-లోకేశ్ కి ముప్పు ఉంది.. పాదయాత్రకు పటిష్ట బందోబస్తు కల్పించాలి
-నాలుగేళ్లలో మైనార్టీలపై జరిగిన దాడులపై చర్యలు తీసుకోండి
రాష్ట్ర గవర్నర్ కి నివేదించిన టీడీపీ నేతలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. *గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి మాజీ చైర్మన్ ఎం.ఎ షరీఫ్, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు గవర్నర్ ని కలిశారు. ఈ సంధర్బంగా యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు సృష్టిస్తున్న అడ్డంకులు, పోలీసులు వ్యహరిస్తున్న తీరు, రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడుల అంశాల్ని గవర్నర్ కు నివేదించారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ…..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు కుంటుపడ్డాయి, ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు కనీసం మాట్లాడే స్వేచ్చ లేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలపై గత నాలుగేళ్లలో జరిగిన దాడులు గతంలో ఎన్నడూ జరగలేదు. మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు వంటి ఘటనలకు 50 పైకి జరిగాయి. ఇవన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి వీటిపై కమిటీ వేసి విచారణ జరపమని కోరాం.
మరో వైపు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. సభలు జరపకుండా అడ్డుకున్నారు, మైక్ లాక్కున్నారు. పాదయాత్రకు మా కార్యకర్తల్ని రానివ్వకుండా ఎక్కడిక్కడ వారి వాహనాలు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతో వైసీపీ గూండాలు మా పార్టీ కార్యక్రమాల్లో చొరబడి దాడులు చేస్తున్నారు.
లోకేశ్ పై కోడి గుడ్లు విసిరారు. లోకేశ్ కి ప్రాణహాని ఉందని పాదయాత్రకు పటిష్ట భద్రత కల్పించాలని డీజీపీ, గవర్నర్ కి మేం లేఖలు రాసినా స్పందన లేదు. 2016లో జరిగిన ఎన్ కౌంటర్ 22 మంది మావోయిస్టులు చనిపోయిన సంధర్బంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్ పై దాడులు చేస్తామని నాడు మావోయిస్టులు బహిరంగంగా చెప్పారు.
రాయలసీమలో కొంతమంది రౌడీలు ప్రెస్ మీట్ పెట్టీ మరీ లోకేశ్ ని అంతమెందిస్తామంటూ మాట్లాడారు. లోకేశ్ కి ఏం జరిగినా సీఎం జగన్ రెడ్డి బాధ్యత వహించాలి. లోకేశ్ పాదయాత్రకు భద్రత పెంచి పాదయాత్ర సజావుగా జరిగేలా చూడాలని గవర్నర్ ని కోరాం. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
టీడీపీ కార్యక్రమాలు జరిగే చోట వైసీపీ ప్లెక్సీలు కట్టి సైకోలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు
ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం ఉంటే అదే రోజు మరో పార్టీ ప్లెక్సీలు కట్టి కవ్వింపు చర్యలకు పాల్పడటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? మహానాడు జరిగిన రాజమండ్రిలో వైసీపీ ప్లెక్సీలు కట్టారు. చంద్రబాబు, లోకేశ్ లపై అసభ్య పదజాలం వాడుతూ… పాదయాత్రలో ప్లెక్సీలు కట్టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలు ఉన్నచోట జగన్ చేసిన అవినీతిని వివరిస్తూ మేం కూడా ప్లెక్సీలు కడతాం. అప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారో చూస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.
మాజీ మండలి చైర్మన్ ఎం.ఏ షరీఫ్ మాట్లాడుతూ….. మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారి జీవితాలతో చెటగాటమాడుతున్నారు. 2019 నుంచి నేటి వరకు ముస్లింలపై జరిగిన దాడుల్ని గవర్నర్ కి వివరించాం. బాధితులు పోలీసు స్టేషన్ వెళ్తే కనీసం ఫిర్యాదులు తీసుకోవటం లేదు. 4 ఏళ్లలో మైనార్టీలపై భౌతిక దాడులు, మానభంగాలు, హత్యలు, ఆస్తుల విద్వంసం వంటి ఘటనలు అనేకం జరిగాయి.
నంద్యాలలో అబ్దుల్ సలాంపై అక్రమ కేసులు బనాయించి హింసించి కుటుంబం మొత్తం ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారు. పల్నాడు జిల్లాలో అనేక గ్రామాల్లో ముస్లిం, మైనార్టీలను గ్రామాల నుంచి తరిమేశారు. వీటన్నింటిపై గవర్నర్ కి ఫిర్యాదు చేశాం, విచారణ జరిపి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని ఎం.ఎ షరీఫ్ తెలిపారు.