Suryaa.co.in

Telangana

మూసీ నది ప్రక్షాళన గురించి చర్చిద్దాం… సహకరిద్దాం

– ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో నేడు సాయంత్రం నాలుగు గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నలకు నా నమస్కారం…

గత ప్రభుత్వాలు విస్మరించిన మూసీ ప్రక్షాళనను నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరం, మీ అందరూ నడుంబిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నేడు హైదరాబాద్ నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో జరిగే రైతుల సమావేశానికి ప్రతి ఒక్క రైతు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలి.

ఈ మూసీ జీవనది కింద తరతరాలుగా మనం వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. పూర్వం ఎంతో ఘన చరిత్ర కలిగిన మూసీ నది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించుకున్న ఈ నది నీరు సాగు, తాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడేది. హైదరాబాద్, రంగారెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ప్రయోజనం కలిగేది. అంత గొప్ప చరిత్ర కలిగిన మూసీ నది నేడు మానవ తప్పిదాల వలన కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. కలుషితమై పంటలు సరిగా పడడం లేదు, కొనే పరిస్థితి లేదని, పండిన పంటలను తినే పరిస్థితి లేదని అన్నారు.

ఈరోజు ప్రభుత్వం ఎస్టీపీలతో మురికి నీరును శుద్ధి చేసి గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందని అన్నారు. మూసీ నదిని శుద్ధిచేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే, నేడు ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు రైతులను ప్రజలను తప్పుతో పట్టించి మూసీ ప్రక్షాళన అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలని కోరారు.

ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ గుర్తుకొచ్చేది, ప్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న జనాలు కళ్ళముందు కనపడేది, అట్లాంటి ఫ్లోరైడ్ సమస్యని నివారించుకోగలిగాం. నేడు మానవ తప్పిదాల వల్ల కాలుష్యం అయిన మూసీ నదిని శుద్ధి చేసుకోలేమా? నేడు జరిగే సమావేశానికి హాజరై ప్రభుత్వానికి మద్దతు పలకాలని రైతులను కోరారు.

LEAVE A RESPONSE