– కేసీఆర్ ను విచారణకు పిలవడం రాష్ట్రానికే తలవంపు
– అసలు కాంగ్రెస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత తెలుసా?
– కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మహా జలశక్తి పీఠం
– చంద్రబాబు కూడా కాళేశ్వరం అద్భుతమని మెచ్చుకుండు
– ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టుపై కక్ష గట్టిండు
– ఇక ప్రజలు రేవంత్ రెడ్డిని తరిమికొట్టుడే
– బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్: తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలిచిన ఈ రోజు జూన్11వ తేదీ తెలంగాణకు బ్లాక్ డేగా మిగిలిపోతుందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ జాతిపిత, మహాఉద్యమ నేత కేసీఆర్ ను విచారణకు పిలవడం జీర్ణించుకోలేక పోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ప్రశ్నించడాన్ని చీకటి దినంగా భావిస్తున్నారని ఆయన బుధవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. రెండు ఫిల్లర్ల కు పగుళ్ళు వస్తే ఏదో కొంపలు మునిగినట్లు మహానేతను విచారణకు పిలవడం తెలంగాణ కే తలవంపు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
అసలు కాంగ్రెస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత తెలుసా? అని ఆయన నిలదీశారు. “కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మహా జలశక్తి పీఠం. ఇది తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటం .దేశానికే అన్నం పెట్టే అక్షయ పాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందుతోంది కోట్లాది మందికి తాగు నీరందిస్తోంది. కనీవిని ఎరుగనిరీతిలో పంటలు పండుతున్నాయి.
కాళేశ్వరం అంటే రెండు ఫిల్లర్ల పగుళ్ళు కాదు.కాళేశ్వరం అంటే 3 బరాజ్ లు,15 రిజర్వాయర్లు, 19 సబ్-స్టేషన్లు,21 పంపు హౌసులు,504 కిలో మీటర్ల పొడవు టన్నెల్,1545 కిలోమీటర్ల పొడవునా కాలువల ద్వారా సాగునీటి సరఫరా.141టీఎంసీల సామర్థ్యం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచాన్నే అబ్బురపరిచిందన్నారు.
కేసీఆర్ దక్షతకు శత్రువుల నుంచి కూడా అభినందనలు లభించాయన్నారు.
చివరకు చంద్రబాబు కూడా కాళేశ్వరం అద్భుతమని మెచ్చుకున్నారని, కానీ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టుపై కక్ష గట్టారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం కాలువల ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం విషం పారిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ వరప్రదాయని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతి అంటగట్టి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి తెలంగాణ స్పూర్తి ప్రదాతను అవమానించారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తో పెట్టుకున్నోళ్ళు మట్టికొట్టుకు పోతారని ఆయన చెప్పారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించినా ప్రజలు సహనంగా ఉన్నారని, రేవంత్ రెడ్డి తిట్లు కూడా భరిస్తున్నారని, కానీ కేసీఆర్ని విచారణకు పిలవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భరించలేక పోతున్నారని ఆయన చెప్పారు. ఇక రేవంత్ కథ ముగిసిందని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు రేవంత్ రెడ్డిని తరిమికొట్టడం ఖాయమని జీవన్ రెడ్డి హెచ్చరించారు.