– పట్టణ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో సిండికేట్ చర్చలు
– ఎక్సైజ్ అధికారులనూ భాగస్వామ్యం చేస్తున్న అధికార పార్టీ నేతలు
– మద్యం సిండికేట్ లో రాజమండ్రి టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబాబు
– సిండికేట్ వ్యవహారానికి సూత్రధారి రాజమండ్రి ఎమ్మెల్యే వాసు
– రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్
రాజమండ్రి: ఎమ్మెల్యే వాసు ఆధ్వర్యంలో లిక్కర్ సిండికేట్ బరితెగించి అక్రమాలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లు పెంపుదల, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్లు గురించి చర్చిస్తున్న టీడీపీ రాజమండ్రి పట్టణ అధ్యక్షుడితో పాటు అతని వెనుకున్న ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని భరత్ డిమాండ్ చేశారు.
రాజమండ్రి ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమండ్రి లోనూ, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్ లో 39 మద్యం షాపులకు సంబంధించి సిండికేట్ మీటింగ్ కు సిద్దం అయ్యారు. దీనికి సంబంధించి రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా.. అధికార పార్టీ నేతలు సిగ్గులేని తనం బయటపడింది.
మద్యం రేట్లు పెంచుకోవడం, బెల్టు షాపులు ఏర్పాటు, సిండికేట్ వ్యాపారం ఎలా చేయాలన్న విషయాలతో పాటు ఈ దందాలో ఎక్సైజ్ అధికారులను కూడా ఎలా భాగస్వామ్యం చేయాలని చర్చించుకున్న ఆడియో బయటపడింది. దీనికి సంబంధించి రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదనలు సైతం సిద్దం చేసుకుంటున్నారు.
ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 37 ఏ, 39 బై 1, 2 సెక్షన్లు ప్రకారం వీరిని నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబుతో పాటు అతని వెనుక కచ్చితంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆతనిని కూడా అరెస్టు చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నాడు. దీనికి బీ ఎన్ ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎక్సైజ్ అధికారులు ఎవరిమీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. డ్రా లో కేసు వచ్చిన షాపు కేసుకి సంబంధించి కట్టాల్సిన ఫైన్ మాత్రం సిండికేట్ అందరూ భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండు సార్లు ఒకే షాపు మీద కేసులు వస్తే… ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతులవారీగా ఏ మద్యం షాపు మీద కేసు నమోదు చేయాలన్నది కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా అధికారులను సైతం ప్రభావితం చేయడం వీరికి సాధ్యమా?
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు తప్పు చేశాడని ఏ విధంగా అయితే పార్టీ నుంచి బహిష్కరించారో.. అదే విధంగా మీ భాగస్వామి చంద్రబాబు పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ అధ్యక్షుడిని కూడా బహిష్కరించాలి. రాజమండ్రి ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి.