– కండువాతో రాని ఎమ్మెల్యే చంద్రశేఖర్
– కండువా ఏదని ప్రశ్నించిన జగన్
– మర్చిపోయారనని శేఖర్ వివరణ
– మర్చిపోయావా? మార్చేందుకు సిద్దమవుతున్నావా? అంటూ జగన్ అసహనం
– చంద్రశేఖర్ పార్టీ వీడతారన్న ప్రచారమే జగన్ అసహనానికి కారణమా?
అమరావతి: రాజకీయాల్లో అహంకారం ఎంతటి వినాశనానికైనా దారి తీస్తుందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఒకప్పుడు జగన్ వెన్నంటే నడిచిన తాటిపర్తి చంద్రశేఖర్, కండువా మర్చిపోవడం వల్ల అవమానభారంతో పార్టీని వీడే పరిస్థితి వచ్చింది.
సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలందరూ పార్టీ కండువాలు ధరించి ఉన్నారు. కానీ, తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రం కండువా లేకుండా వచ్చారు. దీన్ని గమనించిన జగన్ అందరి ముందూ చంద్రశేఖర్‌ను నిలదీశారు. “అందరూ కండువా వేసుకుని వస్తే, మీరెందుకు వేసుకోలేదు?” అని ప్రశ్నించారు.
చంద్రశేఖర్ తడబడుతూ, “కండువా మర్చిపోయాను” అని బదులిచ్చారు. కానీ, జగన్ శాంతించలేదు. “కండువా మర్చిపోయావా? మార్చడానికి సిద్ధంగా ఉన్నావా?” అని గద్దించారు. జగన్ మాటలకు చంద్రశేఖర్ తీవ్ర అవమానానికి గురయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక, అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. ఈ సంఘటనతో చంద్రశేఖర్ మనసు చివుక్కుమంది.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ తీరును కొందరు సమర్థిస్తే, మరికొందరు విమర్శించారు. ఒక చిన్న పొరపాటుకు ఇంతలా అవమానించడం సరికాదని, చంద్రశేఖర్‌ను బుజ్జగించి ఉండాల్సిందని అంటున్నారు.