– గాజాను విడిచివెళ్లిన 10 లక్షల మంది
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు కేంద్రంగా ఉన్న గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు కేంద్రంగా ఉన్న గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి 30 వేల మందికిపై బలగాలను మోహరించింది. రాజకీయ ఆమోదం వచ్చిన వెంటనే దాడులకు సర్వం సిద్ధం చేసుకున్నది.
ఈ నేపథ్యంలో 10 లక్షలకుపైగా సామాన్య ప్రజలు యుద్ధ క్షేత్రమైన గాజాను విడిచి వెళ్లారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. గ్రౌండ్ ఆపరేషన్‌తో హమాస్ గ్రూపు టాప్ రాజకీయ, సైనిక నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా గాజాను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకొన్నది.
గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో ఇప్పటివరకూ 2329 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 వేల మందికిపైగా గాయపడ్డారు. ఇక ఇజ్రాయెల్ వైపు 1400 మంది మరణించగా, వందలాది మంది అపహరణకు గురయ్యారు.
కాగా, గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు వెల్లడించింది.
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు ఆపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ అందులో హెచ్చరించింది. ఐరాస సమన్వయకర్త టోర్ వెన్నెస్‌ల్యాండ్‌ను ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ లెబనాన్ రాజధాని బీరుట్‌లో కలిసారు. యుద్ధ పరిస్థితిపై చర్చించారు.