Suryaa.co.in

Andhra Pradesh

బడ్జెట్‌ డొల్ల.. రైతులు గుల్ల

– కేంద్రం ఇచ్చేది కాకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు
– ఇప్పుడు దాంతో కలిపి అంటూ, రైతులకు మోసం
– నాడు వైయస్సార్సీపీ వేరుగా ఇచ్చినా చంద్రబాబు విమర్శ
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి.

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కాడి వదిలేసే పరిస్థితి వస్తుందని, చంద్రబాబు విజన్‌కి తగ్గట్టు వ్యవసాయం దండగ అనే రీతిలో ఈ బడ్జెట్‌ కేటాయింపులు ఉన్నాయని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన పదవిని కాపాడుకోవడానికి లోకేష్‌ను పొగిడే స్థాయికి దిగజారిపోయారని ఆయన విమర్శించారు.

అన్నదాత సుఖీభవకు కేటాయింపులు చూస్తే లబ్ధిదారులను తగ్గించే కుట్ర కనిపిస్తోందని చెప్పారు. పంటలకు మద్ధతు ధరలేక ఒక రైతులు అల్లాడిపోతున్నా వారి గురించి పట్టించుకోకుండా ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.300 కోట్లు కేటాయించారని దుయ్యబట్టారు. ఇకపై రైతులు మద్ధతు ధర కోరుకోవడం ఎండమావే అవుతుందని కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏం చేస్తాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో చంద్రగుప్త మౌర్యుడి గురించి ప్రస్తావించారు. తన పదవిని కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను పొగడ్తలతో ముంచెత్తే దుస్థితికి పయ్యావుల దిగజారిపోయారు.

విత్తనం నుంచి అమ్మకం వరకు గత వైయస్సార్సీపీ పాలనలో రైతులకు అండగా నిలబడితే నేడు కూటమి పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పీఎం కిసాన్‌ సాయంతో కలిపి రైతు భరోసా అమలు చేస్తున్నారని వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు, తాము అధికారంలోకి వస్తే, కేంద్రం ఇచ్చేది కాకుండా రూ.20 వేల చొప్పున ఇస్తామని ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయాన్ని కలిపి అన్నదాత సుఖీభవలో రూ.20వేల చొప్పున ఇస్తామని ప్రకటించి, రైతులను మోసం చేస్తున్నారు. ఈ పథకానికి రూ.10,706 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.6300 కోట్లు కేటాయించి మిగతాది కేంద్రం ఇచ్చే దాంట్లో సర్దుబాటు చేస్తామంటున్నారు. ఇంతకన్నా మోసం ఇంకోటి ఉంటుందా?

నిజానికి ఆనాడు రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తామని ప్రకటించినా, పీఎం కిసాన్‌ రూపంలో కేంద్రం రూ.6 వేలు సాయం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రం ఇచ్చే సాయాన్ని రూ.13,500లకు పెంచి నాలుగేళ్లు ఇస్తామన్న పథకాన్ని ఐదో ఏడాదికి కూడా పొడిగించి రైతుల పట్ల ఉన్న ప్రేమను జగన్‌ నిరూపించుకున్నారు.

ధరల స్థిరీకరణ నిధి కింద కేవలం రూ.300 కోట్లు కేటాయించడం చూస్తే, పంటలకు మద్దతు ధర దక్కడం ఎండమావిగానే కనిపిస్తోంది. ఇప్పటికే మద్ధతు ధర దక్కక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. ధరల స్థిరీకరణ నిధి కింద నాడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించింది. ఇప్పుడు అందులో పదో వంతు మాత్రమే ప్రతిపాదించారు. దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేసి విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేల ఊసే బడ్జెట్‌లో కనిపించలేదు.

గత వైయస్సార్సీపీ పాలనలో పాడి రైతులకు మేలు చేసిన అమూల్‌ సంస్థ పేరే ఎత్తకపోవడం చూస్తుంటే హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యం స్ఫష్టంగా కనపడింది. బడ్జెట్‌ డొల్ల.. రైతులు గుల్ల.. అనేలా ఈ వ్యవసాయ బడ్జెట్‌ ఉంది. ప్రచారం మోత, పథకాలకు కోత, ప్రజలకు వాత, ఇది మన తలరాత అని బాధపడాల్సిన బడ్జెట్‌ ఇది. అందుకే ఈ బడ్జెట్‌ను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని కాకాణి గోవర్థన్‌రెడ్డి వివరించారు.

LEAVE A RESPONSE