-పంట నష్టం ఎకరాకు రూ. 10వేలు అందిస్తాం… వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా ఉంటాం
-పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రతీ నష్టాన్ని సర్వే చేయిస్తాం
-ఇళ్ళు ,ఉద్యానవన పంటలు,పశువులు నష్టాలపై ఈనెల 17వ తేదీ లోగా సర్వే చేసి పరిహారం అందిస్తాం-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
-కొల్లేరు ప్రాంతంలో వరద నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి
ఏలూరు, సెప్టెంబర్, 11 : వరదలలో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో వరదల నష్టాన్ని బుధవారం హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి డిగ్రీ కలసి ఆడిటోరియం లో కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరద పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం బాధితుల కష్టాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన ప్రతీ నష్టాన్ని పారదర్శకతతో, జవాబుదారీతనంతో లెక్కిస్తామన్నారు. మీ కష్టాలను కళ్లారా చూశానని, వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. వరిపంట వేసిన రైతులు 70 రోజులు తర్వాత చేతికి పంట వచ్చే సమయంలో కోల్పోతే ఆరైతు భాద వర్ణనాతీతమన్నారు. వరి పంట నష్టపోయిన రైతాంగానికి 2019 కి ముందు తాము హెక్టారుకు 16 వేల రూపాయలు పరిహారం అందించామని, గత ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచిందన్నారు.
అయితే తాము ఈసారి హెక్టారుకి పంటనష్టం రూ. 17 వేలు నుంచి రూ. 25 పెంచి అందిస్తామని రైతులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వరికి ఎకరాకు రూ. 10 వేలు పంటనష్ట పరిహారం ఇస్తామన్నారు. పంట సాగుచేసే వారిలో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారని, వారికి అండాగా ఉండేలా ఇన్ పుట్ సబ్సిడీని నేరుగా కౌలు రైతుల అక్కౌంట్ లోకి జమచేస్తామన్నారు. వ్యవసాయరంగం, ఉధ్యానరంగంలో వరదల కారణంగా నష్టపోయిన రైతులకు, పశువులు చనిపోయి, ఇళ్లుకూలి నష్టపోయిన ప్రతిఒక్కరికి ఈనెల 17వ తేదీలోపు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామన్నారు.
భవిష్యత్తులో వరదలు, తూఫానులు వంటి వైపరీత్యాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వరదలు మాపింగ్ చేస్తామన్నారు. పై ప్రాంతాలలో వరదలు దిగువ ప్రాంతాలలోకి వచ్చేలోగా ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే దిశగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని నష్టాలను నివారిస్తామన్నారు. కృష్ణానదిలో ఊహించని వరదవచ్చి నిన్నటికి 10 రోజులు అయిందని, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల బుడమేరు ఇంతలా ఉప్పోంగి ప్రజలు కష్టాలపాలు అయ్యారన్నారు. ఎక్కడచూసినా బుడమేరు ఆక్రమణలు, మరోవైపు గత 5 ఏళ్ల వైసిపి పాలనలో డ్రైన్ల మరమ్మత్తులు చేపట్టకుండా, కాల్వలు త్రవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.
బుడమేరు ఆధునీకరణకు గతంలో తాము అనుమతులు ఇస్తే రాజకీయ కారణాలతో వాటిని క్యాన్సిల్ చేసి బుడమేరు మొత్తం ఆక్రమణకు గురిచేసారన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. మరోవైపు 11 లక్షల 90 వేల క్యూసెక్కుల నీరు డిశ్చార్జి కేపాసిటీ ఉండేలా ప్రకాశం బ్యారేజిని 70 ఏళ్ల క్రితం నిర్మించబడిందన్నారు. ఆ తర్వాత కాలంలో బ్యారేజీ ఎగువన ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయని అయినా ఇంత భారీ స్ధాయిలో వరద వచ్చిందంటే అది వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు కారణమన్నారు.
