అసమర్ధుడు ఆదర్శాలు వల్లే వేస్తే,కార్యసాధకుడు పటిష్ట వ్యూహంతో ముందుకు వెళతారు. విద్యా వికాసమే లక్ష్యంగా విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్. జగన్ రెడ్డి జమానా లో అన్ని విధాలుగా భ్రష్టు పట్టిన ఉన్నత విద్యను పూర్తి స్థాయిలో ప్రక్షాళించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష. భావితరాలకు భవిష్యత్ కల్పిస్తూ.. వీలైనంత వేగంగా ఉన్నత విద్యా వ్యవస్థను తీర్చి దిద్ది, విద్యా వికాసానికి బాటలు వేసి ఉన్నత విద్య మళ్ళీ వెలుగులీనే విధంగా చర్యలు చేపట్ట బోతున్నారు లోకేష్.
అబ్బురంగా చెప్పడం కాదు. నిబ్బరమైన నిజం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావడానికి శ్రీకారం చుట్టారు. స్టాన్ ఫోర్డ్ లో చదువుకున్న లోకేశ్ కు విద్యావ్యవస్థలో ప్రమాణాలు పెంచి, గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడం అభినందనీయం. యువగళం పాదయాత్రలో కేజీ నుండి పీజీ వరకు విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు లోకేష్. గతంలో పంచాయతీ శాఖా మంత్రిగా ఎల్ ఈ డీ బల్పులు ఏర్పాటు,సిమెంట్ రోడ్లు నిర్మాణంతో గ్రామాల రూపు రేఖలు మార్చారు.
ఐటి మంత్రిగా రాష్ట్రంలో ఐటి కంపెనీలు ఏర్పాటు కృషి చేశారు. ఐటి అభివృద్ది పై దృష్టి పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక శోభతో అలరారింది.ఇప్పుడు ఐటి ,విద్యా శాఖా మంత్రిగా విద్యా వ్యవస్థ సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం లో విద్యా రంగానికి మహర్దశ పట్టనుంది. ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షించి ఉన్నత విద్యా వ్యవస్థను ఏడాదిలోపు పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని, కళాశాలలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడేలా కరికులమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ నాలుగేళ్లు చదివినా రాని ఉద్యోగం, అమీర్‌పేట్‌లో నాలుగు నెలల శిక్షణతో ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇకపై ఇతరత్రా శిక్షణలు అవసరం లేకుండా, కేవలం చదువుతోనే ఉద్యోగాలు వచ్చేలా కాలేజీల్లో తగిన శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసి విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని అధికారులను కోరారు.
ఉన్నత విద్యలో మార్పులు తెచ్చి, యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెంచాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంచాలని, ఉన్నత విద్యకు సంబంధించిన ఆస్తుల విభజనపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లు పడిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీచర్లకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించి.. పూర్తి స్థాయిలో భోధన పైనే దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోనున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసి విద్యా ప్రమాణాలు పెంచి యువత భవిష్యత్ బాటలు వేయాలన్న మంత్రి లోకేష్ ప్రయత్నం నెరవేరాలని కోరుకుందాం.

సీనియర్ జర్నలిస్ట్,
9849625610