-
ఒక్కొక్కరూ జారిపోతున్న వైనంతో వైసీపీలో ఆందోళన
-
సొంత చెల్లి, తల్లి, బావ ఇప్పటికే దూరం
-
నమ్మి ఎంపీ సీట్లిచ్చిన బీద, కృష్ణయ్య, మోపిదేవి రాజీనామా
-
ఆత్మబంధువు విజయసాయిరెడ్డి దూరం
-
వచ్చే వారంలో అయోథ్యరామిరెడ్డి రాజీనామాకు సిద్ధం?
-
ఎంపీలలో ఎంతమంది మిగులుతారో తెలియని ఆందోళన
-
నియోజకవర్గ స్థాయి నేతలూ కూటమిలో చేరుతున్న వైనం
-
అయినా భయపడాల్సిన పని లేదంటున్న జగన్ బృందం
-
పారిశ్రామికవేత్తలు ఏ పార్టీలో ఉన్నా అంతేననని వాదన
-
వెళ్లేవారిలో జననేతలెవరూ లేరన్న విశ్లేషణ
-
అయినా పార్టీకి నైతికంగా దెబ్బేనంటున్న సీనియర్లు
-
జగన్ దగ్గర ఎవరూ ఉండలేరన్న వాదనకు బలమిస్తున్నాయన్న ఆందోళన
-
జగన్ తీరు మార్చుకోకపోతే సీనియర్లూ మిగలరని స్పష్టీకరణ
-
ముందు సీనియర్లను గౌరవించడం నేర్చుకోవాలని సూచన
( మార్తి సుబ్రహ్మణ్యం)
జారుతున్నవురో చేయి జారుతున్నవురో
ఏలికి నా కాలికి నా కంటికి నా ఒంటికి
నీ పంటికి ముని పంటికి
జారుతున్నవురో చేయి జారుతున్నవురో..
ఇది.. జరీ జరీ చీర కట్టి అనే పాటకు, తెలుగు ప్రజలను వెర్రెక్కించిన నటి విష్ణుప్రియ వేసిన డాన్సు. ఈపాటను సోషల్‌మీడియాలో ఇప్పటికీ లక్షలాదిమంది వీక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పాట సందర్భం ఎందుకొచ్చిందంటారా?..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చుట్టూ ఉన్న వారంతా ఒక్కొక్కరూ ఆయన నుంచి జారిపోతున్నారు. ఇప్పటికే సొంత చెల్లి షర్మిల, త ల్లి విజయమ్మ, బావ బ్రదర్ అనిల్ ఆయనకు దూరమయిపోయారు. ఆ క్రమంలో సోషల్‌మీడియా సైనికులు.. ఆ పాట బ్యాక్‌గ్రౌండ్ పెట్టి, జారిపోతున్న నేతలను చూపిస్తూ జగన్‌ను ర్యాగింగ్ చేస్తున్నారు. జగన్ దగ్గర ఎవరూ ఎక్కువ కాలం ఉండలేరన్న నిజం, మరోసారి స్పష్టమవుతోందని బయటకు వెళ్లిన వారిని ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఇటీవలి కాలంలో తమ పార్టీలో పై నుంచి కిందిస్థాయి వరకూ పెరుగుతున్న నిష్ర్కమణ పర్వం, క్షేత్రస్థాయిలో పనిచేసే వైసీపీ క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అధికారంలో ఉన్నంతవరకూ జగన్ చుట్టూ తిరిగి, అన్నీ అనుభవించిన వారే.. సంక్షోభ సమయంలో జగన్‌కు చేయిచ్చి, నిష్ర్కమించటం వారిని వేదనకు గురిచేస్తోంది. చివరకు జగన్‌కు ఆత్మగా ఉండే విజయసాయిరెడ్డి కూడా నిష్ర్కమించడం.. క్షేత్రస్థాయిలో పనిచేసే ద్వితీయ శ్రేణి, నియోజకవర్గ స్థాయి నేతలకు మింగుడుపడటం లేదు.
