Suryaa.co.in

Editorial

జగనన్నా.. సాక్షిలో నాన్న యాడ్ ఏదన్నా?

– సాక్షిలో కనిపించని వైఎస్ జయంతి ప్రకటన
– ఆంధ్రజ్యోతిలో షర్మిల ఫుల్‌పేజీ ప్రకటన
– ఖర్చు లేకున్నా సాక్షిలో కనిపించని వైఎస్ జయంతి ప్రకటన
– చెల్లికున్న ప్రేమ అన్నకేదీ?
– సొంత పత్రికలో కూడా తండ్రికి స్థానం లేదా?
– మర్చిపోయారా? లేక డబ్బులు రావని వదిలేశారా?
– నేతలు డబ్బులిస్తేనే వైఎస్ ప్రకటన వేస్తారా?
– జగన్ మర్చిపోయారు సరే.. భారతమ్మకు గుర్తు లేదా?
– మరీ ఇంత బిజినెస్‌మెన్ అయితే ఎలా?
– సాక్షిలో కనిపించని వైఎస్ జయంతి ప్రకటన
– సాక్షి తీరుపై వైసీపీ నేతల మండిపాటు
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ మంచి బిజినెస్‌మెన్.. అతను రాజకీయాల్లోకి రాకపోతే పెద్ద పారిశ్రామికవేత్త అయ్యేవాడు..అంబానీ-అదానీలను మించిన వ్యాపారతెలివితేటలు ఆయనవి.

భారతమ్మ ఇంకా మంచి వ్యాపారవేత్త. ఖర్చు-పొదుపు-ఆదా విషయంలో ఆమెను మించిన మహిళా వ్యాపారవేత్తలెవరూ ఉండరు..

మోకాలి నొప్పితో బాధపడుతున్న విజయమ్మకు కొంచెం పెద్ద కారు కొనాలని షర్మిల అప్పట్లో అన్నకు అడిగారు. చూద్దాంలే అన్నారు. తర్వాత మళ్లీ గుర్తు చేస్తే.. దాని ఖరీదు ఎంత అడిగారట. అందుకు చెల్లి కోటి అవుతుందని చెప్పారట. అయితే నువ్వు 50 ఇవ్వు. నేను 50 లక్షలు ఇస్తానని జగనన్నయ్య చె ల్లెమ్మకు చెప్పారట.

– ఇది ఇప్పటికీ వైసీపీ సీనియర్ల నోటి నుంచి తరచూ వినిపించే మాట. అంటే జగన్-భారతీరెడ్డి ఏ స్ధాయి వ్యాపారవేత్తలో దీన్నిబట్టి అర్ధమవుతుంది. మార్వాడీలను మించిన వ్యాపారలక్షణాలు వంటబట్టించుకున్న ఆ ఫ్యామిలీపైనే ఇప్పుడు చర్చ. దానిని నిజం చే స్తూ.. సొంత పత్రికలో తండ్రి వైఎస్ జయంతి ప్రకటన కనిపించకపోవడం కార్యకర్తలను విస్మయపరిచింది.

అయితే అదే సమయంలో వైఎస్ బిడ్డ షర్మిల మాత్రం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జగన్‌ను బద్ధశత్రువైన ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో, తండ్రి జయంతి ప్రకటన ఇవ్వడం నివ్వెరపరిచింది. సో.. దీన్నిబట్టి తండ్రిపై ఎవరికి ఎంత ప్రేమ ఉందన్నది అర్ధమవుతుందన్న వ్యాఖ్యలు వైసీపీ-కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

వైఎస్ జయంతి వేడుకలు అటు తల్లి కాంగ్రెస్-ఇటు పిల్ల కాంగ్రెస్ పోటాపోటీగా నిర్వహించాయి. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి హాజరైన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అటు విజయవాడలో షర్మిల ఆధ్వర్యంలో కూడా, వైఎస్ జయంతి కార్యక్రమం ఆర్భాటంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్‌ను కూడా ఆహ్వానించారు. ఉదయం ఇడుపులపాయలో అన్న జగన్-చెల్లి షర్మిల, వేరువేరుగా తండ్రికి నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ ఇటీవలి ఎన్నికల్లో ఓడిన కొడుకు-కూతురుకు ఓదార్పు యాత్ర నిర్వహించారు. అంతవరకూ బాగానే ఉంది.

ఉదయం లక్షలాది మంది వైఎస్ అభిమానులు, ఆయన సహచరులు-అనుచరులు జగన్ మానసపుత్రిక సాక్షి పత్రిక కోసం, ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూశారు. తీరా చేతికొచ్చిన సాక్షిని చూసి వారంతా హతాశులయ్యారట. కారణం మొదటి పేజీలో పెద్దాయన జయంతి ప్రకటన లేకపోవడమే. పోనీ రెండో పేజీలో ఏమైనా ఉందా అని వెతికారు.. లేదు. మూడు, ఐదు,ఆరు.. పది.. నో చాన్స్. భూతద్దం వేసి వెతికినా పెద్దాయన జయంతి యాడ్ కనిపిస్తే ఒట్టు. లోపల పేజీలో పులిపాటి దుర్గారెడ్డి అనే పిచ్చి అభిమాని, డబ్బులిచ్చి వేయించుకున్న రాజన్న జయంతి ప్రకటన తప్ప.. సాక్షి యాజమాన్యం సొంతంగా ఇచ్చిన ప్రకటనే లేదంటే ఆశ్చర్యపడక తప్పదు.

సీన్ కట్ చేస్తే..జగన్ సోదరి షర్మిల, ఏపీసీసీ చీఫ్ హోదాలో జగనంటే పడని ఆంధ్రజ్యోతిలో నిలువెత్తు ప్రకటన ఇవ్వటం వైసీపీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. కనీసం కూతురైనా వైఎస్ జయంతి గుర్తు పెట్టుకుని, లక్షలు ఖర్చు పెట్టి ప్రకటన ఇచ్చిందన్న సంతోషం వారిలో కనిపించిందట. దానితో వైఎస్ వారసురాలు షర్మిలనే అన్న వ్యాఖ్యలు వినిపించాయి.

అసలు వైసీపీ గెజిట్ సాక్షిలో పెద్దాయన జయంతి ప్రకటన ఎలా మిస్సయింది? మిస్ అయిందా? మిస్ చేశారా? లేక మర్చిపోయారా? అదీకాకపోతే ప్రకటన ఇవ్వకపోతే కొంపలమీ మునగవులే అని వదిలేశారా? అన్నది వైసీపీ సీనియర్ల డౌటనుమానం. లాభనష్టాలు ఆలోచించే బిజినెస్‌మెన్ ఫ్యామిలీ కాబట్టి.. ఫస్ట్ పేజీ యాడ్ ఇస్తే లక్షల నష్టం అని వదిలేశారా? అన్న మరో అనుమానం.

ఇటీవలే ‘చంద్రబాబూ పెన్షన్లపై ఇన్ని అబద్ధాలా’? అంటూ ఈనెల 2న మొదటిపేజీలో నిలువెత్తు ప్రకటన జారీ చేసిన వైసీపీ అధినేత… తన తండ్రి జయంతి ప్రకటన మాత్రం మర్చిపోవడం పొరపాటా?గ్రహపాటా? అన్నది ఇప్పుడు వైకాపాలో జరుగుతున్న చర్చ.

LEAVE A RESPONSE