సాధారణం గా మనుషులు రెండు రకాలు. అనుకూల శత్రువులు, వ్యతిరేక మిత్రులు అని.
రైతులు, మహిళలు, పిల్లా…. పాప, చిన్నా…. పెద్దా, బీదా… బిక్కీ,వారూ వీరూ అనే తేడాలు ఏమీ లేకుండా ; రాజాధాని పరిధి లో గల 29 గ్రామాలలోని మొత్తం ప్రజలతో పాటు ; నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడి కి ” వ్యతిరేక మిత్రుడు ” ఎవరైనా ఉన్నారా అంటే……జగన్మోహనరెడ్డి ఒక్కరే అనడం లో సందేహం లేదు.
మన సినిమాల్లో హీరోకు తోడుగా ఓ కమెడియన్ ఉన్నట్టుగా, జగన్మోహనరెడ్డి కి తోడుగా ఉన్న “నాయకుడు కాని నాయకుడు” సజ్జల రామకృష్ణరెడ్డి మధ్యమధ్యలో తెరమీదకు వచ్చి, నాలుగు నీతి వాక్యాలతో జనానికి కితకితలు పెడుతూ వినోదానికి లోటు లేకుండా చూస్తుంటారు.
రాజధాని పరిధిలోకి వచ్చే 29 గ్రామాల ప్రజలు… 29 విభిన్న రకాల మనస్తత్వాలతో ఉండడం సహజం. అందులోనూ రాజకీయం గా, సామాజికం గా, ఆర్ధికంగా చైతన్యవంతమైన ప్రాంతం లోని గ్రామాలకు చెందిన పౌరులు కావడం వల్ల కూడా…. ఏ రెండు మూడు గ్రామాల వారి అభిప్రాయాలూ, ఆలోచనలూ ఒకే రీతిన ఉండక పోవచ్చు కదా! 2014 ఎన్నికల్లో రాజధాని ప్రాంతం లో పలువురు మినీ జగన్లు గెలవడమే ఇందుకు నిదర్శనం.
కానీ, అది జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం పై కూర్చోవడానికి ముందునాటి పరిస్థితి.
ఆయన వస్తూనే…. ‘ ‘అమరావతి ‘ అనే భావన పైనే పుట్టెడు ద్వేషం తో కడప నుంచి విజయవాడ వచ్చారు. దానిని అక్కడ లేకుండా చేయడమే తన జీవన పరమావధిగా భావిస్తూ 2019 లో గద్దెనెక్కారా అన్నట్టుగా తొలిరోజు నుంచే సకల విధ్వంసానికి శ్రీకారం చుట్టారు.
ప్రజా వేదిక కూల్చివేతతో జగన్మోహన్ రెడ్డి తన విధ్వంసకాండ ప్రారంభించారు.
చంద్రబాబు పై కోపం. తీవ్ర అసహనం.పగ. కసి. చంద్రబాబు నాయకత్వం పై నమ్మకం తో భూములిచ్చిన రైతులపై అంతులేని ఆగ్రహం, అసహనం….,అసహ్యం. ‘అమరావతి’ ని డిస్ క్రెడిట్ చేయడం కోసం,దానిని ఒక కులానికి అంటగట్టారు.
‘అమరావతి ‘ అనే భావననే స్మశానం గా మార్చేపనిని బొత్స సత్యనారాయణ అనే ఆసామికి అప్పజెప్పారు. అమరావతి లో సమస్త నిర్మాణ పనులు ఉన్నవి ఉన్నట్టుగా ఆపేశారు. వేసిన రోడ్లను తవ్వేశారు. ఇనుము, సిమెంట్ ఇతర నిర్మాణ మెటీరియల్ ను పట్టపగలే ‘ దొంగలు ‘ ఎత్తుకు పోయారు.
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు ఆపేశారు. విద్యుత్ స్థంభాలు ‘ఎవరో ‘ లేపేశారు. పిచ్చి మొక్కలు…. ఎరువులేసి పెంచినట్టుగా పెరిగిపోయాయి.
రాజధాని గ్రామాల రైతులకు…. జరుగుతున్న సినిమా ముందుగా అర్ధం కాలేదు.
ఏదో నాలుగు రోజులు నిరసనలు చేస్తే సరిపోతుందిలే, అమరావతి పనులు తిరిగి మొదలవ్వడానికి అనుకుంటూ, విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. వారి శిబిరాలను దర్శించిన గుంటూరు ఎం పీ గల్లా జయదేవ్, ” మీరు ఈ దీక్షలు చేసేది నాలుగు రోజులు కాదు. నాలుగు సంవత్సరాలు… ” అని వారితో చెప్పారు.
