Suryaa.co.in

Andhra Pradesh

దళితులను కించపరిచేలా మాట్లాడిన కోన రఘుపతిని వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి

– వైసీపీ పాలనలో దళితులపై అడుగడుగున దాడులు, అవమానాలే
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి కోన రఘుపతి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దళితులకు రాజ్యాంగబద్ధంగా కేటాయించిన స్థానంపై కోన రఘుపతి దళితులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం లేదు. అందుకే కోన రఘుపతి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎస్సీ పార్లమెంట్ పై కించపర్చేలా వ్యాఖ్యలు చేశారు.

బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్ననాడే ఆవిర్భవించింది. రాజ్యాంగబద్దంగా డీలిమిటేషన్ ద్వారా ఎస్సీలకు కేటాయించబడిన బాపట్ల స్థానం ఎస్సీలకు కేటాయించడం చారిత్రాత్మక తప్పిదం అని ఎలా అంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నాటి నుండి రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తున్నాడని చెప్పడానికి కోనరఘుపతి వ్యాఖ్యలే నిదర్శనం.

జిల్లాల పునర్విభజన సమయంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అక్కడి ప్రజలు కోరితే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అంబేద్కర్ పేరును కుట్రపూరితంగా వివాదంలోకి నెట్టి అంబేద్కర్ ను అవమానించారు. అధికారపార్టీ దళిత మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిని తగులబెట్టి, కోనసీమలో అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లు వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగాయని మంత్రి విశ్వరూప్ కుమారుడు ఫోన్ కాల్ సంభాషణ ద్వారా తేటతెల్లమైంది. బాపట్ల పార్లమెంట్ పై వ్యాఖ్యలతో దళితులను అవమానపర్చిన కోన రఘుపతిని వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి.

2024లో వైసీపీ నాయకులు దళితుల ఆగ్రాహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నాం. దళితుల ఆరాధ్య దైవాల్లో ఒకరైన భారత మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగజ్జీవం రామ్ జయంతి రోజునే దళితులను కించపర్చడం క్షమించరాని నేరంగా పరిగణిస్తున్నాం. కోన రఘుపతికి ఏమాత్రం దళితులపై గౌరవం ఉంటే తక్షణమే బేషరతుగా దళితులకు క్షమాపణలు చెప్పాలి. ప్రస్తుత బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగామ సురేష్ ఓ దళితుడిగా కోన రఘుపతి వ్యాఖ్యలను ఖండించాలని కోరుతున్నాం. క్షమాపణలు చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి, తన పార్టీ నాయకులు, కోన రఘుపతి దళితుల ఆగ్రహ జ్వాలలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE