-అప్పుడు మెడ వంచి రాయించుకున్నారని.. ఇప్పుడు మెడమీద కత్తిపెట్టి సాధించామంటారా?
– అది మీ ఘనత కాదు
– కేసీఆర్‌పై బీజేపీ జాతీయ నేత డికె అరుణ ఫైర్
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏమన్నారంటే…
తెలంగాణ రాష్ట్రం నుండి అదనంగా 6 లక్షల టన్నుల బియ్యం కొనేందుకు సిద్ధమంటూ కేంద్రం ఉత్తరం పంపితే ఆ అంశాన్ని సీఎం కేసీఆర్, ఆయన చెంచాగాళ్లు తమ ఘనతగా చెప్పుకుంటూ ఏదో సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు.
ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకునేందుకే మంత్రుల బృందం ఢిల్లీకి పోయింది. వాస్తవానికి సెప్టెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉత్తరానికి జవాబుగానే కేంద్రం ప్రత్యుత్తరం పంపిందే తప్ప టీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి పోయినందుకు కానేకాదు. ఈ విషయాన్ని మంత్రులు ఇది గుర్తుంచుకోవాలి.
మెడమీద కత్తిపెడితే ఉత్తరం రాసిచ్చినట్లుగా చెప్పుకున్న కేసీఆర్ వంటి బలమైన సీఎం…. ఇప్పుడు మాత్రం నరేంద్ర మోదీ గారి మెడలు వంచి విజయం సాధించినట్లుగా చెప్పుకోవడం సిగ్గు చేటు. ఇలాంటి చెత్త రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కలుషితమైన ప్రచారం కోసం రైతుల బతుకులతో చెలగాటమాడటం కేసీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకే చెల్లుతుంది.
యాసంగి విషయంలోనూ టీఆర్ఎస్ నేతలు ఇదే మాట మాట్లాడుతున్నరు. ధాన్యం కొనబోమని రైతులను బెదిరిస్తున్నరు. యాసంగి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొనదో మేం చూస్తాం. ఎందుకంటే యాసంగిలోనూ రా రైస్ కొనడానికి కేంద్రం సిద్దంగా ఉందని, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతిని గుర్తుంచుకోవాలి.
సెంట్రల్ హాల్ క్యాంటీన్ లో ఫొటోలు దిగి ధర్నా పేరిట డ్రామా చేసిన టీఆర్ఎస్ ఎంపీలు, ఢిల్లీ వెళ్లొచ్చిన మంత్రులు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేఖ రాసిచ్చిందనే అంశంపై సమాధానం చెప్పాలి.ఇకనైనా సీఎం కేసీఆర్ రైస్ మిల్లులతో కుమ్మక్కు రాజకీయాలను మానుకోవాలి. లేనిపక్షంలో రైతులు సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.