– ‘పీకే’ మాయ అంతింతకాదయా
( మార్తి సుబ్రహ్మణ్యం)
గత ఎన్నికల ముందు ఏపీలో ప్రకాంత్ కిషోర్ అనే బీహారీ రాజకీయ బేహారీ సృష్టించిన కృత్రిమ భ్రమల మేఘాలు ఒక్కొక్కటే కరిగిపోతున్నాయి. మరో రెండేళ్లలో ఇంకెన్ని తొలగిపోతాయో తెలియదు గానీ, ప్రపంచంలోని కోట్లాది వెంకన్న భక్తులను ఇప్పటికీ తొలుస్తున్న, వెంకన్న పింకు డైమండు అనుమానపు వ్యవహారానికి ఎప్పుడు తెరపడుతుందన్నదే అందరి ఉత్కంఠ. అది కూడా ‘కమ్మదనం’ మాదిరిగా ఎప్పుడు కరిగిపోతుందో చూడాలి మరి!
ముందు ఆంధ్రులకు అత్యంత ఇష్టమైన కులమనే రొచ్చులో కాలుపెడదాం. అది రొచ్చయినా తప్పదు. చర్చించాలి కదా? అందుకు! గత ఎన్నికల ముందు.. వైసీపీ తన ప్రచారంలో కమ్మ కులాన్ని లక్ష్యంగా ఎంచుకుని, మిగిలిన కులాలను వారికి దూరం చేసే వ్యూహాన్ని విజయవంతంగా అమలుచేసింది. ఇంకేముంది? అసలే కులం. అందులో పోలీసుల యవ్వారం! 37 మందిలో దాదాపు 35 మంది కమ్మ డీఎస్పీలకు చంద్రబాబునాయుడు ప్రమోషన్లు- పోస్టింగులిచ్చారంటూ ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని వైసీపీ పబ్లిసిటీ టీమ్ ఇల్లెక్కి పందిరేసింది.
ఆ పోస్టింగులలో మిగిలిన కులాల వారికి అన్యాయం జరిగిందని అటు వైసీపీ కూడా కోరస్ అందుకుంది. నాటి విపక్ష నేత జగన్ అండ్ కో ఆగమేఘాలపై ఢిల్లీకి వెళ్లి ‘జరిగిన’ అన్యాయంపై, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమ్మోరికే అన్ని పోస్టులు కట్టబెట్టారంటూ సాక్షాత్తూ జగన్ మీడియాకు ఆ జాబితా చూపించారు. సహజంగానే వైసీపీ అధికార మీడియా కూడా దానితో అందమైన కథనాలను వండి వార్చేసింది.
అప్పటి నిఘా బాస్ ఏబీ వెంకటేశ్వరరావును ముద్దాయిగా చూపించింది. ఇవన్నీ ఆయనే చేశారంటూ నిందల వర్షం కురిపించింది. దానిని ఆయన కూడా గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. బాబు సర్కారు కూడా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంది. దానితో అది చదివిన పండిత-పామరులంతా, డీఎస్పీ ప్రమోషన్లలో 35 మంది కమ్మోరికి డీఎస్పీ పోస్టింగులు ఇచ్చేశారు కామోసని నమ్మేశారు. కానీ అదంతా కట్టుకథ అని అప్పటి అధికార టీడీపీ చెప్పినా ఎవరూ నమ్మలేదు. పైగా, ఆ స్థాయిలో దానిని తిప్పికొట్టడంలో టీడీపీ ఫెయిలయింది.
సీన్ కట్ చేస్తే..
సరిగ్గా మూడేళ్లకు.. అసెంబ్లీ సాక్షిగా నాడు డీఎస్పీ పోస్టింగులపై విరుచుకుపడిన విపక్షమైన వైసీపీ..
తర్వాత అధికార పార్టీగా అవతరించి, ‘అప్పటి అన్యాయం’పై ఆలస్యంగా పెదవి విప్పింది. అదేమిటంటే… ఎన్నికల ముందు ఇచ్చిన 35 మంది డీఎస్పీ పోస్టింగులలో ఎవరికీ అన్యాయం జరగలేదట. అంతా పారదర్శకంగానే జరిగిందట. డీఎస్పీ ప్రమోషన్లు పొందిన వారిలో 17 మంది ఓసీలు, 12 మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ ఉన్నారట. ఓసీలలో కాపు, రెడ్డి, బ్రాహ్మణ వర్గాలనుంచి ముగ్గురేసి అధికారులకు, ఇద్దరు క్షత్రియ కులానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇచ్చారని చావు కబురు ఇప్పుడు చల్లాగా చెప్పారు. అదీ అసెంబ్లీ సాక్షిగా!