రాజధాని రైతుల దీక్షలతో, జగన్ పెంపుడు జంతువులు శరభ… శరభః అంటూ రంగం లోకి దిగేశాయి.
నిరసన కారుల శిబిరాలు పీకి పందిళ్లేశాయి. దొరికినవాళ్లను దొరికినట్టు… పోలీసులు…. తమకు రొప్పు వచ్చేదాకా చితక బాది వదిలారు.అమరావతి ప్రాంతం అంతా ఖాకీ వనం లా మారిపోయింది.ఆడవాళ్ళా… మగవాళ్ళా అనే తేడా లేకుండా పోలీసులు తమ ‘హస్త భూషణాలు’ విరిగి పోయే దాకా విరుచుకు పడ్డారు.
నిరసనలు వ్యక్తం చేసేవారిలో దళితులు ఉంటే…. మిగిలిన వారితో పాటు ; వారిపై కూడా ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ కింద కేసులు పెట్టేశారు( దళితులపై ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టగూడదు అనేది ఇంగిత జ్ఞానం, చట్టం స్ఫూర్తి కూడా )
అక్కడితో ఆగకుండా, ఈ నిరసనలు చేసేవారంతా “పెయిడ్ ఆర్టిస్ట్ లు ” అంటూ రాజధాని రైతుల , మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడానికి “అమరావతి వ్యతిరేక ” శక్తులు చేయగలిగినదంతా చేశాయి.
కౌంటర్ శిబిరాలు ఏర్పాటు చేసి, అమరావతి రైతులను హేళన చేయడం, వారిపై దాడులు చేయడం వంటివాటిని పెద్దఎత్తున చేపట్టారు.
ఈ ” చేష్టలు ” గతం లో ఎప్పుడూ చూడనివి కావడం తో రాజధాని రైతులు, మహిళలు బిత్తర పోయారు.
ధర్నాలు, నిరసనలు, నిరాహారదీక్షల వంటి వాటికి గతం లో ఇళ్లల్లోంచి ఎప్పుడూ అడుగుబెట్టని మహిళలు సైతం కొంగులు బిగించి రోడ్లు ఎక్కారు. “అమరావతి ” భావనకు కొత్త చైతన్యం తోడయ్యింది.
29 గ్రామాలలోని సర్వ కుల, మత, రాజకీయ భావనల, ధనిక, పేద తారతమ్యాలు పక్కన బెట్టి…. అందరూ ఒక తాటి పైకి వచ్చారు. జగనేయులతో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ విధం గా వారంతా ఒక తాటి మీదకు వచ్చి, ఒకే గొంతుకతో నినదించడానికి “జగనన్న ” కారణ”భూత” మయ్యారు. ఈ మాత్రం సాయం గతం లో వారికి ఎవరు చేశారు?
వారు సంఘటితం అయ్యేకొద్దీ పోలీసు కాఠిన్యం…. అదే నిష్పత్తి లో పెరిగింది. పోలీస్ కాఠిన్యం పెరుగుతున్న కొద్దీ….రాజధాని రైతుల సంకల్ప బలం కూడా పెరుగుతూ వచ్చింది.
ఒక పక్క “పెయిడ్ ఆర్టిస్ట్ ” లతో “ఫేక్ దీక్ష ” లు నిర్వహింప జేస్తూనే, రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమ కారులను ” పెయిడ్ ఆర్టిస్ట్ “లంటూ కడప బ్యాచ్ ప్రచారం మొదలు పెట్టింది. తాము చేసే బృహత్కార్యాలను… ఎదుటిపక్షం వారు చేస్తున్నట్టు దుమ్మెత్తి పోయడం ఫ్యాక్షన్ రాజకీయం లో ఓ భాగం.
” వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు నాయుడు కు వెన్నతో పెట్టిన విద్య అంటూ వైసీపేయులు రోజూ పాట పాడుతుండేవారు కదా! అలా అన్న మాట.
అమరావతి ప్రాంతం లో ఇంతటి ఏకీభావం, ఐక్యత, అమరావతిని కాపాడుకోవాలనే పట్టుదల ప్రోది చేసుకోవడానికి…. జగనే కదా కారణం. రాష్ట్ర వ్యాప్తం గా నియోజకవర్గాలవారీగా…. పుట్టల్లోంచి పాములు బయటకు వచ్చి బుసలు కొట్టినట్టు జగనిష్టులు హటాత్తుగా తెర మీదికి రావడం తో జనం భీతిల్లి పోయారు. తెలుగుదేశం కూటమికి 164 సీట్లు రావడానికి – అనే కంటే ; జగనయ్య కు 11 సీట్లే రావడానికి ఈ భయమే కారణం.
