-క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమచేసిన సీఎం వైఎస్ జగన్
-ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, లబ్ధిదారులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే
బొత్స సత్యనారాయణ, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి
సార్ మీరు పాదయాత్రలో ప్రజల కష్టాలు, విన్నపాలు చూసి, అధికారంలోకి రాగానే ఇలా చేస్తే బావుంటుందని ఆలోచించి ఈ కార్యక్రమం రూపొందించారు. మీ ఆదేశాల మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులను అందరినీ గుర్తించి, చక్రవడ్డీలు, వడ్డీలు కట్టలేకుండా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి, ఆయా కుటుంబాలలో ఆనందాన్ని ఇచ్చే ఈ నిర్ణయం అందరికీ సంతోషకరం. ఇప్పటివరకూ 14 లక్షల మందికి పైగా లబ్ధిపొందారు, ఈ రోజు ఐదు లక్షలమందికి పైగా లబ్ధిపొందుతున్నారు. పది వేల రూపాయల రుణంతో పాటు వడ్డీ బకాయిలు లేకుండా కూడా ఇస్తున్నాం కాబట్టి బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి. ఏ ఒక్కరూ కూడా ఎన్‌పీఏలుగా ఉండకూడదని ఈ ప్రయత్నం చేస్తున్నాం. సెర్ప్, మెప్మా అధికారులు కూడా వారికి అవగాహన కల్పించి వాయిదాలు సకాలంలో చెల్లించేలా చేస్తున్నారు. చిరు వ్యాపారులు హాయిగా తమ వ్యాపారాన్ని నడుపుకుంటున్న పరిస్ధితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. దీనిని ఇతర రాష్ట్రాలు కూడా స్పూర్తిగా తీసుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని మోడల్‌గా తీసుకుని పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వం గ్రామాలు, పట్టణాలు రెండు చోట్లా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజలకు మంచి చేయాలన్న తపనతోనే ఈ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మనం ఇప్పుడిస్తున్న సాయంతో చిరు వ్యాపారులు మరింతగా తమ వ్యాపారాన్ని వృద్ది చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని చిరు వ్యాపారులు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సయ్యద్ రుబియా బేగం, లబ్ధిదారు, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా
జగనన్నా నమస్తే, మా వారు ఫ్యాక్టరీలో కూలీ పని చేస్తుంటారు, నేను ఇంటి దగ్గర చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాను. ఆ వ్యాపారానికి అప్పు చేస్తే రూ. ఐదు, రూ. పది వడ్డీ చెల్లించేవాళ్ళం. ఏ రోజుకారోజు వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోగా, ఏమి మిగిలేది కాదు. ఈ సమయంలో కరోనా వచ్చి అసలు అంత వడ్డీకి డబ్బిచ్చే వారు కూడా లేరు. నేను పెట్టుబడికి డబ్బులేక వ్యాపారం ఆపేశాను, అప్పుడు వలంటీర్ వచ్చి జగనన్న తోడు గురించి చెప్పారు. నేను ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేసుకుంటూ రోజుకు రూ. 200 సంపాదిస్తున్నాను, నెలకు రూ. ఆరు వేలు సంపాదిస్తున్నాను. ఇప్పుడు వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు, నేను సంపాదించుకోగలుగుతున్నాను అనే ధైర్యం వచ్చింది. నేను బయట వడ్డీలకు తెచ్చుకోవడం మానేశాను, మీకు చాలా చాలా కృతజ్ఙతలు, నాకు ఆసరా సాయం కూడా అందింది, సున్నా వడ్డీ కూడా వచ్చింది. గతంలో మాకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు లేవు కానీ ఇప్పుడు అన్నీ ఇచ్చారు. వలంటీర్లు అన్నీ తెచ్చి ఇచ్చారు, నాకు జగనన్న ఇళ్ళ పట్టా కూడా వచ్చింది, సొంతింటి కల నెరవేరుతుంది, మేం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా అమ్మ, నాన్నకు కూడా ప్రభుత్వ సాయం అందింది. మా నాన్నకు ఆరోగ్యశ్రీలో రూపాయి ఖర్చు లేకుండా మంచి చికిత్స పొంది ఇంటికి వచ్చారు. మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రతీ ఒక్కరూ ఏదో విధంగా లబ్ధిపొందుతున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన వల్ల చాలా మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. మా కాళ్ళ మీద మేం నిలబడగలమనే ధైర్యాన్ని మీరు కల్పించారు. ధన్యవాదాలు అన్నా.
