టీడీపీకి టూల్‌గా జనసేన

– టీడీపీ హయాంలో ఆత్మహత్యలపై ఎందుకు స్పందించలేదు?
– పవన్‌ కళ్యాన్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి
– బాబు పాలనలో ఆత్మహత్యలనూ రికార్డు చేయని దుస్థితి
– వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక రూ.7 లక్షల పరిహారం
– ఆత్మహత్య నిర్ధారణ, సాయానికి ప్రత్యేకంగా నిధులు
– రైతులకు అడుగడుగునా అండగా ఉంటోంది మేమే

అనంతపురం, ఏప్రిల్‌ 12 : తెలుగుదేశం పార్టీకి టూల్‌గా జనసేన పార్టీ పని చేస్తోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే పవన్‌ కళ్యాణ్‌ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారని విమర్శించారు. మంగళవారం అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం, రాజీవ్‌ కాలనీ పంచాయతీల్లోని వాలంటీర్లకు శిల్పారామంలో పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ యాత్రపై ఎమ్మెల్యే అనంత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు ఎంతో మంది వలసలు వెళ్లారన్నారు. అనేక మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం నమోదు చేసిన పాపాన పోలేదన్నారు. అప్పుడు టీడీపీతోనే కలిసి ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రైతు ఆత్మహత్యలపై ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాన అడుగడుగునా రైతులకు తోడుగా ఉంటున్నామన్నారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులను చెయ్యిపట్టి నడిపిస్తున్న ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. జిల్లాలో రైతులు, చేనేతలను ఆదుకున్నామని తెలిపారు. రైతు భరోసా కింద ఏటా రూ.13,500లను పెట్టుబడి సాయంగా అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ.7 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

రైతులు ఆత్మహత్యల నిర్ధారణకు, తక్షణ సాయం అందజేయడానికి ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేశామన్నారు. కేవలం రాజకీయ స్వలాభం కోసమే పవన్‌ కళ్యాణ్‌ జిల్లా పర్యటకు వచ్చారని తెలిపారు. గడిచిన మూడేళ్లలో వలసలను పూర్తిగా నివారించామన్నారు. పంటలు సాగు చేసిన రైతులు ఆ పంటను నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని చెప్పారు.

ప్రతిపక్ష పార్టీ కుట్రలో పవన్‌ కళ్యాణ్‌ ఓ భాగమని అన్నారు. బాబు హయాంలో రైతులు, వారి సమస్యలు, ఆత్మహత్యలు పవన్‌ కళ్యాణ్‌కు ఎందుకు గుర్తుకు రాలేదని, ఆయన ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.