Suryaa.co.in

Andhra Pradesh

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి

-లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి?
– కల్తీ నెయ్యి లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు?
– రెండో అభిప్రాయం తీసుకోకుండానే ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారు?
– కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసింది?
– సిట్ సరిగ్గా విచారణ జరపగలదా?
– ఘజియాబాద్, మైసూర్ లలో ఉన్న ల్యాబ్ లలో నెయ్యి శాంపిల్స్ ను ఎందుకు పరీక్ష చేయించలేదు?
– కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బాగుంటుంది
– శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీ: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవుపలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ? అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది.

కల్తీ నెయ్యి లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని నిలదీసింది. ఈ అంశంపై విచారణకు సిట్ నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై, ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని ప్రశ్నించింది.

స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సందేహం వ్యక్తం చేసింది. అలాగే స్వామి వారి ప్రసాదం లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్ రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం అని, రెండో అభిప్రాయం తీసుకోకుండానే ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారని ఆక్షేపించింది. కనీసం దేవుడ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి? అని సూటిగా ప్రశ్నించింది.

ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వినియోగించారన్న వివరాలను టీటీడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జూన్ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారో వివరించారు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీ చేసి, నెయ్యి సరఫరా చేస్తున్న ఏఆర్ ఫుడ్స్ కు చెందిన ట్యాంకర్లను పరీక్షకు పంపారని వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగానే, లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు నిర్ధారణకు వచ్చారని తెలిపారు.

దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ, కేవలం ఒక్క ల్యాబ్ లోనే కాకుండా ఘజియాబాద్, మైసూర్ లలో ఉన్న ల్యాబ్ లలో నెయ్యి శాంపిల్స్ ను ఎందుకు పరీక్ష చేయించలేదు? దర్యాప్తు పూర్తి కాకుండానే కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబరు 3కి వాయిదా వేసింది.

LEAVE A RESPONSE