కే.కళ్యాణి, లబ్ధిదారు, రేఖవానిపాలెం, భీమిలి మండలం, విశాఖపట్టణం జిల్లా
అన్నా నేను ఈ పథకం ద్వారా లబ్ధిపొందాను. మీరు ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ కూడా కట్టారు. నా భర్త తాపీ మేస్త్రి, పనులు లేక కుటుంబం గడవడం కష్టంగా ఉండేది, నేను ఏదైనా పనిచేసి నా కుటుంబాన్ని పోషించాలనుకుంటే బయటికి వెళ్ళి పనిచేయలేని పరిస్ధితి, నాకు ఇద్దరు చిన్నపిల్లలు వారిని చూసేవారు లేరు, ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే పెట్టుబడి పెట్టే స్ధోమత లేదు. అలాంటి సమయంలో ఫైనాన్సియర్ దగ్గర రూ. 10 వేలు తీసుకుంటే రూ. 1000 తగ్గించి తొమ్మిది వేలు ఇస్తానన్నాడు. అదీ కూడా రోజూ వంద చెల్లించాలంటే భయపడి ఆ ఫైనాన్స్ తీసుకోలేదు. ఆ టైంలో వలంటీర్ వచ్చి ఈ పథకం గురించి చెప్పారు, నేను ఈ డబ్బుతో బ్యూటీ పార్లర్ ప్రారంభించాను, దీనికి బ్యాంకు మరింత సాయం చేసింది, ఆ డబ్బుతో నెలకు రూ. 5 వేల నుంచి పదివేలు సంపాదిస్తున్నాను. మీరు మాకు ష్యూరిటీ లేకుండా డబ్బిచ్చారు. మాకు ఈ సాయం చాలా ఎక్కువ, మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆసరా సాయం పొందాను, మా కుటుంబం వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందింది. మాలాంటి చిన్న చిన్న వ్యాపారులను గుర్తించి మీరు సాయం చేస్తున్నారు. ఈ పథకానికి జగనన్న తోడు అని పేరు ఎవరు పెట్టారో కానీ మాకు మాత్రం తోడుగా ఉంది. మీరు ఎప్పుడూ మాకు తోడుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ సార్.
శారద, లబ్ధిదారు, రుద్రంపేట, అనంతపురం జిల్లా
జగనన్నా మేం పండ్ల వ్యాపారం చేస్తాం, మేం బయట వడ్డీలకు డబ్బు తెచ్చి వ్యాపారం చేస్తే లాభం తక్కువగా ఉండేది. రోజుకు రూ. 200, 300 మాత్రమే మిగిలేవి. నా కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. ఈ సమయంలో జగనన్న తోడు రావడం నాకు చాలా తోడుగా నిలిచింది. చిరు వ్యాపారులకు చాలా సాయంగా నిలిచింది. అంతేకాదు బ్యాంకు ద్వారా ఎలాంటి ష్యూరిటీ లేకుండా సాయం చేస్తున్నారు. మీ ఆలోచనకు పాదాభివందనం. మేం తోపుడు బండ్ల మీదే పండ్లు అమ్ముకుంటున్నాం. ఈ సాయంతో ఇప్పుడు ఒక రోజుకు రూ. 700 నుంచి 800 సంపాదిస్తున్నాం. నేను డిగ్రీ చదివి సొంతంగా పండ్ల వ్యాపారం చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. పదిమందిలో గౌరవంగా బతకాలని పట్టుదలతో వ్యాపారం చేసుకుంటున్నాం. మేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మాకు సున్నా వడ్డీ అందింది, మా కుటుంబంలో చాలా పథకాలు అందాయి. గతంలో మా మామకు పెన్షన్ కోసం తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు వలంటీర్ తలుపుతట్టి ఇస్తున్నారు. నాకు గతంలో రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ లేవు కానీ ఇప్పుడు ఉన్నాయి. నేను అనారోగ్యంతో బాధపడి ఆరోగ్యశ్రీలో చికిత్స పొందాను, నాకు మీరు ప్రాణభిక్ష పెట్టారు. ప్రతీ ఇంటికి మీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మీరు మంచి పాలన చేస్తున్నారు, మీ పాలన ఇలాగే కొనసాగాలి, ధన్యవాదాలు అన్నా.