Suryaa.co.in

Features

కణ్ణదాసన్ భావాల్ని తొలిసారి తెలుగులోకి తెచ్చింది ఆరుద్రే; ఆత్రేయ కాదు

“కసిని పెంచే మతము
కనులు కప్పే మతము
కాదు‌ మన కభిమతము
ఓ కూనలమ్మ”

ఆరుద్ర రచనగా ఇదే నే తొలిగా చదివింది; బాగా చిన్నప్పుడు.‌

“ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు” ఇవి ఓ‌ సినిమా పాటలో ఆరుద్ర రాసిన వాక్యాలు. నేను వీటిని విన్నప్పటినుంచీ ఇప్పటి వఱకూ నచ్చినవి నచ్చినట్టుగానే ఉన్నాయి.
ఆరుద్ర త్వమేవాஉహమ్ లోని “ఆవాహన” నాకు చాలా ఇష్టం. అందులో “శూన్యం నిద్రలో సూర్యుడు‌ కలలాగా పుట్టాడు” అనీ, “కాల స్వరూపం విరి, కాదు ఆవిరి” అనీ ఆపై ఇంకొన్నీ ఆయన అన్నవి ఆయన్ను నాకు నచ్చేట్టు చేశాయి.‌‌ కవిత్వానికి నన్ను నేను పరిచయం చేసుకుంటున్న తొలినాళ్లవి.

త్వమేవాஉహమ్ లో …
“ఖేయాను ఎడారి‌ లోపల
ఒయాసిస్సు పొయిట్రీ”
ఆపై
“ఒక పదంతో ఇముడవలసిన అర్థం
కొన్ని వాక్యాల‌విస్తీర్ణతను
దురాక్రమణ చేస్తుంది…”
ఆపై
“ఎందులకీ కొలమానమ్ములు
దండుగ మన ఉపమానమ్ములు”
ఆపై
“నువ్వు ఎక్కదలచుకొన్న రైలు
ఎప్పుడూ ఒక జీవితకాల‌ం లేటు”
ఆపై
“అడ్డమైన కొండలని
కోసుకొని ప్రవహించమని
జ్ఞాపకం చెయ్యక్కర్లేదు
సరితకు” –
వంటివి నాకు ఇష్టం.

“ఆరుద్ర చేసిన రచనలన్నిటిలో ముఖ్యంగా కవితా రచనల్లో మకుటాయమానమైనది త్వమేవాஉహమ్” అని దాశరథి అన్నారు‌. “ఆరుద్రది ధ్వని ప్రధానమైన కవిత. త్వమేవాஉహమ్ లో మహాధ్వని ఉంది” అనీ దాశరథి అన్నారు. తనకు నచ్చిన ఇద్దఱు ఆధునిక ఆంధ్ర కవుల్లో ఆరుద్ర ఒకరని దాశరథి చెప్పారు.

అటు తరువాత వారి కూనలమ్మ పదాలు, ఇంటింటి పజ్యాలు, మఱి కొన్నీ చదివాను.

“నీ పిల్లన గ్రోవిలో ఏముందో కృష్ణా
తెలియక వేశాను ఈ ప్రశ్న”
అని ఆరుద్ర అన్నదాన్ని పీ.
బీ. శ్రీనివాస్ ఒక‌‌‌‌ లలిత గేయంలో పాడారు.

వీ.ఎ.కె. రంగారావుగారితో‌ పాటు‌ చిన్నప్పుడు నేను ఆరుద్రగారింటికి వెళ్లే వాణ్ని. ఎంతో పేరున్న వాళ్లనైనా పెద్దగా పరిగణించని రంగారావుగారికి ఆరుద్ర అంటే గౌరవం.
ఆరుద్ర సంస్కారి. మామూలుగా కవులకుండే దుర్లక్షణాలు లేనివారు. ముఖ్యంగా కవులకుండే చవకబాఱు తనం లేదు ఆయనకు. హుందాగా ఉండేవారు‌. తెలుగు కవుల, విమర్శకులలా వికృత స్వభావం ఉన్నవారు కాదు ఆరుద్ర. ఇవాళ్టి తెలుగు కవులకు చదువు, లోక జ్ఞానం బాగా తక్కువ. ఆరుద్రగారికి ఈ దోషం, ఈ శాపం లేవు. ‘కవికి చదువు బహు ముఖ్యం’ అన్న సత్యాన్ని కవి అవుదామనుకుంటున్న వాళ్లు ఆరుద్రగారి నుంచి గ్రహించాలి.

“తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్ది
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మ”

తెలుగులో కవితకు సంబంధించిన వాళ్లకు ఈ ఆరుద్ర మాటలు బాగా పొసుగుతాయి.
ఆయన తన నవల ఒకదానికి పలకల వెండి గ్లాసు అని పేరు పెట్టారు. నాకు బాగా నచ్చింది అలా అనడం.
‘అరబ్బీ మురబ్బాలు’ అని రాశారు ఆరుద్ర. అయినా ఆరుద్ర గజళ్లు అంటూ రాయలేదు. గజళ్లు అంటూ సీ. నారాయణరెడ్డి తెలుగు కవిత్వానికి చేసిన హాని ఆరుద్ర చెయ్యలేదు. ‘గజల్ అన్నది ఏ ప్రచార గేయమో, సూక్తుల సమాహారమో, ఏ చవకబారు రచనో కాదు’ అన్న విజ్ఞత ఆరుద్రగారికి తప్పక ఉండుంటుంది; అదే ఆయన గజల్ అంటూ రాయకపోవడానికి కారణం అయుంటుంది. (సీ.నారాయణరెడ్డికి కూడా ఆ విజ్ఞత ఉండుంటే బావుండేది. గజల్ అన్న విదూషకత్వం తెలుగును దెబ్బకొట్టేది కాదు)
ఒక మనిషి ఒక‌ భాష సాహిత్య చరిత్రను సమగ్రంగా రాయగలగడం నిజమైన అద్భుతం. ఆ అద్భుతమే ఆరుద్ర సమగ్రాంధ్రసాహిత్య చరిత్ర. అందువల్ల ఆరుద్ర కూడా ఒక అద్భుత‌ చరిత్ర.
రాయడం పై అడిగినప్పుడు కొంత చెప్పారు నాకు ఒక‌‌ రోజున. మెత్తగా మాట్లాడతారు ఆయన. ఆయన కారు షెడ్‌ గ్రంథాలయం. ఆ‌ గ్రంథాలయంలో‌ నేను ఆయన ఎదురుగ్గా కూర్చుని ఆయనతో మాట్లాడాను. అప్పుడు ఆయన్ను తెలుసుకోగల వయసు నాకు లేదు.
రమారమి 1,500కు పై చిలుకు సినిమా పాటలు రాశారు. హిందీ ఆహ్ సినిమా తెలుగు రూపం ప్రేమలేఖలు సినిమాలో ట్రాక్ చేంజ్ (డబ్బింగ్ కాదు) పాటలు ఆరుద్ర రాశారు. “రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా…” అంటూ అన్నమయ్య భావన్ను సినిమాలోకి తెచ్చారు‌. తమిళ్ష్ కణ్ణదాసన్ భావాల్ని అరుద్ర కూడా తెలుగులోకి తెచ్చారు. నిజానికి కణ్ణదాసన్ భావాల్ని తొలిసారి తెలుగులోకి తెచ్చింది ఆరుద్రే; ఆత్రేయ కాదు.

“చీకట్లో బయలు దేరాను
వెలుగులోకి వెళ్లాలనుకుంటాను
విరోధం నుంచి విడివడ్డాను
స్నేహంలోకి పోవాలనుకుంటున్నాను
ఒంటరిగా బయల్దేరాను
జంటను వెతుక్కోవాలనుకొంటున్నాను”
(సినీవాలి నుంచి) అని ఆరుద్ర చెప్పిన‌ మాటల్ని మనం ఎన్నిసార్లైనా మళ్లీమళ్లీ చెప్పుకోవచ్చు‌.
ఇలా ఎన్నో చెప్పుకోవచచ్చు ఆరుద్ర గారి గుఱించి. ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు ఆరుద్ర గారి గుఱించి.
ఆరుద్ర గారి స్మరణలో

రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE