హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. రష్యాలోని మాస్కో లో Skolkovo.StartUp సంస్థ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొన్ని ప్రసంగించాలంటూ ఆయన ఆహ్వానం అందింది.
‘ఫ్యూచరిస్టిక్’ అనే అంశంపై భవిష్యత్ లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై 30 నిమిషాల పాటు మాట్లాడాలంటూ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించటం విశేషం. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ 5-7 వరకు ‘ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్యూచర్ పోర్టల్ 2030-2050’ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తెలంగాణలో కొత్త ఆవిష్కరణాలను ప్రోత్సహించే విషయంలో మీరు చేసిన కృషి అద్భుతమంటూ ఆహ్వాన పత్రికలో Skolkovo ఫౌండేషన్ నిర్వాహకులు కేటీఆర్ ను అభినందించారు. మీకు ఉన్న అనుభవాన్ని మాతో పంచుకునేందుకు మిమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంచుకున్నామని…మీ రాక మాకు ఎంతో గౌరవమంటూ ఆర్గనైజర్స్ పేర్కొనటం విశేషం.
ఈ కార్యక్రమం ద్వారా 2030-2050 ప్రముఖ శాస్త్రవేత్తలు, భవిష్యత్ శాస్త్రవేత్తలు, కళా రంగానికి చెందిన ప్రముఖులు ఇలా పలు రంగాల వారిని ఒక్క వేదికపై తీసుకొచ్చి రేపటి తరానికి ఒక వేదికను అందించటమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సదస్సులో ఫ్యూచరాలజిస్టులు, ప్రపంచ స్థాయి మేధావులు, శాస్త్రవేత్తలు, టెక్నాలజీ రంగంలో దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. భవిష్యత్ లో మరింత మెరుగ్గా అవకాశాలను సృష్టించటం పై చర్చిస్తారు. ఈ వేదిక టెక్నాలజీ, ఆర్థిక రంగంలో ఉన్నతమైన అవకాశాలను కల్పించటానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
అంతేకాకుండా స్టార్టప్ ప్రాజెక్ట్ లను సిద్ధం చేసిన విద్యార్థులు, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు సరైన అవకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని మాస్కో లోని స్టార్టప్ సంస్థ తెలిపింది.