ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ మహా కుట్ర

-రైతుల ముసుగులో దాడులు చేయించి రెచ్చగొట్టేలా స్కెచ్
-నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టేందుకు సీఎం ప్లాన్
-ప్రజల కోసం రాళ్ల దాడులను భరించేందుకైనా సిద్ధం
-ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటిస్తాం
-ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతాం
-టీఆర్ఎస్ అరాచకాలు, అవినీతి-నియంత-కుటంబ పాలనను ఎండగడతాం
-గంటసేపు దీక్ష చేయలేని కేసీఆర్ దేశంలో ప్రకంపనలు స్రుష్టిస్తాననడం హాస్యాస్పదం
-రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రైతుల ముసుగులో దాడులు చేయించి యాత్రను భగ్నం చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ఈ మేరకు సీఎం ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా స్కెచ్ వేసినట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులనైనా భరించేందుకు సిద్ధమయ్యామన్నారు.

రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటించాలని కోరారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, మరెన్ని అక్రమ కేసులతో భయపెట్టాలని చూసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించి తీరుతామని, యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వ నియంత-అవినీతి-కుటుంబ పాలనను పూర్తిస్థాయిలో ఎండగడతామని పునరుద్ఘాటించారు.

ఈనెల 14 నుండి జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, తమిళనాడు రాష్ట్ర్ర సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీకి చెందిన పలువురు జాతీయ నాయకులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల పార్టీ తరపున చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈనెల 7 నుండి 20 వరకు ‘సామాజిక న్యాయ పక్షం’ పేరిట చేపట్టే కార్యక్రమాలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతు సదస్సులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వంటి అంశాలపై సమీక్షించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ను సమావేశంలో పాల్గొన్న నేతలకు బండి సంజయ్ పరిచయం చేశారు. అనంతరం బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

వడ్ల కొనుగోలుపై కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఢిల్లీలో వరి దీక్ష పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఎత్తగడను ధీటుగా తిప్పికొట్టడంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. ఢిల్లీలో ఫ్లెక్సీల ఏర్పాటు, ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష పేరిట చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.

కరెంట్, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. కరెంట్ బిల్లులు చేతికొచ్చిన వెంటనే ప్రజలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నరు. ఈ సంగతి తెలిసే కేసీఆర్ ఆయా అంశాలను దారి మళ్లించడంతోపాటు ప్రజల ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించేలా వడ్ల కొనుగోలు పేరుతో డ్రామాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ట్రాప్ లో పడొద్దు.

కరెంట్ ఛార్జీల పెంపు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సిందే. కేసీఆర్ మెడలు వంచి పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించేదాకా ఉద్యమించాలి. అదే సమయంలో వడ్ల కొనుగోలు వ్యవహారంలో రైతులకు ఇబ్బంది కలిగించేలా కేసీఆర్ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలతోపాటు టీఆర్ఎస్ నేతల తప్పిదాలను ప్రజల్లోకి వెళ్లి విస్త్రతంగా ఎండగట్టాలి.

కరెంట్ ఛార్జీలపై ఆందోళనలు చేసే సమయంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు టీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించే ప్రమాదం ఉంది. ఈ విషయంలోనూ టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని పూర్తిగా ఎండగడతాం. ఎందుకంటే వ్యాట్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోలుపై రూ.32ల చొప్పున టీఆర్ఎస్ సర్కార్ ప్రజల నుండి వేల కోట్ల రూపాయలు దోచుకుంటోంది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటం బాధాకరమే అయినప్పటికీ… కేంద్రం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించి ప్రజలకు కొంత మేరకు ఊరట కలిగించింది. చాలా రాష్ట్రాలు కేంద్రం స్పూర్తితో వ్యాట్ ను తగ్గించి ఆయా రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలిగించారు. కానీ కేసీఆర్ మాత్రం వ్యాట్ తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతూనే ఉన్నారు. పెట్రోలు ధర ఎంత పెరిగితే… అంతగా వ్యాట్ పేరుతో రాష్ట్రానికి అంత ఎక్కువగా దండుకుంటున్నారు. ఆ వివరాలన్నీ నాయకులందరికీ పంపుతాం. ప్రజలకు ఈ విషయాలను వివరించి టీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో ఎండగట్టాలి.

ఈనెల 14 నుండి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఆరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పోలింగ్ బూత్ ల వారీగా ఘనంగా నిర్వహించాలి. అనంతరం సాయంత్రం జోగులాంబ గద్వాలలో ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభిస్తాం. యాత్ర ప్రారంభానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలి.

ఇక్కడ మీకో ముఖ్య విషయం చెప్పాలి…. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజా సంగ్రామ యాత్రను చూసి భయం పట్టుకుంది. టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అయిందనే అక్కసుతో యాత్రను అడ్డుకునేందుకు ఏం చేయాలనే అంశంపై ఇటీవల ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశం నిర్వహించినట్లు సమాచారం వచ్చింది.

ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న సమయంలో రైతుల ముసుగులో దాడులు చేయాలని, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఆ సమావేశంలో స్కెచ్ వేసినట్లు తెలిసింది.

ప్రజల కోసం ఎన్ని దాడులనైనా భరిద్దాం… మనమంతా సంయమనంతో ఉందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురుదాడి చేయబోం. ప్రజల కోసం రాళ్ల దాడులను భరించేందుకైనా సిద్ధం కావాలి. సీఎం ఎన్ని కుట్రలు చేసినా.. మరెన్ని దాడులకు తెగబడ్డా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తాం. ప్రజల్లోకి వెళ్లి వారి పక్షాన టీఆర్ఎస్ అరాచకాలు, అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగట్టి తీరుతాం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతాం. అంతిమంగా ఈ యాత్ర ద్వారా టీఆర్ఎస్ ను గద్దె దించి ప్రజలు కోరుకునే ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటుకు అడుగులు ముందుకు వేస్తాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ప్రకంపనలు స్రుష్టిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నడు. రైతుల కోసం గంట సేపు ఢిల్లీలో దీక్ష చేయలేనోడు దేశంలో ప్రకంపనలు స్రుష్టిస్తానని చెప్పడం నవ్వొస్తుంది. అందుకే కేసీఆర్ మాటలను జనం నమ్మడం లేదు. టీఆర్ఎస్ పనైపోయిందని ఆయనకూ తెలిసిపోయింది. అందుకే రోజుకో డ్రామాలు చేస్తున్నడు.

ప్రజా సంగ్రామ యాత్రకు పూర్తి సమయం కేటాయించి అడుగులో అడుగు వేసి తనతోపాటు నడిచేందుకు వేలాది మంది కార్యకర్తలు, యువకులు ముందుకొస్తున్నారని వారందరికీ హ్రుదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా…

Leave a Reply