సంజయ్‌ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలి

Spread the love

– మంత్రి కేటీఆర్‌
యాసంగిలో వరి ధాన్యం కొనే విషయం నిజమైతే రాతపూర్వకంగా కేంద్రం పూర్తి పంట కొంటామని రాసి ఇవ్వాలని, లేకుంటే బండి సంజయ్‌ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాకాలంలో సాగైన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
జిల్లాలో 52వేల మెట్రిక్‌ టన్నులు కొన్నామని, ఇంకా మూడులక్షల టన్నుల పంట కొనాల్సి వస్తుందన్నారు. తడిసిన ధాన్యం కూడా కొను ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 4,743 కొనుగోలు కేంద్రాల ధాన్యం సేకరిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు కూర్చోబుతున్నామన్నారు. కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, ధాన్యం వద్దు అనే వైఖరిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ధర్నాలో కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగట్టబోతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్థానిక బీజేపీ అసత్య ప్రచారాన్ని నమ్మి వరి సాగు చేస్తే రైతులు నష్టపోతారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలను నమ్మాలని, పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని, యాసంగిలో ధాన్యం కొనబోమన్న నిర్ణయంపై పునః సమీక్షించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply