Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులు నష్టపోవడానికి నాయకత్వలోపమే ప్రధానకారణం

-14లక్షలమంది ఉద్యోగులు, వారికుటుంబాలతో సహా రోడ్లపైకి వస్తే ప్రభుత్వం స్తంభించదా?
-ఉద్యోగుల న్యాయపరమైన, నిస్వార్థ పోరాటానికి టీడీపీ మద్ధతూ ఎప్పుడూ ఉంటుంది
• ఉద్యోగులను హింసిస్తే ప్రజలు తనను సమర్థిస్తారన్న భ్రమల్లో ముఖ్యమంత్రి ఉన్నాడు.
• టీడీపీప్రభుత్వంలో ఉద్యోగుల పోరాటాలు చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు.
• ఇప్పుడున్న ఉద్యోగసంఘాలనాయకత్వం చూస్తుంటే, సిగ్గనిపిస్తోంది.
• వయోపరిమితి పెంపుతో ఉద్యోగులతో పాటు, నిరుద్యోగ యువతా నష్టపోయారు.
-టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు

రాష్ట్రంలో ప్రభుత్వఉద్యోగులు, పింఛన్ దారులు 14లక్షలమంది వరకుఉన్నారని, 71 డిమాండ్లపై, రెండేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసుంటూనే ఉన్నారని, ప్రభుత్వఉద్యోగుల చర్చలు, సమావేశాలు ప్రభుత్వప్రధానకార్యదర్శి, ఇతర సలహాదారులస్థాయికే పరిమితమ య్యాయని, ముఖ్యమంత్రిని ఒక్కసారే కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు స్పష్టంచేశారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!

“ ఉద్యోగులను హింసిస్తే ప్రజలు ఆనందిస్తారు..తనను సమర్థిస్తారన్న పిచ్చిభ్రమల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దానిఫలితమే ఇప్పుడు ఉద్యోగులకు జరిగిన వంచన. ప్రతి ఆరుసంవత్సరాలకు ఒకసారివచ్చే పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) కోసం ఉద్యోగులుసాధారణంగా వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు సరికొత్త పీఆర్సీ ప్రకటించారు. పే రివిజన్ కాకుండా పే రివర్స్ కమిషన్ అమలుచేశాడు. ప్రభుత్వనిర్వాకంతో ఉద్యోగులకు జరిగిన అవమానంచూస్తే ఎంతో బాధకలుగుతోంది.

14లక్షలమంది ఉద్యోగులు నష్టపోవడానిక కారణం ఎవరు? వారికి నాయకత్వం వహిస్తున్న వారు చిత్తశుద్ధితో ఆలోచనచేయాలి. నేను32ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యమాలుచేసిన ఎంతోమంది ఉద్యోగసంఘాలనేతల పోరాటాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఉద్యోగులు 71 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచితే, ప్రభుత్వం 72వ డిమాండ్ అమలుచేసింది. వయోపరిమితి 62ఏళ్లకు పెంచడం అనేది ఉద్యోగసంఘనేతలకే లాభిస్తుంది. వచ్చే నెలలో, తరువాత కొందరుఉద్యోగసంఘనేతలు పదవీవిరమణ చేయబోతున్నారు. రిటైరయ్యేవారికి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు…. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసింది. కాబట్టే వయోపరిమితి పెంపు అమలుచేశారు. ఉద్యోగులు దాచుకున్నఈపీఎఫ్ సొమ్ము ఇచ్చేస్థితిలోకూడా ఈప్రభుత్వం లేదంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోండి. ఉద్యోగులు దారుణంగా నష్టపోవడానికి నాయకత్వలోపమే కారణం. ఉద్యోగులకు జరిగిన అవమానం చూస్తుంటే నిజంగా చాలా బాధకలుగుతోంది. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలనాయకత్వం చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. ముఖ్యమంత్రిని కలవలేని దుస్థితిలో సంఘనేతలు ఉన్నారంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి వంటారు ఏహక్కు, ఏ అధికారంతో మాట్లాడారు. ఆయన మాట్లాడతాను అనగానే సిగ్గులేకుండా సంఘాలనేతలు ఎలా వెళ్లారు?

