– కడియం నామోషీ ఫీలవుతున్నారు
– నేను కడియం కుమార్తె ఎంపీ పదవి తీసేయాలని అంటున్నానా?
– అభివృద్ధి కార్యక్రమాలకు నాయిని రాజేందర్ రెడ్డి అడ్డు
– భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదు
– మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
వరంగల్: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భద్రకాళి ఆలయం ఎవరి సొంత ఆస్తి కాదు. కానీ కొందరు అది తమదే అన్నట్లుగా భావిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉద్దేశించి విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు నాయిని రాజేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని సురేఖ ఆరోపించారు.
భద్రకాళి అమ్మవారికి ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, అయితే అక్కడ జంతుబలులు ఇస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సురేఖ మండిపడ్డారు. అమ్మవారు శాకాహారి అనే విషయం అందరికీ తెలుసు. ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న అర్చకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకొచ్చి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం అని స్పష్టం చేశారు.
తాను మంత్రిగా ఉండటం చూసి కడియం శ్రీహరి నామోషీగా భావిస్తున్నారని సురేఖ అన్నారు. అందుకే నా మంత్రి పదవి పోతుందని ఆయన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్దకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి నాపై లేనిపోనివి చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాకు అదృష్టం ఉంది కాబట్టి మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యారు. అలాంటప్పుడు నన్ను మంత్రి పదవి నుంచి దిగిపోవాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం? నా కుమార్తెకు అదృష్టం లేక ఎమ్మెల్యే కాలేదు. కడియం కుమార్తెకు అదృష్టం ఉంది కాబట్టి ఎంపీ అయ్యింది. అందుకోసం నేను ఆమె ఎంపీ పదవి తీసేయాలని అంటున్నానా? అని మంత్రి ప్రశ్నించారు.
గోదావరి పుష్కరాల కోసం కేంద్రం రూ. 200 కోట్లు కేటాయించాలని కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలోనే గోదావరి పుష్కరాలు అధికంగా జరుగుతాయి. భద్రాచలంలోని శ్రీరాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుంది, ఇక్కడే పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం అని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపడం తగదని హితవు పలికారు.