– జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
గుంటూరు : లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విశాఖపట్నంలో బీచ్ రోడ్డు లో హర్బర్ పార్క్ లో కేటాయించిన 13.74 ఎకరాలు, విజయవాడ నడిబొడ్డులో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు.
స్థానిక జనచైతన్య వేదిక హాలులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో సర్దార్ పటేల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న 66 వేల 168 చదరపు మీటర్ల స్థలం దాదాపు 16.35 ఎకరాలను లు లు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో 519.41 కోట్లకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో లూలు సంస్థ దాదాపు 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమౌతుందని గుజరాత్ లో లులు హైపర్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సూరత్ లో ఎగుమతులను ప్రోత్సహించే కార్యక్రమాలకు లులు సంస్థ సంసిద్ధతను వ్యక్తం చేసినా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సెంటు భూమిని కూడా కేటాయించ లేదన్నారు.
లులు సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 1000 కోట్ల రూపాయలు విశాఖ, విజయవాడలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడితే 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన భూములను దారాదత్తం చేస్తుందని వివరించారు. గత 16 నెలలుగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని సంవత్సరానికి 9 లక్షల కోట్లకు పైగా లాభాలను గడిస్తున్న గూగుల్ సంస్థలకు 22 వేల కోట్ల రూపాయల విలువ గల రాయితీలను ప్రకటించందని మరోవైపు 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టలేని దీనస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెబుతూ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులకు కట్టపెట్టాలని చూస్తోందన్నారు.