‘‘ఇది క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. అధికారం లేకపోయినా పోరాడి మళ్లీ సాధించుకోవచ్చు. కానీ అధినేతకు దగ్గరగా ఉన్నవారే సంక్షోభ సమయంలో వెళ్లిపోతే, ఇక క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు ఏం పోరాడతారు? వారికి ఏం భరోసా ఉంటుంది’’ అని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు తమ నియోజకవర్గాలపై చూపుతున్న ఫలితంగా, ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది వెళ్లిపోతారో తెలియని గందరగోళం నెలకొందని, మరో మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో క్యాడర్ చివరకు తమను కూడా మనస్ఫూర్తిగా నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని, కోస్తాకు చెందిన ఓ మాజీ మంత్రి వాపోయారు.
జగన్ తెలంగాణ నుంచి ఏరికోరి తెచ్చుకున్న బీసీ నేత ఆర్.కృష్ణయ్య, తనతోపాటు జైల్లో ఉన్న సహచరుడు మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ పార్టీకి రాజీనామా చేయటం కంటే.. తనతోపాటు అన్ని కేసుల్లో ఏ-2గా ఉండి, తనకోసం ఖైదీగా మారిన తన ఆత్మ.. విజయసాయిరెడ్డి కూడా వెళ్లిపోవడం జగన్ కు నైతిక సంకటంగా మారిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
‘‘సాయిరెడ్డిగారు జగన్‌కు చెప్పే రాజీనామా చేశారంటున్నారు. అసలు జగన్ సూచనలతోనే సాయిరెడ్డి రాజీనామా చేసి, కొద్దిరోజుల తర్వాత బీజేపీలో చేరతారంటున్నారు. జగన్ గారు ఈ విషయంలో గతంలో చంద్రబాబు వ్యూహాన్నే అమలుచేస్తున్నారని మా పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. నిజమేంటో మాకూ తెలియడం లేదు. ఎందుకంటే జగన్‌గారు ఎవరూ చర్చించరు కాబట్టి. తెరవెనుక ఏం జరుగుతున్నప్పటికీ, ఎంపీలందరూ వెళ్లిపోతారన్న సేం తాలు మాత్రం క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకుల ఆత్మస్ఱైర్యం దెబ్బతీసేవే’’నని, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి విశ్లేషించారు.
ప్రజలతో సంబంధం లేని పారిశ్రామికవేత్తలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని పిలిచి పెద్దపీట వేస్తే, ఫలితం ఇలాగే ఉంటుందని మరికొందరు సీనియర్లు దెప్పిపొడుస్తున్నారు. వారంతా కేంద్రంలో తమ వ్యాపార పనులు- రక్షణకు రాజకీయాల్లోకి వస్తారే తప్ప, పార్టీలపై ప్రేమతో రారని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోతే ఏ రాజ్యసభ సభ్యుడూ పార్టీలో ఉండరని, ప్రధానంగా వ్యాపారాలున్న వారెవరూ మిగలరంటున్నారు. ఇదే కోవలో రేపు అయోధ్యరామిరెడ్డి వెళ్లినా పెద్ద ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే వ్యాపారాలతో సంబంధం లేని మోపిదేవి, కృష్ణయ్య లాంటి వాళ్లు కూడా వెళ్లిపోవడమే వింతగా ఉందంటున్నారు.
ఇప్పటికయినా తమ అధినేత జగన్ తన పద్ధతి మార్చుకుని, ప్రజాస్వామ్యయుతంగా పార్టీని నడిపితేనే, మనుగడ ఉంటుందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ‘‘జగన్ ఎవరినీ గౌరవించరని, సొంత నిర్ణయాలు అమలుచేస్తారన్న పేరు ఇంకా చెరిగిపోలేదు. సీనియర్లు గౌరవం ఆశిస్తారన్న మూలసూత్రాన్ని ఆయన ఇంకా గుర్తించడం లేదు. చాలామంది సీనియర్లు ఆ అవమానంతోనే ఎన్నికల ముందు వెళ్లిపోయారు. కూటమిపై వ్యతిరేకతతో, తనను చూసి అధికారంలోకి వస్తానన్న భ్రమల్లో ఉన్నట్లు ఆయన మాటలు అర్ధమవుతున్నాయ’’ని సీనియర్లు చెబుతున్నారు.
ఇప్పటికీ.. ఇంకా అంతేనా?
