతలా హింసించడం ఎంత వరకు సబబు? కేసులుంటే కోర్టు చూసుకుంటుంది. కానీ, శిక్షించడానికి పోలీసులకు ఏం అధికారం, హక్కు ఉన్నాయి? అసలు శిక్షించడానికి పోలీసులు ఎవ్వరు?.

జరిగిన సంఘటనలను ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హననం చేస్తున్న పోలీసులను నేను ఒకటే అడుగుతున్నా. జాన్‌ విక్టర్‌ జూనియర్‌ అడ్వకేట్‌ కాదా?. ఈ పాప రాకేష్‌ చెల్లెలు. ఈమె ఇంజనీర్‌. రాకేష్‌ కూడా పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు చదివాడు. అంటే వారిది చదువుకున్న కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారిని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టి పరువు తీయడం ధర్మమేనా?
ఒకవేళ పోలీసులు చెబుతున్నట్లు వారికి అంత దారుణమైన బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంటే, పోలీసులు చెబుతున్న మాటలు వాస్తవమే అయితే.. మంగళగిరికి చెందిన వారిని, తెనాలికి తీసుకొచ్చి ఎందుకు కొట్టారు? దాని అర్థం ఏమిటి?. అంటే పోలీసులు చెప్పేవన్నీ అబద్దాలే అని కదా? అలాగే వారిపై నమోదైన కేసులు పెద్దవి కాదనే కదా అర్థం?.

ఈ మధ్య కాలంలోనే హరికృష్ణ అనే వ్యక్తి మీద దాచేపల్లిలో తప్పుడు కేసు పెట్టి సీఐ దారుణంగా కొట్టి క్వార్టర్‌లో పడేస్తే వారి తల్లిదండ్రులు , గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి అతడిని కాపాడుకున్నారు. ఈ కేసులో కూడా హరికృష్ణ మీద ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లతో దొంగ సర్టిఫికెట్‌ ఇప్పించుకున్నారు. కానీ ఈ హరికృష్ణ ఇప్పటికీ గాయాలతో బాధపడుతూనే ఉన్నాడు.

రాజమండ్రిలో పులిసాగర్‌ అనే సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌. దళిత యువకుడిని పోలీస్‌ స్టేషన్లో రాత్రంతా అర్థనగ్నంగా నిలబెట్టారు. రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారు. పోలీసులా.. వీరు రాక్షసులా?. అని సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అతడి పరిస్థితి ఇది.
చివరకు మహిళలు అని కూడా చూడకుండా వైయస్సార్సీపీకి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు సుధారాణి, పాలేటి కృష్ణవేణి మీద పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేసి నెలల తరబడి తిప్పుతూ వేధించారు. ఇవన్నీ చూశాక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదా అని ప్రజలంతా ఆలోచన చేయాలి.

రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెందిన రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారు సాక్షాత్తూ కొందరు డీఎస్సీలు, సీఐలు, ఎస్సైలను కలెక్షన్‌ ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. మద్యం విక్రయాలు మొదలు, ఇసుక, మట్టి, పేకాట క్లబ్బుల వరకు ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తున్నారు. పోలీసులు వాటికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు మామూళ్లు వసూలు చేసి.. పోలీసులకింత, ఎమ్మెల్యేకి ఇంత, చంద్రబాబుకి ఇంత, లోకేష్‌కి ఇంత అని పంపకాలు చేస్తున్నారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది. ప్రతి గ్రామంలో బెల్ట్‌ షాపులు కనిపిస్తున్నాయి. ప్రతి మందు షాపు దగ్గర డబ్బులు తీసుకుని అనధికారికంగా పర్మిట్‌ రూములు అనుమతిస్తున్నారు. ఆ ప్రతి పర్మిట్‌ రూమ్, ప్రతి బెల్ట్‌ షాపు నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారు. ఇసుక, పేకాట, మట్టి, సిలికా, క్వార్ట్‌›్జ, ల్యాటరైట్‌.. ఇలా ఏ వనరునూ వదలకుండా అన్ని చోట్లా యథేచ్ఛగా వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది. పోలీసులను దొంగల ముఠాలో భాగస్తులుగా చేసి వారిని వాడుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ అనేది ఉందా? అని ప్రశ్నిస్తున్నా.

వారిని వెనకేసుకు రావడం లేదు

ఆ ముగ్గురు పిల్లలను నేను వెనకేసుకు రావడం లేదు. గొడవలు జరిగి ఉండొచ్చు. కేసులు పడి ఉండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది తప్పు ఏది న్యాయం అనేది నాకు తెలియదు. నేను వాటిని వెనకేసుకు రావడం లేదు. కానీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలుగా మారిపోకూడదని మాత్రం గట్టిగా చెబుతున్నా. మీరు ఆరోపణలు చేసినప్పుడు కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం అనేది చూసి తీర్పులిస్తారు. ఆ తీర్పులు వెలువడే వరకు కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయిలు కారన్నది మాత్రం గట్టిగా చెబుతున్నా.

కానీ, కేసులున్నాయనే కారణంతో వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి, దారుణంగా కొట్టి, వారి కుటుంబాన్ని, వారి పరువు ప్రతిష్టలను మంటగలిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా అడుగుతున్నా.

అందుకే ‘వెన్నుపోటు దినం’:

మరోవైపు లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. వీటి అన్నింటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపు వీళ్లు చేస్తామని మాటిచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ను గాలికొదిలేశారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు.

అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా గళం విప్పమని మరొక్కసారి పిలుపునిస్తున్నా.

ఇంకా ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికీ మంచిది కాదు. ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కలిసి రావాలని కోరుకుంటున్నానని శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.

LEAVE A RESPONSE