– సినిమా షూటింగులకు కొండవీటికోట చాలా అనుకూల ప్రదేశం
– చిత్ర పరిశ్రమ ఏపీకి కూడా రావాలని కోరుతున్నాము
-పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
పల్నాడు: కొండవీటికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. కొండవీటికోట ప్రాంతం సినిమా షూటింగులకు అనువైన ప్రదేశమని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కొండవీటి కోటను చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినట్లు మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు చంద్రబాబు నాయుడు రూ.40 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. దీంతో కోటపైకి రోడ్డు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. రానున్న కాలంలో కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరం అయితే పర్యటకశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.
గ్రామీణ వాతావరణ నేపథ్యంలో కొండవీటికోటపై హీరో శివాజీ నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కు మంత్రి హాజరయ్యారు. పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్ జరగడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కే పరిమితం అయిన సినిమా ఇండస్ట్రీని, ఏపీకి కూడా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.