అమరావతి: కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. వక్ఫ్ చట్టాన్ని ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకున్న బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలను ఆదేశించారు.
ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోంది. ఈ మేరకు లోక్ సభలోని జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని జనసేన పార్లమెంట్ సభ్యులకు తెలిపారు.
‘వక్ఫ్ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును 31 మంది సభ్యులతో జైంట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించారు. సంబంధిత వర్గాలతో విద్యావంతులతో, పాలన రంగ నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారు. బ్రిటిష్ కాలంనాటి వక్ఫ్ చట్టాన్ని నేటి కాలానికి తగిన విధంగా క్రమబద్ధీకరించడం ద్వారా విస్తృత ఫలితాలు దక్కుతాయి. ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు ఇవ్వాలి’ అని పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు.