– సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
– క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం అందించాలి
– మృతి చెందిన దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇవ్వాల్సిందే
– రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క
సింగరేణి బొగ్గు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన సుజాత నగర్ కు చెందిన నలుగురు దళిత కుటుంబాలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం అన్ని విధాలుగా గా ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మృతిచెందిన బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు కుటుంబానికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై సింగరేణి బొగ్గు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మృత్యువాత పడిన సుజాతనగర్ ఎస్సీ కాలనీ కి నలుగురు మహిళా దళిత కుటుంబాలతో పాటు క్షతగాత్రులను సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మల్లు గారు శనివారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మరియు యు కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు భట్టి విక్రమార్క ఆర్థిక సహాయం అందజేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. సుజాతనగర్ ఎస్సీ కాలనికి చెందిన 17 మంది కూలీలము టాటా ఏసీ వాహనంలో వరి నాట్లు వేసేందుకు సత్తుపల్లి వెళుతుండగా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన సింగరేణి బొగ్గు టిప్పర్(లారి ) అతి వేగంగా వచ్చి తమ వాహనాన్ని ఢీ కొట్టడంతో కత్తి స్వాతి(26), ఎక్కిరాల సుజాత(40) లు అక్కడికక్కడే మృతి చెందారని, ఆస్పత్రికి తరలిస్తుండగా గుర్రం లక్ష్మి(52), కత్తి సాయమ్మ (45)లు చనిపోయారని, మిగత వారు తీవ్ర గాయాలపాలైనట్టు క్షతగాత్రులు బోరున విలపిస్తూ ప్రమాద సంఘటన గురించి వివరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెక్కాడితేగాని డొక్కాడని నలుగురు దళిత పేద మహిళల ఉసురు తీసిందని, దీనికి వీరే బాధ్యత వహించాలన్నారు. పొట్టకూటి కోసం వరి నాట్లు వేయడానికి వెళ్తున్నా కూలీల వాహనాన్ని సింగరేణి బొగ్గు టిప్పర్ లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా ఓవర్ లోడ్ తో వచ్చి ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్న దాన్ని బట్టి అర్థం అవుతుందన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఉత్పాదకత, లాభాలపై దృష్టి పెట్టి రక్షణను గాలికొదిలేసిందని విమర్శించారు.
సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వచ్చే టిప్పర్ లోడ్ లారీల వేగం 40 కిలోమీటర్ల ఉండగా అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ లోపం కారణంగా ఇష్టారాజ్యంగా టిప్పర్లు నడుస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూడడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతివేగం, ఓవర్ లోడ్
కారణంగా తరచూ ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడిన, వందల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలపాలై క్షతగాత్రులుగా మారిన సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
శుక్రవారం జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబాల్లో కుటుంబానికి ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రమాదంలో చనిపోయింది దళితులు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ, నాగ సీతరాములు, సున్నం నాగ మనీ తదితరులు పాల్గొన్నారు.