ఎవ్వరూ భయపడొద్దు…అందరినీ క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది

– స్పెషల్ ఫైట్లలో తరలించేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు
– మీతో సహా ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులందరికీ ఈ సమాచారాన్ని చేరవేయండి
– ఉక్రెయిన్ లో చిక్కుకున్న నల్లగొండ జిల్లా నకిరేకల్ వాసి శరత్ ను తీసుకొస్తామని తల్లిదండ్రులకు బండి సంజయ్ భరోసా

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిరంతరం అదే పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చెందిన శరత్ ను భారత్ కు తీసుకురావాలంటూ అతని తల్లిదండ్రులు ఈరోజు సాయంత్రం బండి సంజయ్ కు ఫోన్ చేసి వేడుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి బండి సంజయ్ శరత్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ‘‘ఉక్రెయిన్ లో ఉన్న వారందరినీ స్వదేశానికి తీసుకొచ్చే పనిలోనే కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవ్వరూ టెన్షన్ పడొద్దు. మీకు అండగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది. ఈ సమాచారాన్ని ఉక్రెయిన్ లో ఉన్న శరత్ సహా తెలుగు వారందరితోపాటు భారతీయులందరికీ చేరవేయండి. వారిలో ధైర్యాన్ని నింపండి.’’అని పేర్కొన్నారు.