‘‘ జనంలో ప్రభుత్వంపై ఇంకా అసంతృప్తి మొదలుకాలేదు. కానీ కూటమిలో విపరీతమైన అసంతృప్తి ఉంది. ప్రధానంగా టీడీపీ వారికి తమపార్టీలో కొత్తగా చోటుచేసుకుంటున్న పద్ధతులు, పరిణామాలు నచ్చడం లేదు. సీనియర్లు చాలా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ల సొంత సామజికవర్గమే అసంతృప్తితో రగిలిపోతోంది. టీడీపీ సోషల్‌మీడియా సైతం, ప్రభుత్వం తీరుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో పవన్ ఇమేజీ విపరీతంగా పెరుగుతోంది. ఆయన క్లీన్ ఇమేజీ ఉన్న లీడర్‌గా మారుతున్నారు. పైగా తొలిసారి కాపులలో ఆయనకు ఆమోదం లభిస్తోంది. టీడీపీ క్యాడర్ కూడా పవన్ పనితీరును మెచ్చుకుంటున్నారు. ఆయన హెచ్చరికల తర్వాతనే కొద్దిగా పరిస్థితిలో మార్పు వస్తోందని సంతోషిస్తున్నారు. ఈ పరిస్థితిని మాకు అనుకూలంగా సద్వినియోగం చేసుకోవలసిన సమయంలో, మా పార్టీ ఎంపీల రాజీనామాల సంఖ్య పెరగడం మాకూ ఇబ్బందికరంగానే ఉంది. జగన్‌గారు మమ్మల్ని పిలిచి అడిగితే ఏదైనా సలహా ఇస్తాం. పిలవనిది మేమెందుకు వెళతాం? ఆయనకు ఆ నలుగురే ముఖ్యమైనప్పుడు, మేము మాత్రం ఎందుకు పూసుకుంటాం’’ అని, కేంద్ర రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న ఓ మాజీ మంత్రి సుదీర్ఘంగా విశ్లేషించారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పెద్ద ఆందోళన చెందాల్సిన పనిలేదని, జగన్ బృందం ధీమాతో చెబుతోంది. ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎంపీలెవరూ ప్రజలతో ఉండేవారు కాదని, వారంతా వెళ్లిపోయినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని వాదిస్తున్నారు. విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని ఓ కీలకనేత గుర్తు చేశారు. నిజంగా జనంలో బలం ఉన్న నేత అయితే సొంత జిల్లాలో గెలవాలి కదా? అని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు అధికారంలో లేకపోతే ఎక్కడా ఉండరన్న విషయం జగన్‌కు తెలుసని, అందుకే వారి సేవలకు ఎంతవరకూ వాడుకోవాలో.. అధికారంలో ఉన్నప్పుడే వాడుకున్నారని జగన్‌కు అత్యంత సన్నిహితుడయిన ఓ నేత, తాజాగా జరిగిన అంతర్గత భేటీలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
‘‘ ఈ పరిణామాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది వెళ్లిపోతారనీ తెలుసు. ఇవన్నీ ముందుగానే ఊహించిందే. అందుకే వారిని వారించే ప్రయత్నం చేయడం లేదు. వెళ్లేవారిని ఆపడం ఎందుకున్నది జగన్ గారి పాలిసీ. పైగా వారంతా ఎందుకు వె ళుతున్నారో ఆయనకు-వారికి మాత్రమే తెలిసిన రహస్యం. మేం జనంలో ఉన్నాం. జగన్ గారు ఇకపై నిరంతరం జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మనకు జనం ముఖ్యం. పార్టీలు మారే నాయకులు కాదు. మనకు 40 శాతం ఓటింగ్ ఉంది. దాన్ని ఈ నాలుగేళ్లలో మమరో పదిశాతానికి పెంచుకునేదానిపై యాక్షన్‌ప్లాన్ అవసరం. పిజెఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? అయినా వైఎస్ సారథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? రాజకీయాల్లో సంక్షోభాలు సహజం. మనకు అది కొత్తేమీ కాదు. అవన్నీ ఎదుర్కొనే ఇక్కడిదాకా వచ్చినందున భయపడాల్సిన పనిలేదు. రాజ్యాంగపరంగా ఉన్న రక్షణ, చట్టాలను వినియోగించుకుంటే చాలు. నాలుగేళ్లు చూస్తుండగనే గడచిపోయాయని జగన్ గారు కూడా చెబుతుంటారు. కాకపోతే నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, క్యాడర్‌ను మరో నాలుగేళ్లు జాగ్రత్తగా కాపాడుకుంటే చాలని’’ ఆ నేత విశ్లేషించినట్లు సమాచారం.