తెలుగుదేశం (కూటమి ) ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటికీ, రైతుల ఐకమత్యం చెక్కుచెదరకుండా…. వారిని కంటికి రెప్ప లా కాపాడుకుంటున్నది మాత్రం జగన్ బృందమే అని చెప్పాలి.
” చంద్రబాబు ను గెలిపించడమే కరెక్ట్ ” అన్న జనం సెంటిమెంట్ ను ఎప్పటికప్పుడు మరింత బలపరిచే విధం గా జగన్ బృందం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది .
1.రాజధాని మహిళలను దారుణం గా కించపరిచే రీతిలో…. వారి ప్రచార సాధనం లో వ్యాఖ్యనాలు చేయించింది.
దాంతో, రాజధాని ప్రాంత రైతులు, మహిళలు కళ్లెర్ర జేశారు. సంఘటితమయ్యారు. రోడ్ల మీదకు వచ్చారు.
వారు మరింత సంఘటితం కావడానికి సజ్జల రామకృష్ణా రెడ్డి, తన సంకర వ్యాఖ్యలతో తన వంతు సాయం తాను చేశారు.
మహిళలు అగ్రహోదగ్రులు అయ్యారు. కాళ్లకింద పడి ఉండవలసిన చెప్పులు చేతుల్లోకి వచ్చాయి.
2.తెనాలి లో పేరు మోసిన రౌడీ షీటర్ల ఇళ్లకు జగన్ వెళ్లి, వారి కుటుంబాలను పరామర్శించడం తో వైసీపీయేతర ప్రజలు విస్తు పోయారు.
3. జగన్ పొదిలి వెళ్లిన సందర్భం లో అరాచకం చోటుచేసుకుంది. ఇటువంటి వారినా మనం 2019 లో గెలిపించింది అనే భావన అక్కడి జనం లో వ్యక్తమైంది.
4. జూన్ 18 న సత్తెనపల్లి నియోజకవర్గం లో జగనేయులు చేసిన అరాచకం, ప్రదర్శించిన ప్లకార్డులు, వేసిన వీరంగ వేషాలు రాష్ట్రం అంతా చూసింది, పత్రికల్లో చదివింది.
జగనేయుల ఈ తరహా ప్రవర్తనలతో; 2024 లో తాము ఇచ్చిన ఎన్నికల తీర్పు కరెక్టే అని జనం భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం మరింతగా బలపడడానికి జగన్ చేస్తున్న ఈ ” వ్యతిరేక మిత్ర ” సాయం…. ఆయనకు గతం లో ఎవరూ చేసి ఉండరు.
ప్రజలపై వైసీపీ ప్రదర్శిస్తున్న ఈ ద్వేషమే…. తెలుగుదేశం కూటమికి శ్రీరామ రక్ష అని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉదాహరణకు…., జగన్ బృందం రాజకీయాలలో చురుకుగా ఉన్నంత కాలం, అవాకులూ చవాకులూ పేలినంత కాలం…. మహిళలపై అకృత్యాలకు పాల్పడినంత కాలం…., రాళ్లు చెప్పులూ విసిరినంత కాలం…. వాళ్ళ బట్టలూడదీస్తాం, వీళ్ళ బట్టలూడదీస్తాం అంటూ రంకెలు వేస్తున్నంత కాలం…. అమ్మోరి జాతరలో వేటపోతులను నరికినట్టు నరికి పోగులు పెడతాం అంటూ ఊరెగినంత కాలం….తెలుగు దేశం ప్రభుత్వానికి ఇబ్బంది లేదని- రాష్ట్రం లో తాను అభిమానించిండానికి ఏ రాజకీయ పార్టీ లేక, తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ని సమర్ధించే ‘ ఫేస్ బుక్ ‘ విశ్లేషకుడు చాగంటి సతీష్ అన్నారు.
బహుశా అందుకే, అకృత్యాలకు, ఎల్లలు లేని దోపిడీకి, భూ కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడినవారిపై చర్యలకు దిగడం కంటే, పీ 4 ( పీ ఫోర్ ) ఏ ఐ ( అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ – ), క్వాంటం వ్యాలీ, అమరావతి లో అంతర్జాతీయ విమానాశ్రయం మొదలైన వాటిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి ఉంటారని చాగంటి సతీష్ అన్నారు.
తెలుగు దేశం పార్టీకి మద్దతు ఇవ్వక మరో దారి ఆయనకు లేనట్టుగా, రాష్ట్రం లోని మెజారిటీ ప్రజలకు కూడా ఉండకుండా చేయాలనే లక్ష్యం తో పనిచేస్తున్న జగన్ బృందానికి హ్యాట్సాఫ్.
