బెజవాడలో కేసీఆర్-పవన్ ఫ్లెక్సీల హల్‌చల్

– వైసీపీ నేతల ఫిర్యాదుతో తొలగించిన మున్సిపల్ అధికారులు
– వైసీపీ ఫ్లెక్సీలు కూడా తొలగించాలంటూ జనసేన డిమాండ్
– కేసీఆర్-పవన్ ఫ్లెక్సీ తొలగింపుపై జనసైనికుల ఫైర్
– కేసీఆర్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

సినిమా అభిమానుల కేంద్రంగా ఉన్న విజయవాడలో ఫ్లెక్సీ తొలగింపు వ్యవహారం సినిమా-రాజకీయ వర్గాల్లో కొత్త చిచ్చు రేపింది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు.. జగన్ సర్కారు సృష్టిస్తున్న అవరోధాలపై ఇప్పటికే ధర్నాలు నిర్వహించిన జనసైనికులు, పవన్ అభిమానులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ తొలగించడం వివాదం రేపుతోంది.

పవన్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో జగన్ సర్కారు ఆంక్షలు విధించగా, తెలంగాణలో కేసీఆర్ సర్కారు మాత్రం ఐదు షోలను అనుమతించింది. దానితోపాటు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రులు కేసీఆర్, తలసాని హాజరయి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

దీనితో సంబరపడిన పవన్ కల్యాణ్ అభిమానులు, విజయవాడ వారధి వద్ద ‘హాట్సాఫ్ సీఎం సార్’ అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఇది నగరంలో అందరినీ ఆకట్టుకుంది. దానితో ఈ ఫ్లెక్సీల వ్యవహారం
Flexes-praising-CM-KCR అటు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ సమాచారం తెలుసుకున్న నగర వైసీపీ నేతలు రంగంలోకి దిగి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా మున్సిపల్ సిబ్బంది కేసీఆర్-పవన్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం వివాదంగా మారింది.

అధికారుల చర్యలపై జనసైనికులు-పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో చాలారోజుల నుంచి ఉన్న జగన్ ఫ్లెక్సీలను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ‘ఇది సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, సినిమా ప్రీ రిలీజుకు వచ్చిన కేటీఆర్‌నూ అవమానించడమే. కేసీఆర్ మాదిరిగా సినిమా పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వడం చేతగాని జగన్ ప్రభుత్వం.. సినిమాలను ఆదరించిన కేసీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం చేతకానితనం. విజయవాడలో నెలల తరబడి జగన్ ఫ్లెక్సీలను తొలగించే దమ్ము లేని అధికారులు, అభిమానులు కేసీఆర్ పట్ల కృతజ్ఞతతో ఏర్పాటుచేసుకున్న ఫ్లెక్సీలను తొలగించడం అన్యాయం. జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిపినా పవన్ నటించిన భీమ్లానాయక్ ప్రజల హృదయాలకు చేరువయింది. సినిమాలు-రాజకీయాలను వేరుగా చూడలేని జగన్ నుంచి ఇంతకుమించి ఎక్కువ ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. పవన్ సంధించే ప్రశ్నలకు రాజకీయంగా జవాబిచ్చే దమ్ము లేని ప్రభుత్వం, చేతకాక ఇలాంటి వేధింపు చర్యలకు పాల్పడుతుండటం అనాగరిక’మని జనసేన అధికారి పోతిన మహేష్ విరుచుకుపడ్డారు.

Leave a Reply