బడుమేరులో 5 రోజులు ఇరిగేషన్ మంత్రి నిమ్మలరామానాయుడు అక్కడే వుండి గండ్లుపూడ్చే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారన్నారు. కాబట్టే వరదను కంట్రోల్ చేయగలిగామన్నారు. అలాగే రాత్రంబవళ్లు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధ ఎంతో కష్టపడ్డారన్నారు. వరద సహాయ చర్యల్లో కష్టపడిన ప్రతిఒక్కరికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. 11 లక్షల 40 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజికి వస్తుంటే 5 టన్నుల బరువుఉండే మూడు బోటులను ఒకదానికొకటి తాడు కట్టి వదిలారని దీనితో బ్యారేజి దెబ్బతినివుంటే లంక గ్రామ ప్రజల పరిస్ధితి ఏమయ్యేదని అన్నారు. తమ హయాంలో రౌడీలు లేకుండా చేశామని రాయలసీమలో ముఠానాయకులు లేకుండా ఛేశామని అదే విధంగా మత విధ్వేషాలు లేకుండా మెరుగైన పాలన అందించామన్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో తనపై బాంబులతో దాడి చేసినా ప్రజల కోసం ప్రాణాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లామన్నారు. గత ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు రాష్ట్ర సంపాదన వడ్డీకి కూడా సరిపోని పరిస్ధితిని తెచ్చారన్నారు. గోదావరి జిల్లాలు ఎప్పుడూ తమకు అండగా ఉన్నాయన్నారు. పోలవరం రాష్ట్రానికి ఒకవరమని ఆయన పేర్కొంటూ పోలవరం పూర్తయి నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి కరువు అనేది ఉండదన్నారు. పోలవరం నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు కేంద్రంతో ఒప్పించి విడుదల చేయించామన్నారు. త్వరలోనే పోలవరం పనులు ప్రారంభిస్తామన్నారు. చింతలపూడి లిఫ్టు పనులు పూర్తిచేసి రెండు జిల్లాలకు నీళ్లు ఇస్తామన్నారు. ఒకప్పుడు హెలీకాఫ్టర్ ద్వారా రెస్క్యూచర్యలు చేయగా ఇప్పుడు డ్రోన్ ద్వారా చేస్తున్నామన్నారు. టెక్నాలజీలో ఎలాంటి మార్పులు వచ్చినా ఆ మార్పులను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లుతున్నామన్నారు.
ఏలూరుకు చంద్రబాబు వరాలు…
తమ్మిలేరు వరద వల్ల ప్రతి సారి ముంపుకు గురై రాక పోకలకు ఇబ్బందిగా ఉన్నా శనివారపు పేట కాజ్ వే వద్ద రూ.15కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. త్వరలో పనులు చేపడతామని చెప్పారు. పెదపాడు లోయర్ డ్రైన్లు రిపేరు చేస్తే ముంపు ప్రమాదం తప్పుతుందని అడిగారని అలాగే అన్ని డ్రైన్లు మరమ్మత్తులు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు..
నేను బురదలో దిగాను కాబట్ట అధికారులు కూడా బురదలో దిగారన్నారు. జెసిబీలు ఎక్కాను, ట్రాక్టర్లు కూడా ఎక్కాను బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించామన్నారు. ప్రజలంతా శభాష్ అనేలాగా ప్రభుత్వ యంత్రాంగం కూడా కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్ధసారధి, డా. నిమ్మల రామానాయుడు, ఏలూరు యంపి పుట్టా మహేష్ కుమార్, శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), డా.కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, కనుమూరి రఘురామ కృష్ణంరాజు, నగర మేయర్ షేక్ నూర్జాహాన్ పెదబాబు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, మాజీ శాసన సభ్యులు గన్ని వీరాంజనేయులు, ఘంటా మురళీరామకృష్ణ, రామరాజు సర్. సిఆర్ రెడ్డి కళాశాల సంస్ధల చైర్మన్ అల్లూరి ఇంధ్రకుమార్,