– పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల ఫలితం
– ఎస్పీ నరసింహ కిశోర్‌ను కలిసి వినతిపత్రం అందించిన జనసేన నాయకులు
– వైసీపీ హయాంలో పవన్, ఆయన కుటుంబీకులపై పోసాని దూషణలు
– అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదన్న జనసేన నేతలు
– న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వెల్లడి
రాజమహేంద్రవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ నేత, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌పీ నరసింహ కిశోర్‌ను కలిసిన జనసేన నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని పలుమార్లు జనసేనానితో పాటు పార్టీ కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా దూషించారని, కానీ అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. దాంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని ఈ సందర్భంగా జనసేన నేతలు వివరించారు.
అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న విశాఖ వాసి రవికిరణ్‌పై చర్యల కోసం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత చిన్నబాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఈ నెల ఏడోతేదీన రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.