టీడీపీప్రభుత్వంలో మంత్రుల సమావేశంలో ఉన్నా కూడా ఉద్యోగసంఘాల నేతలు రాగానే వారిని లోపలికి పిలిచి చంద్రబాబుగారు మాట్లాడిన సందర్భాలున్నాయి. 2,3గంటలు మా ముందే ఉద్యోగసంఘాల నేతలతో చంద్రబాబుగ చర్చలు జరిపిన సందర్భాలున్నాయి. ఈ ముఖ్యమంత్రి వచ్చాక ఎంతమంది ఉద్యోగసంఘాలనేతలు ఎన్నిసార్లు ఆయనతో చర్చించారో చెప్పమనండి. ఈ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ కమిషన్ నివేదిక సంఘనేతలచేతికి రాకపోవడం కంటే అవమానం ఉంటుందా? జగన్ రావాలి..కావాలని రెండుచేతులతో ఓట్లేశామని బండి శ్రీనివాసరావు నిస్సిగ్గుగా, బహిరంగంగా చెప్పాడు.

ఉద్యోగులు స్వార్థపు ఆలోచనలతో మాకు అన్యాయం చేసినా వారు, 14లక్షలమంది ఉద్యోగులకోసం చేసే న్యాయమైనపోరాటానికి టీడీపీ మద్ధతు ఎప్పుడూ ఉంటుంది. నిస్వార్థంగా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసే ఎలాంటి ఉద్యమానికైనా తమసంఘీభావం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన వంచనపై ఉద్యోగులు ఆలోచించాలి. ఉద్యోగులను హింసిస్తే ప్రజలు ఆనందపడతారన్న భ్రమల్లో జగన్మోహన్ రెడ్డిఉన్నాడు. ఉద్యోగులకు న్యాయంచేయలేని నాయకత్వం ఉంటే ఎంత..లేకపోతే ఎంతా? నాయకత్వం వహిస్తున్నవారంతా రెండు, మూడు, 6నెలల్లో రిటైరయ్యేవారే. సంఘాలనేతల నాయకత్వంతో 14 లక్షలమంది ఉద్యోగులు, వారిజీవితాలు సర్వనాశనం అయ్యాయనే చెప్పాలి. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా నాయకత్వం వహించేవారు ఇలా ప్రవర్తించకూడదు. 14లక్షల మంది ఉద్యోగులు వారికుటుంబాలతో సహారోడ్లపైకి వస్తే ప్రభుత్వం స్తంభించదా?

టీడీపీహయాంలో ఉద్యోగులకు స్వర్ణయుగం. ఆనాడు చంద్రబాబు ఉద్యోగుల కోసం 76 జీవోలు ఇచ్చారు. 43శాతం ఫిట్ మెంట్ సహా, హెచ్ ఆర్ ఏ 30శాతం, డీఏల పెంపు సహా, ఉద్యోగులు అడిగినవి, అడగనివి అన్నీ అమలుచేశాము. ఈముఖ్యమంత్రి ఉద్యోగులతో పాటు నిరుద్యోగులను, యువతనుకూడా వంచించాడు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు… జాబ్ లెస్ క్యాలెండర్ అమలుచేశాడు. మెగా డీఎస్సీ అన్నాడు.. అది అమలుచేయలేదు. ఉన్న ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్లకు పెంచితే, నిరుద్యోగ యువత బాధలు వర్ణనాతీతం. ఉద్యమంతోనే ఉద్యోగులసమస్యలు పరిష్కారమవుతాయి. కరోనాతో ఉద్యోగులు ఎంతోమంది చనిపోయారు. ఆ మరణాలకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ, కారుణ్య నియామకాలు కానీ ఈప్రభుత్వం అమలుచేయలేదు. భారతదేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా ఈ ముఖ్యమంత్రే ఉద్యోగులను ఇంతలా ఇబ్బందిపెడుతున్నాడు. కావాలనే ఆయన వారిని హింసిస్తూ ఆనందిస్తున్నాడు.

కేంద్రప్రభుత్వం,పొరుగు రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తే, ఈముఖ్యమంత్రి మాత్రం ఎందుకు ఇవ్వాలంటాడు? అలాంటి ఆలోచనలను ఏమంటారు? చంద్రబాబునాయుడు గారికి కరోనా రావడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రే కారణం. మాచర్లలో టీడీపీనాయకుడిని కోడినికోసినట్టు , గొంతుకోసి చంపేశారు. ఆ ఘటనను నిరసిస్తూ చంద్రబాబుగారు మాచర్లవెళ్లి ప్రజలతో మమేకమై జరిగిన దారుణాన్ని ఖండించారు. దానిపర్యవసానమే ఆయనకు కరోనా రావడం. ముఖ్యమంత్రికి అవగాహనలేదు కాబట్టే సజ్జల అన్నీతానై వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమంత్రికి తెలియదు.. అవగాహన లేదని సీపీఎస్ రద్దు అంశంలో సజ్జల వెనకేసుకొచ్చినప్పుడే ఎవరి పరిజ్ఞానమెంతో తెలిసిపోయింది.

LEAVE A RESPONSE