‘ 2019 ఎన్నికల ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలకు పదోన్నతి ఇచ్చారనడంలో వాస్తవం లేదు. అప్పుడు ఎవరికీ నష్టం జరగలేదు. అభ్యంతరాలను డీపీసీ ప్రక్రియలో పరిష్కరించాం. పదోన్నతుల జాబితాను జతచేస్తున్నా’మంటూ హోంమత్రి సుచరిత ప్రకటించారు. పార్టీలు మారినా ప్రభుత్వం అనేది సుస్థిరం. కాబట్టి అప్పట్లో విపక్షంలో ఉన్న సుచరిత ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నా, ‘మా ప్రభుత్వం’ అని చెప్పాల్సిందే. కాబట్టి ఆ ప్రభుత్వంలో డీఎస్పీలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదని ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా చెప్పాల్సివచ్చిందన్నమాట. అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లేకపోతే ఇప్పటికీ కమ్మోరిమీద నిందలు కొనసాగేవే పాపం!
అంటే పాపం.. వైసీపేయులు, ఎన్నికల ముందు కమ్మోరి మీద బట్టకాల్చి నెత్తినేసి, ఆ వేడిలో ఇతర కులాలను రగిలించి, ఓట్లు కాచుకున్నట్లు మెడ మీద తల, బుర్రబుద్ధి ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది. అప్పటి ఈ వ్యవహారంలో వైసీపీ చేసిన ఆరోపణలకు మీడియా కూడా ప్రాధాన్యం ఇచ్చింది కాబట్టి, ఆ పాపంలో మీడియా కూడా భాగస్వామే.
సరే.. డీఎస్పీ ప్రమోషన్లలో క‘మ్మదనం’ లేదని అప్పటి విపక్ష-ఇప్పటి అధికార వైసీపీ తేల్చేసింది. ఇక మిగిలింది తిరుమల స్వామివారి పింక్ డైమండ్ వ్యవహారమే. ఎన్నికల ప్రచారంలో.. స్వామి వారి పింక్ డైమండ్ పోయిందని పీకే టీమ్ కొత్త అస్త్రం ఎత్తుకుంది. స్వామికి సేవలుచేసే రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ ప్రచారాన్ని మరంత రక్తి కట్టించారు. చంద్రబాబు ఇంట్లోనే ఆ పింక్‌డైంమండ్ ఉంది కాబట్టి, తక్షణమే సీబీఐ ఆయన ఇంటికి వెళ్లి తనిఖీ చేయాలని విజయసాయి గళమెత్తారు.
టీడీపీ ఏమో అది అబద్ధం అని ముక్తసరిగా ఖండించే తప్ప, అసలు పింక్ డైమండ్ లేనేలేదన్న దిశగా రుజువులు, ఆధారాలు చూపెట్టలేకపోయింది. అది అసలే స్వామి వారి సెంటిమెంటు వ్యవహారం. పైగా
టీడీపీ మౌనం. అప్పటి టీటీడీ పాలకవర్గం మాత్రం విజయసాయిరెడ్డిపై వంద కోట్ల పరువునష్టం దావాకు సంబంధించి 2 కోట్ల రూపాయలు రుసుమును కూడా కోర్టులో చెల్లించింది. అయినా ఆ ఎదురుదాడి సరిపోకపోవడంతో, సహజంగా పింక్ డైమండ్‌కు కాళ్లొచ్చాయని భక్తులు కూడా నమ్మేశారు.
మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా బెజవాడలో బ్రాహ్మణ సంఘం సమావేశం నిర్వహించి, రమణ దీక్షితులు లేవెత్తిన పింక్‌డైమండ్ మాయం, పోటు తవ్వకాల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
సీన్ కట్‌చేస్తే..
రెండేళ్లర్వాత అసలు స్వామివారికి పింక్ డైమండే లేదని టీటీడీ అధికారులు ధర్మప్రభువుల్లా తీరికూర్చుని తీర్పిచ్చారు. ఆరకంగా కోర్టులో అప్పటి పాలకమండలి వేసిన కేసును వారంతట వారే ఉపసంహరించుకుని, అప్పటి విపక్ష-ఇప్పటి అధికార పార్టీ చేసిన ఆరోపణలు ఉత్తుత్తివేనని
తేల్చిచెప్పారన్నమాట. అంటే.. చివరకు వెంకన్నను కూడా పీకే టీమ్ ఎన్నికల ప్రచార ముడిసరుకుగా మార్చుకున్నట్లు బుద్ధి జీవులకు ఆలస్యంగా అర్ధమయింది. కానీ అప్పటికే టీటీడీకి జరగవలసిన డామేజీ జరిగిపోయింది.
ఆరకంగా ఆ పింక్ డైమండ్ అంశం విజయవంతంగా సమాధి అయిపోయింది. అయినా ఎక్కడో, ఏ మూలనో అది ఇంకా ఉందన్నది భక్తుల నమ్మిక, అనుమానం కూడా. కాబట్టి.. అప్పటి డీస్పీల
యవ్వారంలో ఎలాంటి గోల్‌మాల్ జరగలేదని ధర్మదేవతలా ఇప్పుడు సెలవిచ్చిన హోంమంత్రి మాదిరిగానే.. దేవదాయ శాఖమంత్రి కూడా ముందుకొచ్చి, అసలు పింక్‌డైమండ్ ఉందా, లేదా అని అసెంబ్లీ సాక్షిగా చెబితే పాలకుల పుణ్యం ఊరకపోదు.